విజయవాడలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న మేధావులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తున్న గ్రామ, వార్డు వలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు తప్పు అని ఒప్పుకుంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని పలువురు మేధావులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇంటెలెక్చువల్స్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో విజయవాడలో గురువారం ‘మానవ అక్రమ రవాణా–గ్రామ వలంటరీ వ్యవస్థ’పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ.. ఏ వారాహిపై నుంచి పవన్ నిందలు వేశారో అదే వారాహిపై నుంచి క్షమాపణలు చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో అతనిపై ప్రైవేటు కేసులు పెట్టాలని, అలాగే పరువునష్టం దావా వేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
వలంటీర్ల వ్యవస్థ ఏర్పడినపుడు.. సంచులు మోసే ఉద్యోగం అని, ఇంట్లో మగాళ్లు లేనప్పుడు వెళ్లి తలుపులు కొడతారా అని అప్పట్లో చంద్రబాబు విమర్శించారని గుర్తు చేశారు. చంద్రబాబు మాటలను జనం పట్టించుకోకపోవడంతో పవన్‌ను రంగంలోకి దించారన్నారు. నిఘా సంస్థల పేరును వాడుకుని చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను పవన్ యథాతథంగా చదువుతున్నారని అన్నారు. అసలు ఏపీ కంటే తెలంగాణలోనే అధికంగా ఇలాంటి కేసులు నమోదవుతున్నాయని, అక్కడ కేసీఆర్‌ను పవన్ ప్రశ్నించగలరా అని నిలదీశారు. ఈ కార్యక్రమంలో మేధావులు వెల్లడించిన అభిప్రాయాలు వారి మాటల్లోనే..
బిల్లును పాస్ చేయమని కేంద్రాన్ని కోరు..
యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వ్యవస్థలను ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసింది. మానవ అక్రమ రవాణాకు పేదరికం ఒక కారణమని గుర్తించి, దానిని నిర్మూలించడానికి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు చేపడుతోంది. కేంద్రంలో గతంలో మేనకా గాంధీ మంత్రిగా ఉన్నప్పుడు మానవ అక్రమ రవాణాపై ఒక బిల్లు తయారు చేశారు. దానిని ఇప్పటి వరకూ పాస్ చేయలేదు. దీనిపై పవన్ నిలదీయాల్సింది కేంద్ర ప్రభుత్వాన్ని గానీ రాష్ట్రాన్ని కాదు. ప్రతి వ్యవస్థలోనూ తప్పులు చేసేవారున్నారు.. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లను లోబరుచుకుని పిల్లలు పుట్టాక వదిలేసే వారున్నారు. అలాగని హీరోలందరూ అలానే ఉన్నారని అంటామా?
–పి.విజయ్‌బాబు, ఏపీ ఇంటెలెక్చువల్స్ సిటిజన్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు.
పవన్ మాటలు సమంజసం కాదు
రాష్ట్రంలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండటానికి జగన్ నిర్ణయాలు కారణం. గత ప్రభుత్వంలో పింఛన్ కావాలంటే జన్మభూమి కమిటీలకు లంచాలు సమర్పించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఒకటో తేదీనే కోడి కూయకముందే ఇంటికొచ్చి ఇస్తున్నారు. దీంతో పల్లెల్లో బిక్షాటన పూర్తిగా పోయింది. వలంటీర్ల గురించి తప్పుగా మాట్లాడటం పవన్‌కు సమంజసం కాదు.
–డాక్టర్ రామచంద్రారెడ్డి, విద్యావేత్త
నిఘా వర్గాలు మీకెందుకు చెప్పాయి?
ఏ రాజ్యాంగ పదవిలో ఉన్నారని పవన్‌కు కేంద్ర నిఘా వర్గాలు సమాచారం చెప్పాయి. నిఘా వర్గాల పేరును అడ్డుపెట్టుకుని కుట్ర పూరితంగా మాట్లాడుతున్నారు. వలంటీర్ల వ్వవస్థను నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు.
– పిల్లా రవి, న్యాయవాది.
డేటా, పేర్లు బయటపెట్టండి
భవిష్యత్ తరాల భవితకు పునాదులు వేస్తున్న ప్రభుత్వం ఇది. పవన్‌కు ఉన్న భావదారిద్య్రం మరొకరికి ఉండదు. రెండు లక్షల పుస్తకాలు చదివాడంట. కేంద్ర నిఘా సంస్థలు ఎలా పనిచేస్తాయో కూడా తెలియదా. పవన్ దగ్గర ఉన్న డేటా, అది చెప్పిన సంస్థల పేరు బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నా
–శిష్ల్ట ధనలక్ష్మి, న్యాయవాది.
చంద్రబాబు ఉచ్చులో పవన్
ఏ వలంటీర్ ఎంత మందిని అక్రమ రవాణా చేశారో ఆధారాలుంటే పవన్ బయటపెట్టాలి. ప్రజల్లో జనసేన చులకనై.. ఆ పార్టీ తన చెప్పు చేతల్లో ఉండాలని చంద్రబాబు పన్నిన ఉచ్చులో కుట్రలో పవన్ ఇరుక్కుంటున్నారు
–ఎన్‌వీ రావ్, అంతర్జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు.
పవన్ చేసింది నేరం
సెంట్రల్ ఇంటిలిజెన్స్ బ్యూరోని పవన్ బజారున పెట్టారు. మానవ అక్రమ రవాణా గురించి మాత్రమే ఇంటిలిజెన్స్ బ్యూరో చెవిలో చెప్పిందా లేక దేశ భద్రత రహస్యాలు కూడా చెప్పిందా? ఏపీ ప్రజలకు తెలియజేయమని తనకు నిఘా వర్గాలు చెప్పాయని పవన్ అనడం చాలా పెద్ద నేరం.
–ఎ.ఎస్.ఎన్. రెడ్డి, విశ్రాంత పోలీస్ అధికారి.
అప్పుడు నోరు లేవలేదేం
చదువురాని ఎంతో మందికి వలంటీర్లు సేవలందిస్తున్నారు. కాస్టింగ్ కౌచ్ అభియోగం వచ్చినప్పుడు పవన్ ఎందుకు మాట్లాడలేదు. ఆధార్ డేటాను టీడీపీ హయాంలో సాఫ్ట్‌వేర్ సంస్థకు ఇచ్చినప్పుడు నోరెందుకు మూగబోయింది. 60 శాతం పైగా ఉన్న మహిళా వలంటీర్లు మానసికంగా బాధపడేలా చేశారు.
– చంగవల్లి సాయిరాం, న్యాయవాది.
జగన్ ఓ స్టేట్స్ మేన్
సీఎం వైఎస్ జగన్‌ను ఏకవచనంతో పిలిస్తే ఏమవుతుంది. దాని వల్ల జగన్‌కు ఏమీ నష్టం లేదు. ఆయన సమర్థవంతమైన పాలనతో దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఎన్నో జాతీయ అవార్డులను తెచ్చుకుంటున్న స్టేట్స్ మేన్(గొప్ప రాజనీతిజ్ఞుడు) సీఎం జగన్. పవన్ బహిరంగ క్షమాపణ చెబితే ఆయనకే మంచిది. కాదంటే ఇకపై సహించేది లేదు.
– నరహరిశెట్టి నరసింహారావు, న్యాయవాది.
Comments
Please login to add a commentAdd a comment