ఫిరాయింపులు సూత్ర విరుద్ధం
కొమ్మినేని శ్రీనివాసరావుతో ఘట్టమనేని ఆదిశేషగిరిరావు
ఫిరాయింపులకు వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశ పార్టీ మూల సూత్రాలకే వ్యతిరేకంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, దీంతో దశాబ్దాలుగా పార్టీ జెండాను భుజాన వేసుకుని, ఏదీ ఆశించకుండా పనిచేస్తూ వచ్చిన టీడీపీ కార్యకర్తల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ప్రముఖ నిర్మాత, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన మౌలిక సమస్యల విషయంలో కేంద్రంతో రాజీపడాలని బాబు చెబుతుండటం టీడీపీ మూల సిద్ధాంతాలకే విరుద్ధమన్నారు. కూడు, గుడ్డ, నీడ అనేది టీడీపీ ఎజెండా కాగా.. గతంలో తొమ్మిదేళ్ల పాలనలో, తాజాగా మూడేళ్ల పాలనలో బాబు ఏపీలో ఒక్కటంటే ఒక్క ఇల్లు కట్టించి ఇచ్చిన పాపాన పోలేదని ఆరోపించారు. గతంలో ఇందిరాగాంధీకే ఎదురు నిలిచిన ఎన్టీఆర్ లాగా, సోనియాగాంధీని ధిక్కరించి రాజకీయం నడుపుతున్నారు కాబట్టే జనం వైఎస్ జగన్‌ని ఆరాధిస్తున్నారని చెబుతున్న ఆదిశేషగిరిరావు అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..
అల్లూరి సీతారామరాజును ఎన్టీఆర్ తీయాలనుకోగా ముందుగా మీరే తీశారట కదా?
జయసింహ సినిమా తీసినప్పుడు ఎన్టీఆర్ ఆ సినిమా పాటల పుస్తకం వెనుక తమ తర్వాతి చిత్రం సీతారామరాజు అని ప్రకటించారు. అది 1959 నాటి మాట. కానీ తీయలేకపోయారు. తర్వాత మా సోదరుడు హనుమంతరావు సీతారామరాజు సినిమా స్క్రిప్ట్ తయారు చేశారు. ఎన్టీఆర్ తీయవద్దని అన్నప్పటికీ ముందుకెళ్లాం. పైగా ప్రత్యేకాంధ్రకు మేమంతా సపోర్టు చేయగా, ఎన్టీఆర్, ఏఎన్నార్ వ్యతిరేకించారు. మనసులో అయితే వారు అనుకూలమే కానీ అప్పుడే వారు మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చేశారు. ప్రభుత్వం వద్ద చిత్ర పరిశ్రమ కోసం భూములు కూడా తీసుకున్నారు. అయితే ప్రత్యేకాంధ్రపై మా వాదాన్ని బలపర్చేవారే ఎక్కువ కావడంతో వారిరువురికీ కోపం వచ్చింది. తెలుగు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కృష్ణా సినీ అసోసియేషన్ అయిపోయింది అని చెప్పి ఇద్దరూ రాజీనామా చేశారు. ఇలా కొన్ని ప్రత్యేక అంశాలపై విభేదాలు వచ్చాయి.
ఎన్టీఆర్‌తో సినిమాల్లో వచ్చిన విభేదం రాజకీయాల్లోను కొనసాగిందా?
అప్పట్లో ‘‘ఈనాడు’’ సినిమా తీసాం. ఆరోజు అది వ్యవస్థా వ్యతిరేక చిత్రం. నాడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి దానికి వ్యతిరేకంగా ఆ సినిమా తీశాం. హీరో సైకిల్ మీద వస్తాడు. 1983 ఎన్నికలకు మూడువారాల క్రితం వచ్చిన ఈ సినిమా పెద్ద హిట్ అయింది. కేరళలో య«థార్థంగా జరిగిన ఒక ఘటనను మన రాజకీయాలకు వర్తించి సినిమా తీశాం. రాజకీయ పార్టీల్లో ఫిరాయింపులు వ్యభిచారంతో సమానం అనే డైలాగ్ కూడా దాంట్లో ఉంది. అంటే ఇవ్వాళ జరుగుతున్న ఫిరాయింపుల వ్యవహారం ఆరోజుల్లోనే ఉంది. ఆనాటికి ఫిరాయింపు వ్యతిరేక చట్టం లేదు. ఆ సినిమాలో ఉన్న డైలాగుల గురించి రామోజీరావు కూడా మాట్లాడారు. ఎన్టీరామారావు అయితే వాటిని చాలాసార్లు ప్రస్తావించారు
ఎన్టీఆర్‌తో రాజకీయ విభేదానికి మూలం?
ఎన్టీఆర్‌పై తిరుగుబాటు చేసి నాదెండ్ల భాస్కరరావు ఏపీ సీఎం అయ్యాక ఆయనను కృష్ణ అభినందించినట్లుగా ఫుల్ పేజ్ యాడ్‌ను పేపర్లలో ఎవరో వేశారు. నిజానికి అన్నయ్యకు నాదెండ్ల గురించి తెలీదు. ఆ ఘటన జరిగినప్పుడు కూడా ఎక్కడో షూటింగులో ఉన్నారు. నాదెండ్లను అన్నయ్య అభినందించినట్లు ఎవరో ప్రకటన వేయడంతో ఎన్టీఆర్‌కు కోపం వచ్చింది. నాకు సంబంధం లేకుండానే ఎవరో ఆ ప్రకటన వేశారని అన్నయ్య వ్యక్తిగతంగా మద్రాసులో కలిసి కూడా చెప్పారు. కానీ ఆ విషయాన్ని ఎన్టీఆర్ మనసులో పెట్టుకున్నట్లుంది. ఆ రోజుల్లోనే అంటే 1984లో ఇందిరాగాంధీ చనిపోయారు. రాజీవ్ గాంధీ పిలుపుమేరకు అన్నయ్య, నేను కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాం. రాజశేఖరరెడ్డి పీసీసీ ప్రెసిడెంటుగా ఉన్నప్పుడే చేరాం. అప్పటినుంచి ఎన్టీఆర్‌కు విరోధులమైపోయాం. వైఎస్ ప్రోద్బలంతోటే తిరుపతి నుంచి మొదలుపెట్టి రాష్ట్రమంతటా విస్తృతంగా తిరిగి కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రచారం చేశాం.
రాజకీయాల్లో మీరు ఎలా యాక్టివ్ అయ్యారు?
2003లో వైఎస్సార్ నన్ను పిలిపించారు. 1975 నుంచి మేమిద్దరం మంచి స్నేహితులం. అన్నయ్య ఎలాగూ రాజకీయాల్లో ఆసక్తి చూపలేదు కదా నువ్వు రా బంగారూ అన్నారాయన. 2003 నుంచే రాజకీయాల్లో యాక్టివ్ అయ్యాను. ఎక్కడా పోటీ చేయలేదు.
రాజశేఖరరెడ్డి, చంద్రబాబు ఇద్దరూ మీకు స్నేహితులే కదా. వీరి మధ్య పోలికలేమిటి?
నమ్మినవారిని ఆదుకోవడం మొదటినుంచి రాజశేఖరరెడ్డికి అలవాటు. చంద్రబాబు మాత్రం వ్యూహకర్త. బాగా ఆలోచించి కొంచెం ముందు చూపుతో వెళతారు. అంటే తనను నమ్మినవారిని నష్టపర్చి అయినా సరే అనుకున్నది సాధించడం కావాలి తనకు. మొన్నటి ఎన్నికలే చూడండి. తొలినుంచి టీడీపీలో ఉన్న వారికి కాకుండా కాంగ్రెస్ నుంచి వచ్చినవారికి టిక్కెట్లు ఇచ్చారు. తాను మొదటిసారి సీఎం కావడానికి కారణమైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హరికృష్ణ వంటివారిని దూరం పెట్టేశారు. ఏమీ లేని చోట గాలిపోగు చేసి బాబు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. అవకాశమే లేనిచోట వీళ్లనూ వాళ్లనూ పోగు చేసి అడ్డమైన వారి కాళ్లూ పట్టుకుని సీఎం అయిపోయాడు. పేర్లు అనవసరం, సీఎం కావాలని అనుకున్నాడు. అయిపోయాడు. పేదలకు ఏదైనా మేలు చేసినవారు ఉన్నారా అంటే మొదట ఇందిరాగాంధీ పేరునే చెప్పాలి. తర్వాత రామారావు. మా రాజకీయ విభేదాలు ఎలా ఉన్నా.. ఆయన పేద ప్రజలకు నిజంగానే ఎంతో కొంత మేలు చేశారు. సంక్షేమం అనే ఆలోచన తనకే తట్టింది. తర్వాత వైఎస్సార్ అలాంటి ప్రయత్నాలే చేశారు. వైఎస్సార్ ప్రజా సంక్షేమానికి ఎన్ని మంచి చర్యలు చేపట్టారంటే టీడీపీవాళ్లు ఎంత ప్రయత్నించినా ప్రజల్లో ఆయనకున్న పేరును తుడిపేయలేరు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చాడు. దానివల్ల ఏపీలో ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. ఇక ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇదీ వైఎస్సార్ పెట్టిన ప్రోగ్రామే. దాన్ని కొనసాగించాల్సిందే తప్ప ఎవ్వడొచ్చినా తీసేయలేరు. మార్చలేరు కూడా. ఆరోగ్యశ్రీ ఉంది. ఈ పథకం పేరు మార్చినా కొనసాగించాల్సిందే తప్ప తీసివేయలేరు. తన హయాంలో 50 లక్షల ఇళ్లు కట్టించారు. ఎవరైనా కట్టించారా. కనీసం అందుకు పూనుకున్నారా? లేదు కదా.
ఎన్టీఆర్, చంద్రబాబుల మధ్య తేడా ఏమిటి?
ఎన్టీఆర్‌కు ఎవరిమీద అయినా విభేదం ఉంటే ముఖంమీదే మాట్లాడేస్తారు. ఆ మరుసటి దినం దాన్ని మర్చిపోతారు. బాబు అలా కాదు. విభేదించినవాడిపై కోపం ఉంచుకుని వీడిని ఎలా సాధించాలని లోపల్లోపలే చాలా కాలం ఆలోచిస్తారు.
చంద్రబాబు, జగన్ ఇద్దరినీ దగ్గరగా చూసారు. వీరి మధ్య పోలికలేమిటి? బాబును చూడండి. టీడీపీ పార్టీ సిద్ధాంతాలనే వదిలేశారు. ఫిరాయింపులకే వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అది. దానికి విరుద్ధంగా వెళుతున్నారు. ఫిరాయింపుదార్లకు మంత్రి పదవులుకూడా ఇచ్చారు. పదవులు ఇవ్వడం, ఇవ్వక పోవడం పెద్ద అంశం కాదు. పార్టీని బలోపేతం చేసుకోవాలనే పేరుతో ఫిరాయింపుల పట్ల ప్రాథమికంగానే తప్పు డు ధోరణిలో వెళుతున్నారు. తెలుగు దేశం పార్టీలో సమర్థులు లేరు. అందుకని బయటి పార్టీల నుంచి తెచ్చుకుంటున్నామన్న రాంగ్ సిగ్నల్ పంపారు. టీడీపీకి ఉన్న పెద్ద ఆస్తి కార్యకర్తలే. జెండాను భుజాన వేసుకుని, అవసరమైతే సొంత డబ్బు ఖర్చుపెట్టి ఏదీ ఆశించకుండా పార్టీ పనులు చేసేవారి అనుభవాలను ఇవ్వాళ అవమానిస్తున్నారు. గాయపర్చారు. ఇది కరెక్టు కాదు. జగన్‌లో కష్టపడే తత్వం ఉంది. తన లక్ష్యానికి తగిన కార్యక్రమాలను బాగానే చేసుకుంటూ వస్తున్నారు. అందుకే జనం ఆయన వెనకాలే ఉన్నారు.
చంద్రబాబు, జగన్.. వ్యక్తిత్వంపై మీ అంచనా?
రామారావుకు ఉన్న పాపులారిటీ సినిమా హీరో అవటం వల్ల వచ్చింది కాదు. దేశ రాజకీయాల్లో శిఖర స్థాయిలో ఉన్న ఇందిరాగాంధీనే వ్యతిరేకించి నిలబడటంతో ఆమెను వ్యతిరేకించే శక్తులన్నీ ఏకమై ఎన్టీఆర్‌కు మద్దతిచ్చాయి. హీరోగానే ఉంటే అందరిహీరోల్లో ఒకరిగా ఉండేవారు. దానికి అతీతంగా ఎప్పుడు వెళ్లారు? కేంద్రంలో అత్యున్నత స్థానంలో ఉన్న ప్రధానినే ఢీకొన్నారు. అదే ఆయనకు పాపులారిటీని తెచ్చింది. అలాగే జగన్‌మోహన్ రెడ్డి సోనియా గాంధీనే ఎదుర్కొని, ఢీకొని తన రాజకీయం నడుపుతూ వచ్చారు. అంటే తన స్వశక్తితో నిర్మాణం చేసుకున్న పార్టీ వైఎస్సార్సీపీ. దాంతోనే జగన్‌కు జనంలో హీరోయిక్ ఫాలోయింగ్ వస్తోంది. జగన్ బలం ఏమిటంటే జనంలో హీరో వర్షిప్. దాన్ని ఇప్పటికే సంపాదించుకున్నారు. అదే బాబును చూడండి. కేంద్రంతో రాజీపడాలంటున్నారు. టీడీపీ మూలసిద్ధాంతాలకే అది విరుద్ధం. టీడీపీ జెండాలో ఏముంది? కూడు, గుడ్డ, నీడ. నీడ అంటే ఇళ్లు కట్టించాలి. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ఎప్పుడైనా ఇళ్లు కట్టించారా? ఈ మూడేళ్లలో ఒక్క ఇల్లయినా కట్టించారా అంటే లేదు. నా ఉద్దేశం ఏదంటే పార్టీ సిద్ధాంతాలనే వదులుకుని వెళుతున్నారు కాబట్టే ఇలాంటివి జరుగుతున్నాయి. అదే జగన్ అయితే ఒక సిద్ధాం తాన్ని పట్టుకుని దేన్నయినా ఎదిరిస్తున్నాడు. అదే ఇద్దరికీ మధ్య ఉన్న తేడా.
(ఆదిశేషగిరిరావుతో ఇంటర్వూ్య పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి)
https://goo.gl/JQy7Z8
https://goo.gl/Z10Q7e