
గొప్పోడవుతాడనుకుంటే బూడిదగా మార్చారు
‘గొప్పవాడు అవుతాడనే ఆశతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి నా బిడ్డను పంపితే బూడిదగా మార్చి నాకు
రోహిత్ సంతాప సభలో రోదించిన తల్లి రాధిక
సాక్షి, గుంటూరు: ‘గొప్పవాడు అవుతాడనే ఆశతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి నా బిడ్డను పంపితే బూడిదగా మార్చి నాకు పంపారు’ అని బలవన్మరణానికి పాల్పడిన రోహిత్ తల్లి రాధిక కన్నీటి పర్యంతమయ్యారు. రోహిత్ సొంత జిల్లా కేంద్రం గుంటూరులోని వైన్‌డీలర్స్ కల్యాణ మండపంలో శుక్రవారం రాత్రి రోహిత్ సంతాప సభ జరిగింది. రాధిక మాట్లాడుతూ చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులను తండ్రిలా చూసుకోవాల్సిన వైస్ చాన్స్‌లర్ ఇలా చేశాడంటూ రోదించింది.
రోహిత్ ఆశయాలు నెరవేర్చేందుకు అందరూ పోరాడాలని సంతాప సభకు హాజరైన వారికి చేతులు జోడించి అర్థించారు. రోహిత్ తమ్ముడు రాజ చైతన్యకుమార్ మాట్లాడుతూ అన్న చనిపోయినా అతని ఆశయాన్ని నెరవేరుస్తానని చెప్పారు. తమ కుటుంబానికి న్యాయం చేస్తే చాలన్నారు. రోహిత్ దళితుడిగానే వివక్షకు గురయ్యాడని, దళితుడిగానే వేధింపులకు గురయ్యాడని, దళితుడిగానే మృతి చెందాడని ఆవేదనపూరితంగా మాట్లాడారు.
బలహీన వర్గాల మనుగడకే ముప్పు..
సంతాప సభలో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం మాట్లాడుతూ రోహిత్ మృతిచెందిన తీరు చూస్తుంటే బడుగు, బలహీన వర్గాల మనుగడకే ముప్పు వాటిల్లుతుందనే భావన కలుగుతోందన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత 200 పైచిలుకు దళితుల అణచివేత సంఘటనలు జరిగాయన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ రోహిత్ మృతి తమ బాధ్యతారాహిత్యాన్ని గుర్తు చేసిందని, మేమూ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉందన్నారు. నాడు విద్యార్థులు కోరుకున్నట్లు తాను, గద్దర్ వారి శిబిరం వద్దకు వెళ్లి ఉంటే రోహిత్‌లో మనోస్థైర్యం కలిగి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చి ఉండేది కాదేమోననే బాధ తనను కలచివేస్తుందన్నారు.
మతవాద శక్తులకు వ్యతిరేకంగా పోరాటం
వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ రోహిత్ మరణం దేశవ్యాప్తంగా పలు ప్రశ్నలను లేవనెత్తిందని, ఆయన మరణం వృధా కాకూడదన్నారు. రోహిత్ మృతిపై అన్ని వర్గాలూ స్పందించి మహోద్యమంగా మారుతుందని గ్రహించిన కేంద్రం తలవంచిందని, నలుగురు విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేత, ప్రధాని నోరువిప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు. మతవాద శక్తుల భావజాలానికి వ్యతిరేకంగా పోరాడటానికి వైఎస్సార్‌సీపీ ముందుంటుందన్నారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ రోహిత్ తల్లి కులం మాల కుల మేనని ఉద్ఘాటించారు. అవకాశం ఉంటే రోహిత్ తమ్ముడు రాజచైతన్యను దత్తత తీసుకుంటానని ప్రకటించారు.