Ghattamaneni Adi Seshagiri Rao
-
మహేశ్‌బాబు గురించి ఫ్యాన్స్‌కు తెలియని సీక్రెట్స్ బయటపెట్టిన బాబాయ్
సూపర్‌స్టార్ మహేశ్ బాబు దూకుడు మీదున్నాడు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తున్న అతడు నెక్స్ట్ రాజమౌళితో ఓ మూవీ చేయనున్నాడు. ఈ గ్యాప్‌లో ఇటీవలే స్పెయిన్‌కు వెకేషన్‌కు వెళ్లొచ్చాడు. ఇదిలా ఉంటే మహేశ్ తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు మే 31న రీరిలీజ్ కాబోతోంది. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆది శేషగిరి రావు ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్యూలో ఆయన మహేశ్‌బాబు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'మహేశ్‌బాబు నమ్రతను ప్రేమిస్తున్న విషయాన్ని ముందుగా తన తల్లి ఇందిరతో చెప్పాడు. ఆమె వెళ్లి కృష్ణకు చెప్పింది. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు కాబట్టి పెళ్లి చేద్దాం అని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో నా పాత్ర ఏమీ లేదు. కాకపోతే నేను మహేశ్‌బాబుతో వంశీ అని ఒకే ఒక్క సినిమా తీశాను. అందులో నమ్రతను హీరోయిన్గా పెట్టి చేశానంతే! మహేశ్‌బాబు చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. అతడు మంచి మిమిక్రీ ఆర్టిస్ట్. ఎవరినైనా ఇమిటేట్ చేస్తాడు. అతడు పెద్ద స్టార్ అవుతాడని నేను ముందే ఊహించాను. మహేశ్‌కు అమితాబ్ బచ్చన్‌కు ఉన్నంత టాలెంట్ ఉంది. 14 ఏళ్ల వయసులో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే కారు నడిపాడు. మద్రాస్‌లో పోలీసులు చూసి వెంటపడితే నేరుగా ఆఫీస్‌లోకి ఎంటరై ఏమీ తెలియనట్లు వచ్చి కూర్చున్నాడు. నేనే పోలీసులతో మాట్లాడి పంపించేశాను' అని ఆదిశేషగిరి రావు తెలిపాడు. చదవండి: ప్రేయసిని పెళ్లాడిన నటుడు, వైరల్‌గా మారిన ఫోటోలు -
ఆన్లైన్ టికెట్ విధానం మేమే అడిగాం: నిర్మాత కళ్యాణ్
సాక్షి, విజయవాడ: ఏపీ ప్రభుత్వంతో జరిగిన చర్చలు చాలా ఆనందకరమని టాలీవుడ్ నిర్మాత సి.కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యలన్నింటిని ఓపిగ్గా విని పరిష్కారం చూపుతామని మంత్రి పేర్ని నాని వెల్లడించినట్లు పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీకి పెద్ద సహకారం ఇచ్చారని, ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన భరోసా అని తెలిపారు. దివంగత వైఎస్సార్ సినీ ఇండస్ట్రీకి ఎంతో చేశారని నేడు సీఎం జగన్ కూడా అలాగే చేస్తున్నారని ప్రశంసించారు. కాగా ఆన్లైన్ టికెట్ విధానంపై విజయవాడలో మంత్రి పేర్ని నాని సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులతోపాటు దిల్ రాజు, డీఎన్వీ ప్రసాద్, ఆది శేషగిరి రావు, డీవీవీ దానయ్య హాజరయ్యారు. భేటీలో ప్రధానంగా ఆన్లైన్ టికెట్ వ్యవస్థ, కరోనా వలన సిని పరిశ్రమ ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి చర్చించారు. చదవండి: