సీన్ వివరిస్తూ... సుబ్బారావు
ఇక్కడ నిరాదరణకు గురైన ఆయన ఇప్పుడు భోజ్‌పురిలోప్రముఖ దర్శకుడిగా రాణిస్తున్నాడు.సొంత గడ్డపై మమకారంతో తాను దర్శకత్వం వహించే సినిమాలు ఎక్కువగా నగరంలోనే షూటింగ్ చేస్తున్నాడు. ఇక్కడి సాంకేతిక నిపుణులకు అవకాశం కల్పిస్తున్నాడు. ప్రస్తుతం భోజ్‌పురి అగ్ర నటుడు దినేశ్‌లాల్ యాదవ్ హీరోగా సుబ్బారావు తెరకెక్కిస్తున్న ‘జై వీర్’ చిత్రీకరణ సిటీలోని సారథి స్టూడియోలో జరుగుతోంది.
ఈ సందర్భంగా ఆయన సినీ జర్నీని‘సాక్షి’తో పంచుకున్నారిలా...
బంజారాహిల్స్ : నాది కడప జిల్లాలోని ప్రొద్దుటూరు. తిరుపతిలో టైలరింగ్ చేస్తూ బీఏ పూర్తి చేశాక, సినిమాలపై ఆసక్తితో 1996లో హైదరాబాద్ వచ్చాను. కృష్ణానగర్‌లో సినిమా ఓనమాలు నేర్చుకున్నాను. అక్కడో గది అద్దెకు తీసుకొని, దర్శకుడు విక్టరీ మధుసూదనరావు దగ్గర అసిస్టెంట్‌గా చేరాను. మౌళి దగ్గర ఎక్కువ సినిమాలకు అసిస్టెంట్‌గా వర్క్ చేశాను. తర్వాత తెలుగులో ‘కామెడీ కింగ్స్’, ‘రామ్మా చిలకమ్మా’ అనే సినిమాలకు దర్శకత్వం వహించాను. అయితే అవి విడుదలకు నోచుకోలేదు. అనంతరం కుట్టి పద్మిని నిర్మించిన ‘మనసే మందిరం’ అనే టీవీ సీరియల్‌కు దర్శకుడు వై.నాగేశ్వరరావు దగ్గర పని చేయగా... ఆ సీరియల్ దర్శకత్వ బాధ్యతలు నాకే అప్పగించారు. సినీ తారలు భానుప్రియ, రంజిత, సురేష్‌లతో కలిసి ఈ సీరియల్ తీశాం. సినిమా తారలతో తీసిన మొట్టమొదటి సీరియల్ కూడా అదే. నా ప్రతిభను గుర్తించిన హీరో సురేష్.. ‘శివుడు’, ‘మనమిద్దరం’ అనే రెండు సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఎన్నో కథలు రాసుకొని దర్శక నిర్మాతలు, హీరోల దగ్గరికి వెళ్లాను. అయితే అందరూ నన్ను ‘ఐరన్ లెగ్’ అంటూ గేలి చేశారు. ఆ సమయంలో భోజ్‌పురి నిర్మాత నాసిర్ జమాల్ పరిచయం నా కెరీర్‌ను మలుపు తిప్పింది. నాసిర్ జమాల్ కూడా తెలుగువాడే. నగరంలోని పాతబస్తీకి చెందినవాడు.
ఫస్ట్‌తోనే బెస్ట్...
అప్పుడప్పుడే భోజ్‌పురి సింగర్‌గా రాణిస్తున్న దినేశ్‌లాల్ యాదవ్ అనే యువకుడితో నన్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాసిర్ జమాల్ ‘కైసే కహీ తాహరాసే ప్యార్ హోగయిల్’ (నా మనసులో ఉన్నది నీతో ఎలా చెప్పను) అనే సినిమా తీశారు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. నాకు ఎనలేని పేరొచ్చింది. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే హిందీ, భోజ్‌పురి నేర్చుకున్నాను. ఆ సినిమాతో దినేశ్‌లాల్ భోజ్‌పురిలో సూపర్ స్టార్ అయ్యారు. ఇక నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా ఆయనతో 12 సినిమాలు తీసి హిట్ కొట్టాను.
