
‘అసహనం వల్లే రోహిత్ మృతి’
జైపూర్: దేశంలో ఇప్పటికీ అసహనం స్థాయి ఎక్కువగానే ఉందని ఆ పరిస్థితుల వల్లే హెచ్‌సీయూ దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని ప్రముఖ రచయిత, కవి అశోక్ వాజ్‌పేయి వ్యాఖ్యానించారు. జైపూర్‌లో జరుగుతున్న లిటరరీ ఫెస్టివల్ (జేఎల్‌ఎఫ్)కు హాజరైన ఆయన రోహిత్ ఆత్మహత్యపై మాట్లాడారు. మోదీ ఈ ఘటనపై విచారాన్ని వ్యక్తం చేసినప్పటికీ దళిత అంశానికి ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం చాలా తాపీగా స్పందించిందన్నారు. ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేసిన సాహిత్య అకాడమీ అవార్డును వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదన్నారు.
వ్యవస్థే హత్య చేసింది: కవి సచ్చిదానందన్
జేఎల్‌ఎఫ్‌కు హాజరైన ప్రముఖ కవి కె. సచ్చిదానందన్ రోహిత్ హత్యను వ్యవస్థ చేసిన హత్యగా అభివర్ణించారు. దళిత విద్యార్థుల నిరంతర అణచివేత నేపథ్యంలోనే ఈ ఘటన చోటుచేసుకుందన్నారు. సెంథిల్ కుమార్ ఘటన నుంచి ఇప్పటివరకూ హెచ్‌సీయూలో ఇది ఎనిమిదో ఆత్మహత్య అన్నారు. ఇది దళితులు, దళితేతరుల పోరుకు సంబంధించిన అంశం కాదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతీ ఇరానీ వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పుబట్టారు.
బాలీవుడ్‌లో ఎలాంటి అసహనం లేదు: నటి కాజోల్
బాలీవుడ్‌లో ఎలాంటి అసహనం లేదని జేఎల్‌ఎఫ్‌కు హాజరైన నటి కాజోల్ అన్నారు. కాజోల్ స్నేహితుడు కరణ్ జోహార్ అసహనంపై వ్యాఖ్యలు చేసి వివాదాస్పదమైన నేపథ్యంలో ఆమె అసహనంపై ఆచితూచి స్పందించారు. సమాజంలో ఏం జరిగినా అది సినీ పరిశ్రమలో ప్రతిబింబిస్తుందన్నారు. బాలీవుడ్‌లో కులం, మతం అంటూ విభేదాలేవీ లేవని.. అసహనం అంతకన్నా లేదని ఆమె స్పష్టం చేశారు. మరోవైపు, ఈ ఘటనపై ప్రధాని మోదీ వారం రోజులు ఆలస్యంగా స్పందించటం దారుణమని కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ విమర్శించారు. మరోవైపు, ముంబైలోని అఖిలభారతీయ విద్యార్థి పరిషత్ కార్యాలయంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి కార్యాలయ సామగ్రిని ధ్వంసం చేశారు. రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో శనివారం కార్యాలయంపై దాడి జరిగింది.