డమ్మీ కత్తులతో మహానంది.... నంది కూడా డమ్మీయే..
జూబ్లీహిల్స్: గది నిండా తుపాకులు, మెషిన్‌గన్లు.. కుప్పలు తెప్పలుగా పడేసిన కత్తులు, కటార్లు, శిరస్త్రాణాలు.. ఇదేదో ఆయుధాల గోదాం కాదు.. కదనరంగం కోసం సిద్ధం చేసిన ఏర్పాట్లు అంతకంటే కాదు. అన్నీసినిమాల్లో వాడేందుకు సిద్ధం చేసిన డమ్మీఆయుధాలు. చిత్రాలకు ఎప్పటినుంచో సినీఆయుధాలు సరఫరా చేసే ‘శ్రీశైల మహానంది’ కార్యాలయంలోకి అడుగు పెడితే.. ఆయుధాల లోకంలోకి వెళ్లినట్టు ఉంటుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా సినిమాషూటింగ్‌లకు కావాల్సిన రకరకాల పరికరాలు సరఫరా చేసే ‘మహానంది’ యూసుఫ్‌గూడ, కృష్ణానగర్‌లో అందరికి సుపరిచితుడే.
కర్నూలు జిల్లాకు చెందిన మహానంది దాదాపు రెండు దశాబ్దాల క్రితమే ఉపాధి కోసం నగరానికి వలస వచ్చాడు. సినీరంగంలో చిన్నాచితకా పనులు చేస్తూ క్రమంగా సినిమా షూటింగ్‌ల్లో వినియోగించే పలు రకాల వస్తువులను అందించే సప్లయర్‌గా నిలదొక్కుకున్నాడు. రెండు దశాబ్దాలుగా వందలాది సినిమాలకు ఆయన పలురకాల వస్తువులు సరఫరా చేస్తున్నాడు.
అదరహో ‘బాహుబలి’
తెలుగు చలనచిత్ర రంగంలో రికార్డులు తిరగరాసిన ‘బాహుబలి’ అంటే ప్రేక్షకులకే కాదు.. సినీరంగానికి చెందిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన క్రేజ్. ఆ చిత్రంలో ఒక్క చిన్న వేషం వేసినా చాలనుకున్న నటులు చాలామందే ఉన్నారు. అలాంటి చిత్రానికి రెండు భాగాల్లో వాడిన కత్తులు, యుద్ధ సామగ్రిని మహానందే సరఫరా చేశాడు. ‘ఈ సినిమా కోసం వందలాది కత్తులు ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తయారు చేయించాం. తాజాగా చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నర్సింహారెడ్డి’కి కావాల్సిన యుద్ధ సామగ్రిని సైతం మేమే సరఫరా చేస్తున్నాం’ అని గర్వంగా చెబుతాడు మహానంది.
తాకితేనే తెలిసేది.. ‘డమ్మీ’ అని
పోలీస్ ట్రైనింగ్‌లో భాగంగా కానిస్టేబుల్స్, హోంగార్డులకు డమ్మీ తుపాకులతో శిక్షణ ఇస్తారు. శిక్షణ ప్రారంభంలో నిజమైన తుపాకులతో శిక్షణ ఇస్తే ప్రమాదవశాత్తు పేలితే ప్రాణనష్టం. కాబట్టి ఈ ఏర్పాట్లు చేస్తారు. ఏ చిత్రం షూటింగ్‌లో పోలీసుల శిక్షణ ఉందంటే అందుకు అవసరమైన డమ్మీ తుపాకులను కూడా ఇక్కడి నుంచి సరఫరా చేస్తారు. చెక్క బరువుగా ఉంటే ఇబ్బందని.. తేలికైన బూరుగు చెక్కతో తుపాకులను రూపొందిస్తారు. వాటికి మధ్యలో ఇనుప ముక్కలు అమర్చి నిజమైన తుపాకుల్లా కనిపించేలా చేస్తారు. ఇక కత్తులనైతే పూర్తిగా రబ్బరుతో రూపొందించి రంగులు వేస్తారు. తాకితే అవి డమ్మీ అని చెప్పగలరు కానీ.. చూసినవాళ్లు మాత్రం అవి నిజమైనవే అని భ్రమపడతారు.
వృత్తినే నమ్ముకున్నా..
ఈ నగరం నన్ను ఆదరించింది. రెండు దశాబ్దాలుగా సినిమాలకు అవసరమైన పరికరాలు సప్లయ్ చేస్తూ ఉపాధి పొందుతున్నాను. ‘బాహుబలి’ సినిమాకు పనిచేయడం జీవితంలో మర్చిపోలేను. దర్శకుడు రాజమౌళి ప్రత్యేక శ్రద్ధతో కత్తులు తయారు చేయించారు. కొన్ని వందల సినిమాలకు రకరకాల పరికరాలు అందించాను. ఈ వృత్తి సంతృప్తికరంగా ఉంది. – శ్రీశైలం మహానంది
Comments
Please login to add a commentAdd a comment