ఆ ‘పాదయాత్ర’ అసాధారణం | Chukka Ramaiah Exclusive Interview With KSR | Sakshi
Sakshi News home page

ఆ ‘పాదయాత్ర’ అసాధారణం

Published Wed, Aug 15 2018 1:10 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

Chukka Ramaiah Exclusive Interview With KSR - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సాగిస్తున్న పాదయాత్ర ప్రభావం అసాధారణంగా ఉందని ప్రముఖ విద్యావేత్త, ఐఐటీ శిక్షకుడు చుక్కారామయ్య ప్రశంసించారు. ఇన్నాళ్లు పాదయాత్ర సాగుతున్నా జనం విసుక్కోవడం లేదని అదే దాని ప్రభావానికి నిదర్శనమన్నారు. ప్రధాన ప్రతిపక్షం చాలా బలంగా ఉండటం, బలంగా లేకపోవడమే ఆంధ్ర, తెలంగాణ రాజకీయాలలో ముఖ్యమైన తేడా అని విశ్లేషించారు. దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థలైన ఐఐటీల్లో తెలుగు విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో ఆ పరిస్థితిని మార్చాలన్న తలంపే తనను ఐఐటీ శిక్షణ వైపునకు మళ్లించిందని చెప్పారు. పిల్లలకు తాను పాఠాలు చెప్పడం కంటే ఎక్కువగా వారినుంచే నేర్చుకున్నానని, ఇప్పటి పిల్లల ప్రతిభ, చురుకుదనం ముందు రామయ్యలు కూడా సరిపోరంటున్న చుక్కారామయ్య అభిప్రాయం ఆయన మాటల్లోనే...

‘ఐఐటీ రామయ్య’ అనే స్థాయికి ఎలా వచ్చారు?
వరంగల్‌లోని మా ఊరు గూడూరులో మా ఇల్లు తప్పితే నాకు మరే ఆస్తీ లేదు. మన అభిప్రాయాలు వ్యక్తం చేయాలంటే ఒక మాధ్యమం అవసరం. విద్యే నాకు ఆ మాధ్యమంగా ఉపయోగపడింది.

మీ చదువుకు పునాది ఎవరు?
నాన్నకు నన్ను తనలాగే పౌరోహిత్యం చేయించాలని ఉండేది. కానీ అమ్మ మాత్రం ఆ మంత్రాలు వాడు చదవడు. ఆ చదువు వద్దు అని మొండికేసింది. మరి ఎక్కడికి పంపిస్తావు అని ఆయన అడిగితే నమ్మాళ్వారు వద్దకు పంపిస్తానంది. నమ్మాళ్వారు అంటే ప్రభుత్వ బడే లేని మా ఊళ్లో ఒక టీచరు. నమ్మాళ్వారు గారు చాలా గొప్ప టీచరు. పదేళ్లు కూడా రాకముందే మాకు చక్రవడ్డీ లెక్కలు వేయించేవారు. ఎందుకంటే, మా ఊళ్లో అప్పట్లో ఇద్దరు వడ్డీ వ్యాపారులు ఉండేవారు. ఎవరైనా వారి వద్ద అప్పు తీసుకుంటే వాళ్లు వడ్డీ సరిగా లెక్కిస్తున్నారా లేదా అని తేల్చుకోవడానికి జనం మా టీచరు వద్దకు వచ్చేవారు. జనం చూపిన ఆ లెక్కలు ఆయన చేయకుండా మా వద్ద చేయించేవారు. దాంతో మాకు చిన్నప్పుడే బారువడ్డీ అంటే ఏమిటో తెలిసింది. అలా లెక్కలపై మాకు ఆసక్తి పెరిగింది. విద్యకు సామాజిక లక్షణం ఏమిటో ఆయన చూపించారు.

ఐఐటీ రామయ్యగా ఎలా మారారు?
సామాజిక ఉద్యమాల్లో పాత్ర కారణంగా నన్ను సంవత్సరం పాటు జైల్లో పెట్టినప్పుడు అక్కడ పరిచయమైన ధర్మభిక్షం గారికి సూర్యాపేటలో హాస్టల్‌ ఉండేది. నేను కూడా అలాంటి హాస్టల్‌ ఏర్పర్చాలి అనే ఆలోచనతో బోన్‌గిరిలోనే ఒక హాస్టల్‌ తెరిచాను. 40 మంది పిల్లలుండేవారు. అప్పుడే ఉర్దూకు బదులు తెలుగు మీడియం రావడంతో చదువుకోవాలని పిల్ల లకు చాలా ఉత్సాహం కలిగింది. అందుకే పరీక్ష రాస్తే 40మందిలో 12 మంది ఫస్ట్‌ క్లాసులో పాసయ్యారు. టీచరు మంచోడే కానీ పిల్లలను రాజకీయంగా ప్రభావితం చేస్తున్నాడని నాపై ఆరోపణలు రావడంతో నారాయణపేటకు నన్ను మార్చారు. అక్కడ నాలుగేళ్లు పనిచేశాను. అక్కడే టీచర్స్‌ యూనియన్‌లో చేరాను. ఆ నెపంమీద నన్ను సికిందరాబాద్‌ హైస్కూలుకు మార్చారు. అప్పటికి మా తమ్ముడు బాంబే ఐటీఐలో చదువుకుని అహమ్మదాబాద్‌లో ఉద్యోగం తెచ్చుకున్నాడు. ఎమ్మెస్సీ చదవాలనే నా ప్రగాఢ వాంఛకు అతడు డబ్బులు సహాయం చేయడంతో స్కూల్‌ మానేసి ఎమ్మెస్సీలో చేరాను. అక్కడ క్లాసులో చెప్పేది నాకు అర్థమయ్యేది కానీ జ్ఞాపకం ఉండేదికాదు. లేటుగా చదవడం వల్ల జ్ఞాపక శక్తి లోపిం చింది. దాంతో నా తోటి విద్యార్థులను మా ఇంట్లో కూర్చోబెట్టి క్లాసులో లెక్చరర్లు చెప్పింది వారికి మళ్లీ చెప్పసాగాను. ఇలా ఒకటికి రెండుసార్లు చెప్పడం వల్ల నాకు పాఠం మొత్తం గుర్తుండిపోయింది. పాఠం చెప్పిన నేనూ గోల్డ్‌ మెడల్‌ తెచ్చుకున్నాను. నా పాఠం విన్న వాళ్లూ స్వర్ణపతకాలు తెచ్చుకున్నారు.