75 థియేటర్లలో...
ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, నేపాల్, పంజాబ్, ముంబై, గుజరాత్, అసోం, ఒడిశా, రాజస్థాన్, మారిషస్, దుబాయ్‌లలో భోజ్‌పురి సినిమాలకు బాగా ఆదరణ ఉంటుంది. సౌత్ నుంచి నార్త్‌కు ఎంతోమంది తెలుగు దర్శకులు వెళ్లినా నిలదొక్కుకోలేదు. నేను మాత్రం భోజ్‌పురి సినిమాలను ఒక మలుపు తిప్పాను. ఓ సినిమా ఏకంగా 75 థియేటర్లలో ఆడింది. నా కొడుకు పేరు మీద శ్రీసాయి ప్రొడక్షన్స్ బ్యానర్‌ను ఏర్పాటు చేసి రెండు సినిమాలు తీసి హిట్ కొట్టాను.
35 రోజుల్లో తీసేస్తా...
ఏడాదికి రెండు సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహిస్తాను. నా సినిమా 35 రోజుల్లోనే పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించుకుంటాను. నేను నగరంలోని చింతల్ ప్రాంతం. అక్కడ చింత చెట్ల కింద కూర్చొని సినిమా కథలు, మాటలు రాసుకుంటాను. ఒక పద్ధతి ప్రకారం సినిమా తీయడమే కాకుండా భోజ్‌పురిలో ఉన్న కొన్ని సంప్రదాయాలను తిరగరాశాను. భోజ్‌పురి సినిమా అనగానే ఒకప్పుడు 30 పాటలుండేవి. ఇప్పుడు ఆరు పాటలకు తగ్గించి కథకు ప్రాధాన్యతనిస్తున్నాను.
అదేనా బాధ...
నేను తెలుగులో మూడు సినిమాలు తీసినా అంతగా పేరు తెచ్చుకోలేదు. రెండు సినిమాలు మంచి ఆదరణ పొందినా... ఎందుకో నన్ను ఫెయిల్యూర్ డైరెక్టర్ అంటూ ముద్ర వేశారు. ఆ కసితోనే భోజ్‌పురిలో అడుగుపెట్టాను. తెలుగు సినిమాలకు దూరమయ్యానన్న బాధ అప్పుడప్పుడు వేధిస్తుంటుంది. అయితే ఆ సినిమాలను ఎక్కువగా తెలుగు గడ్డ మీదే తీస్తుంటాను. ఇది నాకెంతో గర్వంగా ఉంది.
ఇక్కడొస్తే చేస్తా...
తెలుగులో అవకాశాలు వస్తే తప్పకుండా దర్శకత్వం వహిస్తాను. నాకు ఫలానా దర్శకుడు ఇష్టమని చెప్పను. సినిమాలో కదిలించే సన్నివేశం, మనసును హత్తుకునే దృశ్యాలుంటే ఆ దర్శకుడు ఇష్టమవుతాడు. తెలుగు సినిమాలో ఫెయిల్యూర్ అయినవారు భోజ్‌పురికి వెళ్లొచ్చని అప్పట్లో కామెంట్ చేశారు. అది నన్ను ఉద్దేశించి చేసిందేనని నాకు తెలుసు. అందుకే భోజ్‌పురి కల్చర్ తెలుసుకొని, హిందీ నేర్చుకొని పక్కా కథ ఉన్న సినిమాలను నిర్మిస్తున్నాను. ప్రస్తుతం అక్కడి ప్రముఖ దర్శకుల్లో ఒకడిగా నిలుస్తున్నాను. కష్టపడితే సాధించలేనిదేదీ లేదని నిరూపిస్తున్నాను.
Comments
Please login to add a commentAdd a comment