ఆన్లైన్ టికెట్ విధానంపై మంత్రి పేర్ని నాని సమీక్ష త్వరలోనే సీఎం జగన్‌తో భేటీ ఆన్లైన్ టికెట్ విధానం తామే అడిగామని నిర్మాత కళ్యాణ్ పేర్కొన్నారు. దానితో పాటు 4 షోలు 12 గంటలలోపు పూర్తి చేయడంపై చర్చించినట్లు తెలిపారు. విద్యుత్ బిల్లుల అంశం, 100 శాతం ఆక్యుపెన్సీపై కూడా చర్చించామన్నారు. అన్ని వర్గాలు ఈ రోజు చర్చల పట్ల ఆనందంగా ఉన్నాయని, ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని తెలిపారు. సినిమా ఇండస్ట్రీకి కావాల్సినవి అన్ని ప్రభుత్వం చెప్పిందని త్వరలోనే సీఎం జగన్‌తో భేటీ అవుతామని వెల్లడించారు. అన్ని సమస్యలపై చర్చించాం ఆన్లైన్ విధానం వలన సినీ పరిశ్రమకి మేలు జరుగుతుందని నిర్మాత ఘట్టమనేని ఆది శేషగిరిరావు తెలిపారు. ఆన్లైన్ విధానంతో పాటు రేట్లు సవరించని కోరినట్లు తెలిపారు. అన్ని సమస్యలపై మంత్రి తో చర్చించామని, ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తామని చెప్పిందని వెల్లడించారు. మరో సమావేశం ఉంటుంది సినిమా సమస్యలపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని నిర్మాత డీఎన్వీ ప్రసాద్ పేర్కొన్నారు. సినిమా పరిశ్రమకు ఉన్న సమస్యలపై మంత్రి పేర్ని నాని, అధికారులతో చర్చ జరిగిందని దీనివల్ల తెలుగు సినిమా పరిశ్రమకు మంచి జరుగుతుందన్నారు. తప్పనిసరిగా మరొక సమావేశం ఉంటుందని తెలిపారు. చిన్నా, పెద్ద సినిమా కాకుండా ప్రభుత్వం దగ్గర ఉన్న డౌట్స్ క్లారిఫై చేశామని పేర్కొన్నారు. ఆన్లైన్ టికెట్ వ్యవస్థ అనేది పెద్ద సమస్య కాదని అన్నారు. -
‘భరత్ అనే నేను’ రాజకీయ నేతలకు కనువిప్పు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘భరత్ అనే నేను’కమర్షియల్, సందేశాత్మక చిత్రమని, రాజకీయ నేతలకు ఈ చిత్రం కనువిప్పు కలిగించిందని సూపర్‌స్టార్ కృష్ణ, మహేష్‌బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత, వైఎస్సార్ సీపీ నేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు (బంగారయ్య) అన్నారు. అశోక థియేటర్ ఆవరణలో శనివారం రాత్రి రాజమహేంద్రవరం నగర సూపర్‌స్టార్ కృష్ణ, మహేష్‌బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ చిత్రం శత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గీతం ఫిలిమ్స్ శాస్త్రి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ భరత్ అనే నేను చిత్రానికి మహేష్‌బాబు, దర్శకుడు కొరటాల శివ పిల్లర్లుగా, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, అభిమానులను మూలస్తంభాలు అభివర్ణించారు. అభిమానులందరికీ అన్నయ్య కృష్ణ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పమన్నారని తెలిపారు. చిలకలూరిపేట తదితర ప్రాంతాల్లో శత దినోత్సవాలు ఉన్నప్పటికీ ఇక్కడికే వచ్చానని తెలిపారు. మరిన్ని సందేశాత్మక, సామాజికపరమైన సినిమాల్లో మహేష్‌బాబు నటిస్తారని తెలిపారు. ఏపీఐసీసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ చిత్రం రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే సంచలనం అయిందన్నారు. సినిమా డిస్ట్రిబ్యూటర్ ఇష్ణా ఎంటర్టైన్మెంట్స్ అధినేత భరత్ చౌదరి మాట్లాడుతూ ఈ చిత్రాన్ని పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమాలో నటించిన ‘అంతరికరణ శుద్ధి’ సుబ్బారావు మాట్లాడుతూ కోనసీమలో పుట్టి, నగరంలో చదువుకుని, వృత్తి రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్న రాజశేఖర్ అనే నేను.. శుభోదయం సుబ్బారావు అంటూ అభిమానులను అలరించారు. అనంతరం శేషగిరిరావు కేక్‌ను కట్ చేసి, డిస్ట్రిబ్యూటర్స్‌కు, ఎగ్జిబిటర్స్‌కు మెమెంటోలను అందజేశారు. వికలాంగులకు వీల్చైర్లు అందజేశారు. జిల్లా డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి అనుశ్రీ సత్యనారాయణ, వానపల్లి గౌరీశంకర్, సురేష్ మూవీస్ రమేష్, మణికంఠ ఫిలిమ్స్ సత్తిబాబు, బుచ్చిరాజు, అశోక థియేటర్ అధినేత రాజబాబు, మేనేజర్ గెడ్డం శ్రీను, రౌతు రవీంద్ర, ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు, మహేష్‌బాబు అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
‘బాబు పగలు కాంగ్రెస్‌తో.. రాత్రి బీజేపీతో సంసారం’
సాక్షి, విజయవాడ : టీడీపీ నాయకుల తీరుపై వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు విమర్శలు గుప్పించారు. ఆయన గురువారం విజయవాడలోని పార్టీ కార్యలయంలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ, టీడీపీ నాలుగేళ్లుగా కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నారని ఘట్టమనేని ధ్వజమెత్తారు. పార్లమెంట్ సాక్షిగా ఈ విషయం బట్టబయట అయ్యింది. సీఎం చంద్రబాబు పగలు కాంగ్రెస్‌తో, రాత్రి బీజేపీతో సంసారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబుకి రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం.. రాష్ట్ర ప్రయోజనాలు కాదని వైఎస్సార్సీపీ నేత పేర్కొన్నారు. టీడీపీ ఎంపీలు రాత్రిపూట ఎంత మంది బీజేపీ నేతలను కలుస్తున్నారని ఘట్టమనేని ఆదిశేషగిరి రావు ప్రశ్నించారు. -
అందుకే బాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు : ఘట్టమనేని
సాక్షి, గుంటూరు జిల్లా : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆ పార్టీ నాయకుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు విమర్శించారు. గుంటూరులో నిర్వహించిన బూత్ లెవెల్ కమిటీ శిక్షణా తరగతుల్లో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు. వైఎస్ జగన్‌ను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేకనే కాంగ్రెస్‌తో చంద్రబాబు చేతులు కలిపారని ఎద్దేవా చేశారు. బీజేపీ, జనసేనతో కలిసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఇప్పుడు వారి గురించి ఎలా మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని ఆదిశేషగిరిరావు వ్యాఖ్యానించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు అమలు కావాలంటే ఆయన తనయుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ ఎంపీలు తమ రాజీనామాలను ఆమోదింప చేసుకోవడం గొప్ప విషయమని అన్నారు. నాలుగేళ్లు రాజధాని కోసం చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు. టీడీపీని ఎంత తొందరగా గద్దె దింపితే ప్రజలకు అంత మంచిదని అన్నారు. -
ఫిరాయింపులు సూత్ర విరుద్ధం
కొమ్మినేని శ్రీనివాసరావుతో ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఫిరాయింపులకు వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశ పార్టీ మూల సూత్రాలకే వ్యతిరేకంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, దీంతో దశాబ్దాలుగా పార్టీ జెండాను భుజాన వేసుకుని, ఏదీ ఆశించకుండా పనిచేస్తూ వచ్చిన టీడీపీ కార్యకర్తల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ప్రముఖ నిర్మాత, వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన మౌలిక సమస్యల విషయంలో కేంద్రంతో రాజీపడాలని బాబు చెబుతుండటం టీడీపీ మూల సిద్ధాంతాలకే విరుద్ధమన్నారు. కూడు, గుడ్డ, నీడ అనేది టీడీపీ ఎజెండా కాగా.. గతంలో తొమ్మిదేళ్ల పాలనలో, తాజాగా మూడేళ్ల పాలనలో బాబు ఏపీలో ఒక్కటంటే ఒక్క ఇల్లు కట్టించి ఇచ్చిన పాపాన పోలేదని ఆరోపించారు. గతంలో ఇందిరాగాంధీకే ఎదురు నిలిచిన ఎన్టీఆర్ లాగా, సోనియాగాంధీని ధిక్కరించి రాజకీయం నడుపుతున్నారు కాబట్టే జనం వైఎస్ జగన్‌ని ఆరాధిస్తున్నారని చెబుతున్న ఆదిశేషగిరిరావు అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. అల్లూరి సీతారామరాజును ఎన్టీఆర్ తీయాలనుకోగా ముందుగా మీరే తీశారట కదా? జయసింహ సినిమా తీసినప్పుడు ఎన్టీఆర్ ఆ సినిమా పాటల పుస్తకం వెనుక తమ తర్వాతి చిత్రం సీతారామరాజు అని ప్రకటించారు. అది 1959 నాటి మాట. కానీ తీయలేకపోయారు. తర్వాత మా సోదరుడు హనుమంతరావు సీతారామరాజు సినిమా స్క్రిప్ట్ తయారు చేశారు. ఎన్టీఆర్ తీయవద్దని అన్నప్పటికీ ముందుకెళ్లాం. పైగా ప్రత్యేకాంధ్రకు మేమంతా సపోర్టు చేయగా, ఎన్టీఆర్, ఏఎన్నార్ వ్యతిరేకించారు. మనసులో అయితే వారు అనుకూలమే కానీ అప్పుడే వారు మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చేశారు. ప్రభుత్వం వద్ద చిత్ర పరిశ్రమ కోసం భూములు కూడా తీసుకున్నారు. అయితే ప్రత్యేకాంధ్రపై మా వాదాన్ని బలపర్చేవారే ఎక్కువ కావడంతో వారిరువురికీ కోపం వచ్చింది. తెలుగు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కృష్ణా సినీ అసోసియేషన్ అయిపోయింది అని చెప్పి ఇద్దరూ రాజీనామా చేశారు. ఇలా కొన్ని ప్రత్యేక అంశాలపై విభేదాలు వచ్చాయి. ఎన్టీఆర్‌తో సినిమాల్లో వచ్చిన విభేదం రాజకీయాల్లోను కొనసాగిందా? అప్పట్లో ‘‘ఈనాడు’’ సినిమా తీసాం. ఆరోజు అది వ్యవస్థా వ్యతిరేక చిత్రం. నాడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి దానికి వ్యతిరేకంగా ఆ సినిమా తీశాం. హీరో సైకిల్ మీద వస్తాడు. 