
వైఎస్సార్‌సీపీ నేత ఘట్టమనేని ఆదిశేషగిరి రావు
సాక్షి, గుంటూరు జిల్లా : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆ పార్టీ నాయకుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు విమర్శించారు. గుంటూరులో నిర్వహించిన బూత్ లెవెల్ కమిటీ శిక్షణా తరగతుల్లో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు. వైఎస్ జగన్‌ను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేకనే కాంగ్రెస్‌తో చంద్రబాబు చేతులు కలిపారని ఎద్దేవా చేశారు.
బీజేపీ, జనసేనతో కలిసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఇప్పుడు వారి గురించి ఎలా మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని ఆదిశేషగిరిరావు వ్యాఖ్యానించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు అమలు కావాలంటే ఆయన తనయుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు తమ రాజీనామాలను ఆమోదింప చేసుకోవడం గొప్ప విషయమని అన్నారు. నాలుగేళ్లు రాజధాని కోసం చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు. టీడీపీని ఎంత తొందరగా గద్దె దింపితే ప్రజలకు అంత మంచిదని అన్నారు.