
10 మంది హెచ్ సీయూ ప్రొఫెసర్ల రాజీనామా
హైదరాబాద్: పీహెచ్ డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. 10 మంది ఎస్టీ, ఎస్సీ ప్రొఫెసర్లు అడ్మినిస్ట్రేటివ్ పదవులకు రాజీనామా చేశారు. పరిపాలనా సంబంధిత పదవుల నుంచి తప్పుకుంటున్నామనీ, విద్యా బోధనలు కొనసాగిస్తామని వారు గురువారం మీడియాకు లేఖ విడుదల చేశారు. రాజీనామాలతో తాము అడ్మినిస్ట్రేషన్‌పై ఒత్తిడి తేగలమని పేర్కొన్నారు.
రోహిత్ ఆత్మహత్య ఘటనపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారంగానూ తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని అధ్యాపకులు ఆరోపించారు. రోహిత్ ఆత్మహత్య ఘటనపై వెలువెత్తిన నిరసనలకు తాము సంఘీభావం తెలపుతున్నామన్నారు. అంతేకాక ఇప్పటివరకూ విద్యార్థులపై సస్పెన్షన్, నమోదైన పోలీస్ కేసులను ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. కాగా, ఆదివారం వేముల రోహిత్ ఆత్మహత్య ఘటనతో దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో విద్యార్థులు, రాజకీయ పార్టీల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి.