
వివక్ష ఉంటే విముక్తి ఎక్కడిది?
సందర్భం
తిరిగి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్న ధోరణి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కారణమయింది. ఈ ఉద్యమం ఏ స్వరూపం తీసుకున్నదో నేను మరోసారి మననం చేయదల్చుకోలేదు. కానీ అణచివేత ఉన్నంతవరకూ ఉద్యమాలు కొనసాగుతూనే ఉంటాయనీ, దోపిడీ ఉన్నంతవరకూ పోరాటాలు ఉద్భవిస్తూనే ఉంటాయనీ మలి తెలంగాణ పోరాటం రుజువు చేసింది. సమస్యను అర్థం చేసుకోవడానికి బదులుగా, ప్రజా ఆవేశాన్ని అర్థం చేసుకోవడానికి బదులుగా అణగదొక్కడమే పరిష్కారం అనుకొన్నారు.
ఏటా సెప్టెంబర్ 17 వస్తుంది. ఆ రోజును మాలాంటి వారు విమోచన దినం అనీ, విముక్తి దినమనీ, విప్లవమనీ వర్ణిస్తూ ఎవరికి నచ్చిన పదాలు, వారి వారి అభిప్రాయాల మేరకు అన్వయిస్తున్నాం. ఆర్భాటంగా ఉపయోగి స్తున్నాం. కానీ ప్రపంచ చరిత్రను సమగ్రంగా చదివితే అలాంటి పదాలకు ఉండే అర్థాలు చాలా విస్తృత స్థాయిలో కనిపిస్తాయి. చాలా లోతులకు మన ను తీసుకువెళతాయి. కానీ మన తెలంగాణకు సంబంధించినంత వరకు సెప్టెం బర్ 17 సందర్భాన్ని ఏ పదంతో స్మరించుకోవాలో నాకర్థం కాలేదు.
విమోచనైనా, విముక్తి అయినా...
ఒకసారి నేను గతానికి వెళితే ఈ నా పుట్టుకలో నాతో పాటు గ్రామాల్లో ఉండే ప్రజలు బాంచెన్ దొర తీరులో జీవనం సాగించిన వైనం నా కళ్ల ముందు కదులుతూ ఉంటుంది. కాబట్టే ఆ పదానికి ఉన్న అర్థం అంత లోతుగా కనిపి స్తుంది. సామాన్య తెలంగాణ వాసి అనుభవించిన బానిసత్వం, ఆ ఘోర చరిత్ర ఆ పదంలో ప్రతిబింబిస్తుంది. ప్రతిధ్వనిస్తుంది. ఇంకా చెప్పాలంటే తెలంగాణ బిడ్డ దొర ముందు సాగిలపడేలా చేసిన ఒక దుస్థితికి చారిత్రక ఆనవాలు ఆ పదం. దొరతనాన్ని ధిక్కరిస్తూ, బానిసత్వాన్ని తిప్పికొడుతూ అక్కడ ఆరంభమైన పోరాటమే, మరింత విస్తృతమై నీళ్ళు, నిధులు, కొలు వులు అనే పోరాటానికి మార్గం చూపింది. ఇంకా ఈ ఉద్యమం ఎంత దూరం ప్రయాణించాలో, ఎన్ని మలుపులు తిరగాలో నాకు అర్థం కావడం లేదు. ఈ సందిగ్ధం గురించి ప్రస్తావిస్తే కొంతమంది సాయుధ పోరాటం నుంచి వివ రణ ఆరంభిస్తారు. కానీ ఆనాడు ఆయుధాలు గురిపెట్టింది ఎవరు? నా అను భవం మేరకు ఆనాడు మొదట ఆయుధాలు ఎక్కుపెట్టిన వారు సాధారణ ప్రజలు మాత్రం కాదు.
తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రపంచ ఖ్యాతి ఉన్నమాట వాస్తవం. అయినా మరొక అంశం కూడా వాస్తవమే. ఆ పోరాట వేళలోనే కాదు మొద టిగా ఎప్పుడూ ప్రజలు ఆయుధాలు పట్టిన దాఖలాలు నాకు తెలియదు. ఎందుకంటే సాధారణ ప్రజలు కల్లోలాలని ఆహ్వానించాలని అనుకోరు. కాలం మీద గాయాన్ని మిగల్చాలని భావించరు. వారికి కావాల్సింది బాని సత్వానికి చోటు లేని స్వేచ్ఛా జీవితం. అందుకు తుపాకులే అవసరం లేదు. కానీ ఆ పోరులో తూటాలకు బలైనది మాత్రం ప్రజలే. అదైనా పోలీసు తూటాలకు కాదు. భూస్వాముల ఆయుధాలకు బలయ్యారు. అప్పుడు తమను కాపాడుకోవడానికి ఆయుధాలు పట్టే పరిస్థితి వచ్చింది. అంతకంటే ఆ పరిస్థితిని నాటి పాలకులు, పాలక వర్గం తీసుకువచ్చిందనడం సబబు.
అది భూపోరాటమే, మత ఘర్షణ కాదు
కానీ చరిత్ర మీద ఆ పోరాటం జాడ ఏ రూపంలో ఉంది? ప్రజలే సాయుధ పోరాటం చేశారని ప్రచారం చేశారు. కానీ అది భూపోరాటంగా ఆరంభమైన మాట నిజమే. ఆ తరువాత సాయుధ పంథాను తీసుకున్నది. ఓ పక్క వేల ఎకరాల భూస్వాములు. తిండి లేక ఆకలికి అలమటిస్తున్న ప్రజలు మరోవైపు. తెలంగాణ గడ్డమీద పుట్టిన ప్రతి బిడ్డకూ అనుభవంలోకి వచ్చిన అసాధారణ అంతరాలివి. శ్రమించే రైతులున్నారు. కష్టపడే ప్రజలున్నారు. శ్రమ శక్తిని నమ్ముకున్న యువకులున్నారు. పండించేందుకు భూమి మాత్రం వారి చేతిలో లేదు. భూమి ఉన్న వారికి పై లక్షణాలేవీ లేవు. అందుకే ప్రజలు వెట్టిచాకి రిలో మగ్గిపోతున్నారు. అప్పుడే భూమి ఒక చోట, శ్రమ ఒకచోట కాదు; శ్రమించే వాడికే భూమిపై హక్కుండాలన్నారు.
‘దున్నేవాడికే భూమి’ అనే నినాదం ముందుకొచ్చింది. దానికి కమ్యూనిస్టులు అండగా నిలిచారు. ఆ నినాదమే తెలంగాణ ప్రజలందరినీ ఒకే తాటిపైకి తెచ్చింది. అణచివేతకు గురైన ప్రజలు అదే నినాదంతో భూస్వాముల అఘాయిత్యాలను, దుర్మార్గాలను ఎదుర్కొ న్నారు. ఈ నేపథ్యంలోనే మరొక వాస్తవాన్ని కూడా గమనించవలసి ఉంది. ఆ పోరాటం ముస్లింల వ్యతిరేక పోరాటంగా భావించడం సరికాదు. ముస్లిం పాలకుడు కనుక అతనికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడారనడమూ తప్పే. అది ముస్లిం వ్యతిరేకపోరాటమైతే బందగీ ఎందుకు చనిపోయినట్టు? అదే నిజమైతే షోయబుల్లాఖాన్ ఎందుకు హత్యకు గురైనట్టు? ప్రజాపోరాటాలు తీవ్రమైనప్పుడు దానికి మతం రంగు పులిమే ప్రయత్నం చేస్తారు. అది స్వాతంత్య్ర పోరాటం మొదలు, నేటి వరకూ కొనసాగుతోంది. ఆనాడైనా, ఈనాడైనా ఈ రెండు మతాల మధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టడం కొందరి ప్రయోజనం కోసమే.
మూడు రోజుల కథ
తెలంగాణ ప్రజలు పిడికెడు భూమి కోసం ప్రాణాలర్పించారు. దొరల నుంచి, భూస్వాముల నుంచి ప్రజలు భూమిని స్వాధీనం చేసుకున్న మాట కూడా వాస్తవమే. నాటి నైజాం ప్రభుత్వం ప్రజాభూపోరాటాలను ఎదర్కోలేక కాశీం రజ్వీని ప్రతిష్టింపజేసింది. అతనిద్వారా ప్రైవేటు సైన్యంతో ప్రజల్లో విధ్వం సకాండను సృష్టించింది. చరిత్రలో ప్రభుత్వాధినేతలు ప్రజా ఉద్యమాలను అణచడానికి ప్రభుత్వ ముద్రలేకుండా ఉండేందుకు, తమ ఆధిపత్యాన్ని నిల బెట్టుకునేందుకు ప్రైవేటు వ్యక్తులతో దుర్మార్గాలు చేయిస్తారు. అది దుర్మా ర్గమే అనుకుంటే దాన్ని ఆపడం వారికి పెద్ద కష్టమేం కాదు. కానీ అధికార ముద్ర ఉన్నప్పుడు అదే స్వయంగా దాడులకు పాల్పడుతుంది. అటువంటిదే బైరాన్‌పల్లి పరిణామం. మనుషులను నిలబెట్టి కాలుస్తుంటే ఆపడం నైజాంకి కష్టమేమీ కాదు. కానీ అది రాజముద్ర గల దాడి కాబట్టి ఆపలేకపోయారు. ప్రజలు బలయ్యారు. ఇలాంటి సంఘటనలు తెలంగాణ పోరాటంలో కోకొ ల్లలు.
రాజు గారికి భారత ప్రజలతో కలసి ఉండడం ఇష్టం లేక రజాకార్ల పేరుతో తన అభీష్టాన్ని పరిపూర్తి చేసుకునే ప్రయత్నం చేశారు. అది భారత దేశ స్వాతంత్య్రమనే ఉన్నత లక్ష్యానికి అడ్డంకి అని ప్రజలు గుర్తించి తమ భూపోరాటాన్ని ఆ స్వాతంత్య్రోద్యమంతో అనుసంధానించారు. వందల మంది ప్రాణత్యాగాలు చేశారు. భారత సైన్యం జోక్యం తప్పలేదు. కానీ ఇదంతా మూడు రోజుల్లోనే ముగిసింది. ప్రజల సహకారం ఏ స్థాయిలో అందినందువల్ల హైదరాబాద్‌పై త్రివర్ణ పతాకం రెపరెపలాడగలిగింది? జన రల్ చౌదరి కమాండర్ అయ్యాడు. కానీ ప్రజలు సాధించుకున్నటువంటి భూమిని తిరిగి భూస్వాములకు అప్పగిస్తుంటే భారత సైన్యం ప్రజలకు అండగా ఉండాల్సిందిపోయి, భూస్వాముల పక్షాన నిలిచింది. దీంతో ప్రజలు ప్రాణాలర్పించడానికి వెనుకాడలేదు. ఉద్యమంలో తాడో పేడో తేల్చుకోవడా నికి సిద్ధపడ్డారు. అది భూపోరాట విస్తరణ కాదా? అని నేను ప్రశ్నిస్తున్నాను. సెప్టెంబర్ 17 విమోచనమే అయితే ప్రజలు కష్టాల నుంచి విముక్తి అయ్యారా? అని నేను ప్రశ్నిస్తున్నాను. కచ్చితంగా కాలేదు.
స్పష్టమైన జవాబుల కోసం ఆరాటం
ఈ పోరాటమంతా భూమి మీద హక్కు కేంద్రంగా సాగింది. అందుకే అన్ని ప్రాణ త్యాగాలు జరిగాయి. చిన్నా పెద్దా, స్త్రీపురుష భేదం లేకుండా రణ రంగంలోకి దిగారు. అంతటి త్యాగాలు చేశారు. చివరకు భారత ప్రభుత్వం సంప్రదింపులు జరిపి 1952లో దీన్ని విర మణ చేయించలేదా? అన్నది నా ప్రశ్న. కాబట్టి ప్రజల భూపోరాటాలే పార్లమెంటరీ పంథాగా మార్పు చెందాయి. దాని ఫలితమే భూ సంస్కరణలు. ఆ భూ సంస్కరణలు చిత్త శుద్ధితో అమలు జరపకపోవడమే ప్రజల అశాంతికి కారణమయింది. అదే ప్రజా ఉద్యమానికి దారితీసింది. అంతేకాకుండా హైదరాబాద్‌ని ఒక ఆక్రమిత ప్రాంతంగా పరిగణించే ధోరణిని హైదరాబాద్ ప్రజాస్వామికవాదులు భరించలేకపోయారు. అదే 1969 తెలంగాణ ఉద్యమంగా వచ్చింది. దాని కొనసాగింపే సిక్స్ పాయింట్ ఫార్ములా.
కానీ తిరిగి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్న ధోరణి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కారణ మయింది. ఈ ఉద్యమం ఏ స్వరూపం తీసుకున్నదో నేను మరోసారి దాన్ని మననం చేయదల్చుకోలేదు. కానీ అణచివేత ఉన్నంత వరకూ ఉద్యమాలు కొనసాగుతూనే ఉంటాయనీ, దోపిడీ ఉన్నంత వరకూ పోరాటాలు ఉద్భవిస్తూనే ఉంటాయనీ మలి తెలంగాణ పోరాటం రుజువు చేసింది. సమస్యను అర్థం చేసుకోవడానికి బదులుగా, ప్రజా ఆవేశాన్ని అర్థం చేసుకోవడానికి బదులుగా అణగదొక్కడమే పరి ష్కారం అనుకొన్నారు. దాన్నే శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయం ద్వారా అమలు చేయాలని చూశారు. ప్రజలకు త్యాగాలు అలవాటేనన్న విషయం పాలకులు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. తుపాకీ గుండ్లు గుండెల్లో దిగుతున్నా దిగమింగ డమూ ప్రజలకు ఎవరూ నేర్పక్కర్లేదు.
మలి తెలంగాణ ఉద్యమాన్ని శాంతి యుతంగా నడపాలని ప్రయత్నించారు. అన్నీ సహించారు. ఉద్యమం హింసా త్మకంగా మారకుండా చాలా ఓర్పునీ, సహనాన్ని ప్రదర్శించారు. చివరకు దెబ్బలు తిన్నారు. కానీ ప్రభుత్వాలకు ఎప్పటి మాదిరిగానే శాంతి కన్నా పోలీస్ బలగాల పైనే నమ్మకం ఎక్కువ. దీంతో ప్రజలు తమకు తామే ప్రాణత్యాగాలకు పాల్పడ్డారు. ఆత్మ బలిదానాలు చేశారు. ఏ ఉద్యమంలో అయినా ఇన్ని ఆత్మత్యాగాలు చూశామా? ఒక్క పిలుపుతో మిలియన్ మార్చ్ జరుగుతుందా? నెక్లెస్ రోడ్‌పై వానలో తడుస్తూ కూడా ప్రజలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. సాగరహారానికి చివరి వరకు అనుమతివ్వకపోయినా సాగర హారాన్ని విజయవంతం చేసుకున్నారు. వీటిలో ఏ ఉద్యమాన్ని మనం విముక్తి పోరాటం అందాం? ఏ ఉద్యమాన్ని మనం విమోచన పోరాటంగా పిలుద్దాం? తెలంగాణ ఉద్యమంలో ఎన్నో రోజులు విమోచన దినాల వంటివే. అందులో ఎన్నో సెప్టెంబర్ 17లు ఉన్నాయి.
త్యాగాలకు సిద్ధమైన జాతికి దేశం కోసం, రాష్ట్రం కోసం బలి అవటమే ఆనందం. ఇది పోరాటాల గడ్డ. ప్రజల జీవితాలు పోరాటాలతో ముడిపడి ఉన్నాయి. అన్యాయాన్ని ధిక్కరించడం ప్రజలకు నేర్పక్కర్లేదు. అణచివేత ఉన్నంత వరకూ, వివక్ష కొనసాగినంత కాలం, ఆర్థిక అంతరాలు కొనసాగి నంత కాలం, దోపిడీ ఉన్నంత వరకూ ఉద్యమాలు కూడా వాటి వెన్నంటే ఉంటాయి. కాకపోతే కాస్త అటూ ఇటూగా ప్రారంభమవుతాయి. అంతే తేడా. ప్రజాస్వామ్యంలో పోరాటాలకు చివరి రోజు ఉండదు. ముగింపు కూడా ఉండదు. రక్త తర్పణ చేసినప్పుడే మాకు పండుగ. కాబట్టి సెప్టెంబర్ 17 చరిత్రలో ఉద్యమాన్ని మలుపుతిప్పిన రోజు. కానీ అదే ఉద్యమానికి ముగింపు కాదు, కాకూడదు.
(నేడు తెలంగాణ విమోచన దినం)
చుక్కా రామయ్య
వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త,
శాసనమండలి మాజీ సభ్యులు