
పోరాటాన్ని కొనసాగిస్తాం
హెచ్‌సీయూ విద్యార్థుల స్పష్టీకరణ
గుర్తింపు కార్డులు ఉన్న వారికే అనుమతి
►‘మొన్నటి వరకు మా మధ్య తిరిగిన రోహిత్.. కొన్ని మతతత్వ శక్తుల వల్ల దూరమయ్యాడు.
►ఆ బాధ మా గుండెలను బద్దలు చేస్తోంది. తలచుకుంటేనే జీవితం భారమనిపిస్తోంది.
►అతని మరణం... ‘వెలివాడ’ మాకు మార్గదర్శనం చేస్తున్నాయి. భవిష్యత్‌లో వర్సిటీల్లో కుల, మత
►భేదాలకు తావులేని వ్యవస్థకు పునాదులు నిర్మిస్తాం. ఆత్మహత్యకు కారకులైన వారికి శిక్ష పడే వరకు,
►బాధిత కుటుంబానికి న్యాయం అందేదాకా మా పోరాటం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంటుంద’ ని హెచ్‌సీయూ విద్యార్థులు స్పష్టం చేశారు.
సిటీబ్యూరో/సెంట్రల్ యూనివర్సిటీ: విద్యార్థుల నిరసనలు, ఆందోళనలతో హెచ్‌సీయూ రణరంగాన్ని తలపించింది. పీెహ చ్‌డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో మూడో రోజు మంగళవారం పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు ఎగిశాయి. విద్యార్థులు ప్ల కార్డులు చేతపట్టి నినాదాలు చేశారు. వర్సిటీ బోధన, బోధనేతర సిబ్బంది వీరికి సంఘీభావంగా నిరసనలో పాల్గొన్నారు. హెచ్‌సీయూకి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ చ్చిన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బహిష్కరణకు గురైన విద్యార్థులకు మద్దతుగా ఇతర ప్రాంతాల నుంచి సామాజిక కార్యకర్తలు, వామపక్ష, ముస్లిం నేతలు హాజరయ్యారు. వీరితో పాటు ఉస్మానియా యూనివర్సిటీ, కళాశాలల నుంచి వందలాది మంది విద్యార్థులు చేరుకున్నారు. తనిఖీల తర్వాతనే వీరిని వర్సిటీలోకి పోలీసులు అనుమతించారు. గుర్తింపు కార్డులు ఉంటేనే లోపలికి పంపించడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓయూ విద్యార్థులను లోనికి అనుమతించకపోతే.. తామే బయటకు వెళ్లి గేట్లను బద్దలుగొడతామని హెచ్‌సీయూ విద్యార్థులు హెచ్చరించారు. ఈ విషయమై మాదాపూర్ డీసీపీ కార్తికేయకు విద్యార్థులు విజ్ఞప్తి చేయగా.. బయట ఉన్న వారిని లోపలికి అనుమతించారు.
సంఘటనపై రాహుల్ ఆరా
బహిష్కరణకు గురై... షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ‘వెలివాడ’ పేరిట విద్యార్థులు చేపట్టిన దీక్షా శిబిరంలో రాహుల్ గాంధీ దాదాపు 20 నిమిషాలు గడిపారు. రోహిత్ ఆత్మహత్యకు కారణాలను బహిష్కృత పీహెచ్‌డీ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ‘ముజఫర్ నగర్ అల్లర్లు’ డాక్యుమెంటరీపై వర్సిటీలో నిరసన కార్యక్రమం చేపట్టినప్పటి నుంచి రోహిత్ ఆత్మహత్య వరకు జరిగిన పరిణామాలను ఆయనకు విద్యార్థులు వివరించారు. ‘దేని ఆధారంగా మిమ్మల్ని బహిష్కరించారు? నావంతుగా నేనేం సాయం చేస్తానని మీరు భావిస్తున్నారు? నిజ నిర్ధారణ కమిటీ రాకతోనూ మీకు న్యాయం జరగకుంటే ఏం చేద్దామనుకుంటున్నారు?’ అని రాహుల్ వారిని ప్రశ్నించారు. ఏకపక్షంగా... విచారణ లేకుండా నివేదిక తయారు చేసి రాజకీయ పలుకుబడి ఉపయోగించి తమను సాంఘిక బహిష్కరణ చేశారని వారు బదులిచ్చారు. అనంతరం రోహిత్ కుటుంబ సభ్యులకు రాహుల్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మీడియాకు అనుమతి నిరాకరణపై అభ్యంతరం
హెచ్‌సీయూలో ‘వెలివాడ’ వద్ద ఏర్పాటు చేసిన సమావేశం కవరేజ్ విషయంలో డీసీపీ కార్తీకేయ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మాటామాటా అనుకున్నారు. 144 సెక్షన్ కొనసాగుతుండడంతో మీడియాకు అనుమతి లేదని డీసీపీ అనడంతో అక్కడే ఉన్న భట్టి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మీడియా కవర్ చేయకపోతే ఎలా అని డీసీపీని ప్రశ్నించారు. శాంతి భద్రతల దృష్ట్యా అనుమతికి నిరాకరించక తప్పదని డీసీపీ బదులిచ్చారు. అనుమతించకపోతే ఊరుకోబోమని భట్టి తేల్చి చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మీడియా చూసుకోవాలని డీసీపీ విజ్ఞప్తి చేయడంతో ఈ స్వల్ప వివాదం సద్దుమణిగింది.
పదవుల నుంచి తొలగించండి
హెచ్‌సీయూ నుంచి రోహిత్‌ను బహిష్కరించి... ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఎస్సీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఎంహెచ్‌ఆర్‌డీకి లేఖ రాసిన కేంద్రమంత్రి దత్తాత్రేయ, వీసీ అప్పారావుల తీరు కారణంగానే విద్యార్థి బలయ్యాడని ఆ సంఘం ఆరోపించింది. వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు... పదవుల నుంచి తొలగించాలని కోరింది. విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తి వేయాలని విజ్ఞప్తి చేసింది.
కఠినంగా శిక్షించండి
కవాడిగూడ: రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని... యూనివర్సిటీలలో మతతత్వ రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిప్పర్తి యాదయ్య డిమాండ్ చేశారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో తెలంగాణ విద్యావంతుల వేదిక గ్రేటర్ అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్, ఓట్ ఫర్ నీడ్ గ్యారెంటీ అధ్యక్షురాలు సొగరా బేగంలతో కలిసి మాట్లాడారు. దళిత విద్యార్థులపై దాడులకు పాల్పడుతున్న వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని యాదయ్య డిమాండ్ చేశారు. సమావేశంలో రామగిరి ప్రకాశ్, డాక్టర్ రమేష్, డి.శ్యామ్ సుందర్, కంటి సాయన్న, వినయ్ కుమార్, రాజా నర్సింగ్‌రావు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
రోహిత్‌కు ఘన నివాళి
రాయదుర్గం: హెచ్‌సీయూలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్‌కు గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ యూనవర్సిటీ (మనూ)లో మంగళవారం రాత్రి ఘనంగా నివాళులు అర్పించారు. వర్సిటీలోని సీపీడీయూఎంపీ భవనం నుంచి ప్రధాన గేట్ వరకు విద్యార్థులు, అధ్యాపకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. సీపీడీయూఎంపీ ఆడిటోరియంలో సంతాప సభ నిర్వహించారు.