టీడీపీ ఎంపీలు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలు తమ రాజీనామా లేఖలను ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించారు. పార్టీ అధిష్టానం సూచనల మేరకు టీడీపీ ఎంపీలు తమ పదవుల నుంచి వైదొలిగారు. నేటి సాయంత్రం దాదాపు 6 గంటల సమయంలో అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలు ప్రత్యేక వాహనాల్లో ప్రధాని మోదీ నివాసానికి చేరుకున్నారు. అనంతరం ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు, ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చించిన అనంతరం తమ రాజీనామా లేఖలను మంత్రులు ప్రధానికి సమర్పించారు. కాగా, ఏపీకి జరిగిన అన్యాయంపై కేంద్రం సరైన రీతిలో స్పందించని కారణంగా కేంద్రం నుంచి తమ ఎంపీలు తప్పుకుంటారని గురువారం సాయంత్రం టీడీపీ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే.
అంతకుముందు రాజస్థాన్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి రాగానే ప్రధాని మోదీ, మిత్రపక్ష సీఎం చంద్రబాబుకు ఫోన్ చేశారు. నేటి సాయంత్రం 6 గంటలకు టీడీపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజులు తనను కలుసుకునేందుకు అపాయింట్‌మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఏపీలో రాజకీయ పరిస్థితులపై చంద్రబాబుతో మోదీ చర్చించారు. అపాయింట్‌మెంట్ సమయంలో మోదీని కలుసుకున్న టీడీపీ ఎంపీలు కేంద్ర మంత్రి పదవుల నుంచి వైదొలగుతున్నట్లు రాజీనామా లేఖలను ప్రధానికి సమర్పించారు.
కాగా, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన గురువారం ఏపీ రాజకీయాల్లో చిచ్చురేపింది. హోదా సాధ్యం కాదని జైట్లీ ప్రకటన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు తమ పార్టీ ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్‌లో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. నేటి ఉదయం కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలు తమ లేఖల్ని అందించాలని చూడగా.. ప్రధాని మోదీ రాజస్తాన్ పర్యటనలో ఉండటంతో వీలుకాలేదు. సాయంత్రం తమ రాజీనామా పత్రాలు మోదీకి అందజేశారు. కాగా, నేటి ఉదయం ఏపీ బీజేపీ నేతలు మాణిక్యాల రావు, కామినేని శ్రీనివాస్‌లు తమ మంత్రి పదవుల రాజీనామా లేఖల్ని సీఎం చంద్రబాబుకు సమర్పించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment