సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ అధిష్టానం నిర్ణయం మేరకే మంత్రి పదవులకు రాజీనామా చేశామని, అయితే ఎన్డీఏలోనే కొనసాగుతామని ఆ పార్టీ ఎంపీలు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి అన్నారు. ప్రధాని మోదీని కలుసుకుని రాజీనామా లేఖలు సమర్పించినట్లు ఎంపీలు తెలిపారు. అనంతరం అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలు న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. 'దేశానికి సేవచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. మంత్రి పదవికి రాజీనామా చేసినా ఎన్డీఏలోనే కొనసాగుతాం. పార్టీ ఆదేశాల మేరకే రాజీనామ లేఖలు సమర్పించాం. త్వరలో ఏపీలో సమస్యలకు పరిష్కారం వస్తుందని ఆశిస్తున్నాం. కాంగ్రెస్, బీజేపీ మద్ధతుతోనే రాష్ట్ర విభజన జరిగింది, ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు అమలు చేయాలని కోరుకుంటున్నామని' అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు.
ఏపీ ప్రజల ఒత్తిడికి తలొగ్గే మేం రాజీనామాలు చేశామని సుజనా చౌదరి అన్నారు. 'రాజీనామాల నిర్ణయం నిజంగా దురదృష్టకరం, కానీ అంతకంటే మాకు ప్రత్యామ్నాయం లేదు. విభజ హామీలు అమలు చేయాలనే ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రత్యేక ప్యాకేజీలో ఒక్క అంశాన్ని కూడా కేంద్రం అమలు చేయలేదు. కాంగ్రెస్, బీజేపీ రెండూ ఏపీని మోసం చేశాయి. ఏపీ ప్రజలు ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. విభజన సమయంలో ఉభయ సభల్లో బిల్లు ఎలా పాస్ అయిందో అందరికీ తెలుసు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు. ఇప్పటికే ఏపీ ప్రజలు ఎన్నో త్యాగాలు చేశారు. 16వ లోక్‌సభ కాలపరిమితి ముగిసేలోపు విభజన హామీలు నెరవేర్చాలనేది మా డిమాండ్. కేంద్ర మంత్రులుగా కంటే కూడా పార్లమెంట్‌లో ఎంపీలుగా ఏపీ ప్రయోజనాల కోసం పోరాడతాం. ఏపీ ప్రజలకు అండగా ఉంటానని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని' టీడీపీ ఎంపీ సుజనా చౌదరి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment