
రోహిత్ ఆత్మహత్యపై టీఆర్ఎస్ మౌనం
హైదరాబాద్: హెచ్ సీయూ పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై అధికార టీఆర్ఎస్ పార్టీ మౌనం రాజకీయ వర్గాల్లో చర్చ రేకిస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై 'గులాబీ' నేతలు గళం విప్పకపోవడం విస్మయం కలిగిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ కు విద్యార్థులు దన్నుగా నిలిచారు. అలాంటి ఉద్యమ పార్టీ విద్యార్థి ఆత్మహత్యపై తగిన రీతిలో స్పందికపోవడం పట్ల స్టూడెంట్ యూనియన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.
రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో హెచ్ సీయూలో జరుగుతున్న విద్యార్థుల పోరాటానికి పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్, వామపక్షాలు, వైఎస్సార్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, జేడీ(యూ) నేతలు విద్యార్థులలతో పాటు పలు ప్రజా సంఘాలు సంఘీభావం ప్రకటించారు. ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, వామపక్షాల అగ్రనేతలు స్వయంగా విచ్చేసి హెచ్ సీయూను సందర్శించారు. విద్యార్థులకు మద్దతు తెలిపారు. కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ రాజీనామాలకు పట్టుబట్టారు. రోహిత్ ఆత్మహత్యకు మోదీ సర్కారే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత దీనిపై స్పందించారు. ఆమె నేతృత్వంలో నడుస్తున్న తెలంగాణ జాగృతికి చెందిన కార్యకర్తలు దత్తాత్రేయ ఇంటి వద్ద ఆందోళన నిర్వహించారు. అయితే టీఆర్ఎస్ అగ్రనేతలెవరూ గట్టిగా మాట్లాడలేదు. దళిత కమ్యునిటీ సెంటిమెంట్స్ తో ముడిపడిన ఈ ఉదంతాన్ని తాము రాజకీయం చేయాలనుకోవడం లేదని సీనియర్ నేత, తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులైన దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్రరావులపై చర్యలు తీసుకోవాలని తమ పార్టీ ఎంపీ కవిత డిమాండ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగానే మౌనం దాల్చారని తెలుస్తోంది. దీనిపై తాము స్పందిస్తే మాటల యుద్ధానికి తెర లేచే అవకాశముందని, కీలకమైన జీహెచ్ ఎంసీ ఎన్నికల తరుణంలో కేసీఆర్ వివాదాలను కొని తెచ్చుకోవడానికి సుముఖంగా లేని కారణంగానే ఆయన మౌనంగా ఉన్నట్టు విశ్వనీయ వర్గాల సమాచారం. సీఎం సైలెంట్ గా ఉండడంతో మంత్రులు కూడా నోరు మెదపడం లేదు.
టీఆర్ఎస్ స్పందిచక పోవడాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ మాట తప్పిన విషయాన్ని మళ్లీ తిరగదోడుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటనపై అధికార టీఆర్ఎస్ నేతలు మౌనం దాల్చడం శోచనీయమని విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నాయి. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే గులాబీ నేతలు సైలెంట్ గా ఉన్నారని ఆరోపిస్తున్నాయి.