- పౌర సంఘాలతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం
- రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు
హైదరాబాద్: బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, హిందుత్వ శక్తుల కుట్రలో భాగంగానే హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ ఆత్మహత్య జరిగిందని పలువురు వక్తలు ఆరోపించారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ద్వారా నాటకాలాడుతూ దళిత విద్యార్థులను ఎదగనివ్వకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. నిర్భయ చట్టం తరహాలో రోహిత్ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. రోహిత్ ఆత్మహత్యకు కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, రాజ్‌నాథ్ సింగ్, బండారు దత్తాత్రేయ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆదివారమిక్కడ తెలంగాణ డెమోక్రటిక్, సెక్యులర్ అలయెన్స్ సంస్థ ఆధ్వర్యంలో ‘రోహిత్ ఆత్మహత్య-జరుగుతున్న పరిణామాలు’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
అలయెన్స్ కన్వీనర్ డాక్టర్ కొల్లూరి చిరంజీవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సియాసత్ ఉర్దూ దినపత్రిక రెసిడెంట్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్, తామీరే మిల్లత్ ఉపాధ్యక్షుడు జియా ఉద్దీన్ నయ్యర్, ప్రొఫెసర్ నాగేశ్వర రావు, జమాతే ఇస్లామీ ప్రతినిధి అజారుద్దీన్, న్యాయవాది కె.ఎం.రాందాస్, ఏఐసీసీ సభ్యులు ఖలీ ఖుర్ రెహ్మాన్, జూపాక సుభద్రలతో పాటు మరో 40 సంఘాల ప్రతినిధులు పాల్గొని ప్రసంగించారు. రోహిత్ ఆత్మహత్యపై ఢిల్లీ, ముంబై, కేరళలోని నగరాల్లోనే ఆందోళనలు జరుగుతున్నాయని,హైదరాబాద్‌లో కేవలం హెచ్‌సీయూ క్యాంపస్‌కే పరిమితమయ్యాయని కొల్లూరి చిరంజీవి అన్నారు. పౌరసంస్థలతో కలసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి సిద్ధం కావాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించినట్లు పేర్కొన్నారు.
రోహిత్ చట్టం తేవాలి
Published Mon, Feb 15 2016 2:35 AM | Last Updated on Sun, Sep 3 2017 5:39 PM
Advertisement
Advertisement