సాక్షి, విజయవాడ: ఏపీ ప్రభుత్వంతో జరిగిన చర్చలు చాలా ఆనందకరమని టాలీవుడ్ నిర్మాత సి.కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యలన్నింటిని ఓపిగ్గా విని పరిష్కారం చూపుతామని మంత్రి పేర్ని నాని వెల్లడించినట్లు పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీకి పెద్ద సహకారం ఇచ్చారని, ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన భరోసా అని తెలిపారు. దివంగత వైఎస్సార్ సినీ ఇండస్ట్రీకి ఎంతో చేశారని నేడు సీఎం జగన్ కూడా అలాగే చేస్తున్నారని ప్రశంసించారు.
కాగా ఆన్‌లైన్ టికెట్ విధానంపై విజయవాడలో మంత్రి పేర్ని నాని సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులతోపాటు దిల్ రాజు, డీఎన్‌వీ ప్రసాద్, ఆది శేషగిరి రావు, డీవీవీ దానయ్య హాజరయ్యారు. భేటీలో ప్రధానంగా ఆన్‌లైన్ టికెట్ వ్యవస్థ, కరోనా వలన సిని పరిశ్రమ ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి చర్చించారు.
చదవండి: ఆన్‌లైన్ టికెట్ విధానంపై మంత్రి పేర్ని నాని సమీక్ష
త్వరలోనే సీఎం జగన్‌తో భేటీ
ఆన్‌లైన్ టికెట్ విధానం తామే అడిగామని నిర్మాత కళ్యాణ్ పేర్కొన్నారు. దానితో పాటు 4 షోలు 12 గంటలలోపు పూర్తి చేయడంపై చర్చించినట్లు తెలిపారు. విద్యుత్ బిల్లుల అంశం, 100 శాతం ఆక్యుపెన్సీపై కూడా చర్చించామన్నారు. అన్ని వర్గాలు ఈ రోజు చర్చల పట్ల ఆనందంగా ఉన్నాయని, ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని తెలిపారు. సినిమా ఇండస్ట్రీకి కావాల్సినవి అన్ని ప్రభుత్వం చెప్పిందని త్వరలోనే సీఎం జగన్‌తో భేటీ అవుతామని వెల్లడించారు.
అన్ని సమస్యలపై చర్చించాం
ఆన్‌లైన్ విధానం వలన సినీ పరిశ్రమకి మేలు జరుగుతుందని నిర్మాత ఘట్టమనేని ఆది శేషగిరిరావు తెలిపారు. ఆన్‌లైన్ విధానంతో పాటు రేట్లు సవరించని కోరినట్లు తెలిపారు. అన్ని సమస్యలపై మంత్రి తో చర్చించామని, ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తామని చెప్పిందని వెల్లడించారు.
మరో సమావేశం ఉంటుంది
సినిమా సమస్యలపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని నిర్మాత డీఎన్‌వీ ప్రసాద్ పేర్కొన్నారు. సినిమా పరిశ్రమకు ఉన్న సమస్యలపై మంత్రి పేర్ని నాని, అధికారులతో చర్చ జరిగిందని దీనివల్ల తెలుగు సినిమా పరిశ్రమకు మంచి జరుగుతుందన్నారు. తప్పనిసరిగా మరొక సమావేశం ఉంటుందని తెలిపారు. చిన్నా, పెద్ద సినిమా కాకుండా ప్రభుత్వం దగ్గర ఉన్న డౌట్స్ క్లారిఫై చేశామని పేర్కొన్నారు. ఆన్‌లైన్ టికెట్ వ్యవస్థ అనేది పెద్ద సమస్య కాదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment