ఒక కులం కోసం పార్టీ పెట్టలేదు
♦ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టీకరణ
♦ ప్రజల తరపున పోరాడతా.. దేశ సమగ్రతే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చా
♦ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి
♦ రిజర్వేషన్లు దక్కవనే ఆందోళన కాపుల్లో ఉంది
♦ కాపు గర్జన సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలు దురదృష్టకరం
సాక్షి, హైదరాబాద్: తాను ఒక కులం కోసం రాజకీ య పార్టీ పెట్టలేదని సినీ నటుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఒక కులం కోసం పోరాడనని, ప్రజల కోసం పోరాడతానని చెప్పారు. దేశ సమగ్రతే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించడం సాధ్యమో కాదో ప్రభుత్వం ప్రకటించాలన్నారు. సాధ్యమైతే ఎలా సాధ్యం, కాకపోతే ఎలా అసాధ్యమో వివరిస్తే తరువాత ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో అప్పుడు చూసుకోవచ్చన్నారు. రిజర్వేషన్లు తమకు దక్కవనే ఆం దోళన, తమను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారనే అసంతృప్తి కాపు సామాజికవర్గంలో ఉందని పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో కాపు ఐక్య గర్జన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై పవన్ కల్యాణ్ సోమవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో స్పందించారు.
ఎవరి ప్రోద్బలం ఉందో చెప్పలేను
‘‘తునిలో రైలు దగ్ధం ఘటనలో అసాంఘిక శక్తుల పాత్ర ఉంది. 12 బోగీలున్న రైలు ఒక్క అగ్గిపుల్ల గీసేస్తే కాలిపోయేది కాదు. ఎవరో ప్రొఫెషనల్స్ ఈ పని చేశారు. ఘటనకు పాల్పడిన వారిని వీడియో కెమెరాల సాయంతో గుర్తించి చర్యలు తీసుకోవాలి. దీని వెనుక ఎవరి ప్రోద్బలం ఉందో నేను చెప్పలేను. తునిలో పెద్ద సభ జరుగుతున్నపుడు ప్రభుత్వం ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ తదితర ప్రాంతాల్లో కుల రిజర్వేషన్ ఉద్యమాల సందర్భంగా జరిగిన సంఘటనలను గమనించి ముందస్తు చర్యలు తీసుకుంటే బాగుండేది. మేము ఆడియో విడుదల ఫంక్షన్లు నిర్వహించినపుడు అన్ని అనుమతులు ఉన్నాయా అని లక్షా తొంభై వివరాలు అడిగే పోలీసులు ఇప్పుడు అలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు? పోలీసులు నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. కాపు ఐక్య గర్జన సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలు దురదృష్టకరం. ఏ ఉద్యమం అయినా శాంతియుతంగా నిర్వహిస్తే విజయవంతం అవుతుంది’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
కమిషన్లపై కాపుల్లో నమ్మకం పోయింది
‘‘కాపులకు రిజర్వేషన్లు అనే డిమాండ్ ఇప్పటిది కాదు. గతంలో కొనసాగించి మధ్యలో ఆపివేశారు. కాపులకు రిజర్వేషన్ల వల్ల కలిగే లబ్ధి ఏమిటో నాకు తెలియదు. రిజర్వేషన్లు కల్పిస్తామని అన్ని పార్టీలూ కాపులకు హామీనిస్తున్నాయి. అలానే 2014 ఎన్నికల్లో టీడీపీ కూడా హామీ ఇచ్చింది. రిజర్వేషన్లు వస్తాయో లేదోననే అనుమానం కాపుల్లో ఉంది. గతంలో జస్టిస్ పుట్టుస్వామి కమిషన్ వేసినా నివేదిక ఇవ్వలేదు. వీటిపై కాపుల్లో నమ్మకం పోయింది. ఏదైనా సమస్యకు సామరస్యపూర్వకంగా పరిష్కారం వెతకాలి’’ అని పవన్ సూచించారు.
తునిలో ఏం జరిగిందో నాకు తెలియదు
ప్రస్తుతం రిజర్వేషన్లను అనుభవిస్తున్న బీసీలకు ఎలాంటి నష్టం కలగకుండా కాపులకు రిజర్వేషన్లు వర్తింపజేసినపుడే వారికి న్యాయం చేసినట్లు అవుతుందని పవన్ కల్యాణ్ తెలిపారు.తుని ఘటనలకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కారణమని సీఎంతో సహా మంత్రులు, టీడీపీ నేతలు ఆరోపిస్తుండడాన్ని ఒక విలేకరి ప్రస్తావించగా... వారికి ఉన్న సమాచారం ఏమిటో తనకు తెలియదని చెప్పారు. అక్కడేం జరిగిందో తనకు తెలియదన్నారు. మీరు కాపులకు ప్రతినిధా? ఏపీకి ప్రతినిధా? అని ప్రశ్నించగా... నన్ను ఏపీ ప్రతినిధి అని ఎలా అంటారు, ఎవరి ప్రతినిధి అని ఎలా అడుగుతారని పేర్కొన్నారు. రాజ్యాంగ సవరణ చేస్తేనే కాపులకు రిజర్వేషన్లు సాధ్యమని చెప్పకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయన్నారు. కాపుల ఉద్యమానికి మీ మద్దతు ఉందా? లేదా? మీరు అనే విషయాల్లో సీఎం చంద్రబాబుకు ఆపద్బాంధవుడిలా వ్యవహరిస్తున్నారని విలేకరులు ప్రస్తావించగా... పవన్ కల్యాణ్ స్పందించలేదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి రోహిత్ ఆత్మహత్య చేసుకోవడం తనను బాధించిందని అన్నారు. విశ్వవిద్యాలయాల్లో కుల వివక్ష ఉందని చెప్పారు.