
ఆ సినిమా.. విద్యారంగ ప్రగతికి చిహ్నం
హైదరాబాద్: విద్యారంగ ప్రగతికి ‘చదువుకోవాలి’ చిత్రం ఎంతో దోహదపడుతుందని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య ప్రశంసించారు. తాను 30 ఏళ్ల తర్వాత చూసిన మొదటి చిత్రం ఇదేనని ఆయన చెప్పారు. ఖైరతాబాద్‌లోని ఓ థియేటర్‌లో విద్యార్థులతో కలిసి సినిమాను తిలకించిన అనంతరం ఆయన మాట్లాడారు. బాలికల చదువు విషయంలో రూపొందించిన ఉత్తేజభరితమైన పాటలు, కథ అందరినీ కదిలించే తీరుగా ఉందని కొనియాడారు.
తాము నిర్వర్తించాల్సిన బాధ్యతను విజయవంతంగా పూర్తిచేసిన సీనియర్ జర్నలిస్ట్, దర్శకుడు ఎం.వెంకటేశ్వరరావును అభినందించారు. సామాజిక అంశాల ఆధారంగా సినిమా తీయడం గొప్ప విషయమని చెప్పారు. అనంతరం చుక్కారామయ్యను సన్మానించారు. కార్యక్రమంలో డి.లలిత, ఫార్మసీ కళాశాలల సంఘం అధ్యక్షుడు డాక్టర్ కె.రామదాసు, సూపర్‌వైజర్ నర్సింగరావు, దావూద్ ఖాన్ పాల్గొన్నారు.