1983 ఎన్నికలకు మూడువారాల క్రితం వచ్చిన ఈ సినిమా పెద్ద హిట్ అయింది. కేరళలో య«థార్థంగా జరిగిన ఒక ఘటనను మన రాజకీయాలకు వర్తించి సినిమా తీశాం. రాజకీయ పార్టీల్లో ఫిరాయింపులు వ్యభిచారంతో సమానం అనే డైలాగ్ కూడా దాంట్లో ఉంది. అంటే ఇవ్వాళ జరుగుతున్న ఫిరాయింపుల వ్యవహారం ఆరోజుల్లోనే ఉంది. ఆనాటికి ఫిరాయింపు వ్యతిరేక చట్టం లేదు. ఆ సినిమాలో ఉన్న డైలాగుల గురించి రామోజీరావు కూడా మాట్లాడారు. ఎన్టీరామారావు అయితే వాటిని చాలాసార్లు ప్రస్తావించారు ఎన్టీఆర్‌తో రాజకీయ విభేదానికి మూలం? ఎన్టీఆర్‌పై తిరుగుబాటు చేసి నాదెండ్ల భాస్కరరావు ఏపీ సీఎం అయ్యాక ఆయనను కృష్ణ అభినందించినట్లుగా ఫుల్ పేజ్ యాడ్‌ను పేపర్లలో ఎవరో వేశారు. నిజానికి అన్నయ్యకు నాదెండ్ల గురించి తెలీదు. ఆ ఘటన జరిగినప్పుడు కూడా ఎక్కడో షూటింగులో ఉన్నారు. నాదెండ్లను అన్నయ్య అభినందించినట్లు ఎవరో ప్రకటన వేయడంతో ఎన్టీఆర్‌కు కోపం వచ్చింది. నాకు సంబంధం లేకుండానే ఎవరో ఆ ప్రకటన వేశారని అన్నయ్య వ్యక్తిగతంగా మద్రాసులో కలిసి కూడా చెప్పారు. కానీ ఆ విషయాన్ని ఎన్టీఆర్ మనసులో పెట్టుకున్నట్లుంది. ఆ రోజుల్లోనే అంటే 1984లో ఇందిరాగాంధీ చనిపోయారు. రాజీవ్ గాంధీ పిలుపుమేరకు అన్నయ్య, నేను కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాం. రాజశేఖరరెడ్డి పీసీసీ ప్రెసిడెంటుగా ఉన్నప్పుడే చేరాం. అప్పటినుంచి ఎన్టీఆర్‌కు విరోధులమైపోయాం. వైఎస్ ప్రోద్బలంతోటే తిరుపతి నుంచి మొదలుపెట్టి రాష్ట్రమంతటా విస్తృతంగా తిరిగి కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రచారం చేశాం. రాజకీయాల్లో మీరు ఎలా యాక్టివ్ అయ్యారు? 2003లో వైఎస్సార్ నన్ను పిలిపించారు. 1975 నుంచి మేమిద్దరం మంచి స్నేహితులం. అన్నయ్య ఎలాగూ రాజకీయాల్లో ఆసక్తి చూపలేదు కదా నువ్వు రా బంగారూ అన్నారాయన. 2003 నుంచే రాజకీయాల్లో యాక్టివ్ అయ్యాను. ఎక్కడా పోటీ చేయలేదు. రాజశేఖరరెడ్డి, చంద్రబాబు ఇద్దరూ మీకు స్నేహితులే కదా. వీరి మధ్య పోలికలేమిటి? నమ్మినవారిని ఆదుకోవడం మొదటినుంచి రాజశేఖరరెడ్డికి అలవాటు. చంద్రబాబు మాత్రం వ్యూహకర్త. బాగా ఆలోచించి కొంచెం ముందు చూపుతో వెళతారు. అంటే తనను నమ్మినవారిని నష్టపర్చి అయినా సరే అనుకున్నది సాధించడం కావాలి తనకు. మొన్నటి ఎన్నికలే చూడండి. తొలినుంచి టీడీపీలో ఉన్న వారికి కాకుండా కాంగ్రెస్ నుంచి వచ్చినవారికి టిక్కెట్లు ఇచ్చారు. తాను మొదటిసారి సీఎం కావడానికి కారణమైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హరికృష్ణ వంటివారిని దూరం పెట్టేశారు. ఏమీ లేని చోట గాలిపోగు చేసి బాబు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. అవకాశమే లేనిచోట వీళ్లనూ వాళ్లనూ పోగు చేసి అడ్డమైన వారి కాళ్లూ పట్టుకుని సీఎం అయిపోయాడు. పేర్లు అనవసరం, సీఎం కావాలని అనుకున్నాడు. అయిపోయాడు. పేదలకు ఏదైనా మేలు చేసినవారు ఉన్నారా అంటే మొదట ఇందిరాగాంధీ పేరునే చెప్పాలి. తర్వాత రామారావు. మా రాజకీయ విభేదాలు ఎలా ఉన్నా.. ఆయన పేద ప్రజలకు నిజంగానే ఎంతో కొంత మేలు చేశారు. సంక్షేమం అనే ఆలోచన తనకే తట్టింది. తర్వాత వైఎస్సార్ అలాంటి ప్రయత్నాలే చేశారు. వైఎస్సార్ ప్రజా సంక్షేమానికి ఎన్ని మంచి చర్యలు చేపట్టారంటే టీడీపీవాళ్లు ఎంత ప్రయత్నించినా ప్రజల్లో ఆయనకున్న పేరును తుడిపేయలేరు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చాడు. దానివల్ల ఏపీలో ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. ఇక ఫీజు రీయింబర్స్మెంట్, ఇదీ వైఎస్సార్ పెట్టిన ప్రోగ్రామే. దాన్ని కొనసాగించాల్సిందే తప్ప ఎవ్వడొచ్చినా తీసేయలేరు. మార్చలేరు కూడా. ఆరోగ్యశ్రీ ఉంది. ఈ పథకం పేరు మార్చినా కొనసాగించాల్సిందే తప్ప తీసివేయలేరు. తన హయాంలో 50 లక్షల ఇళ్లు కట్టించారు. ఎవరైనా కట్టించారా. కనీసం అందుకు పూనుకున్నారా? లేదు కదా. ఎన్టీఆర్, చంద్రబాబుల మధ్య తేడా ఏమిటి? ఎన్టీఆర్‌కు ఎవరిమీద అయినా విభేదం ఉంటే ముఖంమీదే మాట్లాడేస్తారు. ఆ మరుసటి దినం దాన్ని మర్చిపోతారు. బాబు అలా కాదు. విభేదించినవాడిపై కోపం ఉంచుకుని వీడిని ఎలా సాధించాలని లోపల్లోపలే చాలా కాలం ఆలోచిస్తారు. చంద్రబాబు, జగన్ ఇద్దరినీ దగ్గరగా చూసారు. వీరి మధ్య పోలికలేమిటి? బాబును చూడండి. టీడీపీ పార్టీ సిద్ధాంతాలనే వదిలేశారు. ఫిరాయింపులకే వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అది. దానికి విరుద్ధంగా వెళుతున్నారు. ఫిరాయింపుదార్లకు మంత్రి పదవులుకూడా ఇచ్చారు. పదవులు ఇవ్వడం, ఇవ్వక పోవడం పెద్ద అంశం కాదు. పార్టీని బలోపేతం చేసుకోవాలనే పేరుతో ఫిరాయింపుల పట్ల ప్రాథమికంగానే తప్పు డు ధోరణిలో వెళుతున్నారు. తెలుగు దేశం పార్టీలో సమర్థులు లేరు. అందుకని బయటి పార్టీల నుంచి తెచ్చుకుంటున్నామన్న రాంగ్ సిగ్నల్ పంపారు. టీడీపీకి ఉన్న పెద్ద ఆస్తి కార్యకర్తలే. జెండాను భుజాన వేసుకుని, అవసరమైతే సొంత డబ్బు ఖర్చుపెట్టి ఏదీ ఆశించకుండా పార్టీ పనులు చేసేవారి అనుభవాలను ఇవ్వాళ అవమానిస్తున్నారు. గాయపర్చారు. ఇది కరెక్టు కాదు. జగన్‌లో కష్టపడే తత్వం ఉంది. తన లక్ష్యానికి తగిన కార్యక్రమాలను బాగానే చేసుకుంటూ వస్తున్నారు. అందుకే జనం ఆయన వెనకాలే ఉన్నారు. చంద్రబాబు, జగన్.. వ్యక్తిత్వంపై మీ అంచనా? రామారావుకు ఉన్న పాపులారిటీ సినిమా హీరో అవటం వల్ల వచ్చింది కాదు. దేశ రాజకీయాల్లో శిఖర స్థాయిలో ఉన్న ఇందిరాగాంధీనే వ్యతిరేకించి నిలబడటంతో ఆమెను వ్యతిరేకించే శక్తులన్నీ ఏకమై ఎన్టీఆర్‌కు మద్దతిచ్చాయి. హీరోగానే ఉంటే అందరిహీరోల్లో ఒకరిగా ఉండేవారు. దానికి అతీతంగా ఎప్పుడు వెళ్లారు? కేంద్రంలో అత్యున్నత స్థానంలో ఉన్న ప్రధానినే ఢీకొన్నారు. అదే ఆయనకు