పూర్తి అవగాహనతోనే ఐఐటీ కోచింగ్‌ సంస్థ పెట్టారా?
ఐఐటీ సబ్జెక్టులు చాలా కష్టం కదా. మొదట్లో తెలిసేది కాదు. అందుకే తొలి సంవత్సరం నేను కోచింగ్‌ మొదలెట్టిన తొలి సంవత్సరం తొమ్మిదిమందికి శిక్షణ ఇస్తే ఒకరూ పాస్‌ కాలేదు. దీని అంతు ఏదో తేల్చాలనుకుని ఐఐటీ ప్రశ్నపత్రాలన్నింటినీ తీసి చదివాను. వాటిలో ఉన్న ప్రత్యేకత ఏదంటే ఏ ప్రశ్నను కూడా వారు పాఠ్యపుస్తకంలోంచి సెలెక్ట్‌ చేయరు. పైగా ఈ సంవత్సరం వచ్చిన ప్రశ్నపత్రం వచ్చే ఏడు రాదు. కాబట్టి ఐఐటీల్లో ఏ పుస్తకాలు చదువుతారో వాటిని మనం చదివితే తప్ప మనకు ప్రయోజనం లేదనుకున్నాం. ఖరగ్‌పూర్‌ వెళ్లి అక్కడ వారు చదువుతున్న పుస్తకాలు తీసుకొచ్చి సొంతంగా ప్రాక్టీసు చేశాను. రెండు మూడు గంటలు కష్టపడ్డాను. అప్పట్లో ఖరగ్‌పూర్‌ ఐఐటీలో సబ్జెక్టులన్నింటికీ చాలావరకు రష్యన్‌ పుస్తకాలను చదివేవారు. వాటిని నేను తీసుకొచ్చి గంటలపాటు కసరత్తు చేస్తూ ఉంటే పిల్లలు మాత్రం నాలుగు స్టెప్‌లలో సమాధానం చెప్పేవారు. నాకంటే పిల్లల్లోనే ఎక్కువ ప్రతిభ కనిపించింది నాకు. ఖరగ్‌పూర్‌ ఐఐటీ పుస్తకాలను పట్టుకున్న తర్వాతే రెండో ఏడాది నుంచి పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది. నావద్ద శిక్షణ తీసుకున్న వారు పాస్‌ కావడం, ఉద్యోగాలు సాధించడంతో కాస్త పేరొచ్చింది. నా వద్ద శిక్షణ తీసుకున్న పిల్లలు ఉత్తీర్ణులై ముంబై ఐఐటీలో చేరాక, వారి ప్రతిభను చూసి ఎక్కడ చదువుకున్నారు అని లెక్చరర్లు అడగటంతో రామయ్య వద్ద చదువుకున్నానని చెప్పేవారు. దాంతో నేను ఐఐటీ రామయ్యని అయిపోయాను. ఆ గుర్తింపు నాకు ఆ పిల్లలే తీసుకొచ్చారు తప్ప నేను చదువుకుంటే వచ్చింది కాదు.

విభజన అనంతర తెలంగాణ ఎలా సాగుతోంది?
టెక్నాలజీకి ప్రాధాన్యమిచ్చిన అతిచిన్న దేశాలు సైతం ఇవ్వాళ అభివృద్ధిలో ముందున్నాయి. సింగపూర్, ఫిన్లాండ్, పోలెండ్, దక్షిణ కొరియా ఇవన్నీ చాలా చిన్న దేశాలే అయినా అమెరికా సరసన నిలబడుతున్నాయి. కారణం విద్య మాత్రమే. తెలంగాణలో, మరే రాష్ట్రంలోనైనా సరే.. విద్యకు ప్రాధాన్యత ఇచ్చే నాయకత్వం రావాలి. ప్రభుత్వ ప్రాధాన్యతలు, వాటి ఇబ్బందులు నాకు తెలుసు కానీ విద్యకు ప్రభుత్వాలు తగినంత ప్రాముఖ్యత ఇవ్వడం లేదనిపిస్తోంది.

ఏపీలో, తెలంగాణలో విపక్షం పరిస్థితి ఎలా ఉంది?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం చాలా బలంగా ఉంది. తెలంగాణలో మాత్రం ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన ప్రభుత్వాన్ని తట్టుకుని నిలబడేంత బలంగా ప్రతిపక్షం లేదు. తేడా ఇదే.

ఏపీలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ప్రభావం ఏమిటి?
పాదయాత్రకు అసాధారణ ప్రభావం ఉంది. ఇన్ని నెలలుగా పాదయాత్ర చేస్తుంటే సామాన్యంగా జనం నిరసిస్తారు. కానీ ఆ ప్రభావం కొనసాగుతోంది కాబట్టి పాదయాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది.

(ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి)
https://bit.ly/2MeGq41
https://bit.ly/2w1GKbi

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement