రాష్ట్రంలో నెలకొన్న ఉత్కంఠ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వమే శాంతి భద్రతలను కాపాడాలని ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య అన్నారు.
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో నెలకొన్న ఉత్కంఠ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వమే శాంతి భద్రతలను కాపాడాలని ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య అన్నారు. దీనిపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తెలంగాణ కో ఆర్డినేషన్ కమిటీ ఇప్పటికే లేఖ రాసినట్టు వివరించారు. స్థానిక సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామయ్య, ప్రొ.హరగోపాల్, కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ ప్రొ.గోపాలకృష్ణ, నర్సింగ్‌రావులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ, అన్ని పార్టీల అంగీకారంతోనే తెలంగాణ నిర్ణయం జరిగిందని, ఇది కేవలం రాష్ట్ర విభజనే కానీ.. ప్రజల విభజన కాబోదని అన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని గుర్తించుకోవాలని సూచించారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చానన్న టీడీపీ అధినేత చంద్రబాబు, తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ వద్దని చెప్పానని అంటున్నారని విమర్శించారు. సీమాంధ్రలో జరుగుతోంది కేవలం ఆందోళన మాత్రమేనని, ఉద్యమం కాదని చెప్పారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే దేశంలో మరెన్నో నగరాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయమనే డిమాండ్ వస్తుందన్నారు. కార్యక్రమంలో కో ఆర్డినేషన్ కమిటీ ప్రధాన కార్యదర్శి టీ వివేక్, నిమ్స్ మాజీ డెరైక్టర్ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.