పాపులారిటీని తెచ్చింది. అలాగే జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీనే ఎదుర్కొని, ఢీకొని తన రాజకీయం నడుపుతూ వచ్చారు. అంటే తన స్వశక్తితో నిర్మాణం చేసుకున్న పార్టీ వైఎస్సార్సీపీ. దాంతోనే జగన్‌కు జనంలో హీరోయిక్ ఫాలోయింగ్ వస్తోంది. జగన్ బలం ఏమిటంటే జనంలో హీరో వర్షిప్. దాన్ని ఇప్పటికే సంపాదించుకున్నారు. అదే బాబును చూడండి. కేంద్రంతో రాజీపడాలంటున్నారు. టీడీపీ మూలసిద్ధాంతాలకే అది విరుద్ధం. టీడీపీ జెండాలో ఏముంది? కూడు, గుడ్డ, నీడ. నీడ అంటే ఇళ్లు కట్టించాలి. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ఎప్పుడైనా ఇళ్లు కట్టించారా? ఈ మూడేళ్లలో ఒక్క ఇల్లయినా కట్టించారా అంటే లేదు. నా ఉద్దేశం ఏదంటే పార్టీ సిద్ధాంతాలనే వదులుకుని వెళుతున్నారు కాబట్టే ఇలాంటివి జరుగుతున్నాయి. అదే జగన్ అయితే ఒక సిద్ధాం తాన్ని పట్టుకుని దేన్నయినా ఎదిరిస్తున్నాడు. అదే ఇద్దరికీ మధ్య ఉన్న తేడా. (ఆదిశేషగిరిరావుతో ఇంటర్వూ్య పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://goo.gl/JQy7Z8 https://goo.gl/Z10Q7e -
ఘట్టమనేనికి ఎమ్మెల్సీ
విజయవాడ : స్థానిక సంస్థల కోటా వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి, ప్రముఖ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు (64) పోటీ చేయనున్నారు. శనివారం హోటల్ ఐలాపురంలో జరిగిన ‘సమరదీక్ష’ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆదిశేషగిరిరావు పేరును ప్రకటించారు. శేషగిరిరావు ప్రముఖ సినీనటుడు కృష్ణకు సోదరుడు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంకు చెందిన ఆదిశేషగిరిరావుకు గత 40 ఏళ్లుగా విజయవాడతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 1982లో విజయవాడలో రాజ్-యువరాజ్ థియేటర్లను ప్రారంభించడంతో పాటు 15 ఏళ్లపాటు నిర్వహించారు. గాంధీనగర్‌లో పద్మాలయ ఫిలిమ్స్ పేరుతో డిస్ట్రిబ్యూషన్ కార్యాలయాన్ని శేషగిరిరావు నిర్వహించారు. మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, అల్లూరి సీతారామరాజు, సింహాసనం తదితర సుమారు 100కు పైగా తెలుగు చిత్రాలు, 30 హిందీ చిత్రాలను, 10 తమిళ చిత్రాలను ఆదిశేషగిరిరావు నిర్మించారు. ఫిలిం పెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా, ఏపీ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. శేషగిరిరావు ఏఐసీసీ కల్చరల్ కమిటీ కన్వీనర్‌గా, పీసీసీ జనరల్ సెక్రటరీగా 10 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉంది. జిల్లాలోని రాజకీయ, వాణిజ్య, వ్యాపార, సినీ రంగ ప్రముఖలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల సభ్యులు తనకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. జిల్లా వాసులకు అందుబాటులో ఉంటూ ఇక్కడి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని చెప్పారు.