
కేంద్రమంత్రులు వైదొలగాల్సిందే
♦ వీసీని తొలగించాల్సిందే!
♦ డిమాండ్లన్నింటినీ అంగీకరించాలి.. విద్యార్థుల స్పష్టీకరణ
♦ హెచ్‌సీయూలో కొనసాగుతున్న ఆందోళనలు
♦ మూడోరోజుకు చేరిన ఆమరణ దీక్ష
♦ ముగ్గురు విద్యార్థులకు తగ్గిన బీపీ, షుగర్ లెవల్స్
♦ సంఘీభావం ప్రకటించిన {తిపుర సీఎం, ఎంపీలు త్యాగి, సీమ
సాక్షి, హైదరాబాద్: రోహిత్ ఆత్మహత్యపై హెచ్‌సీయూలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తమ డిమాండ్లన్నింటినీ నెరవేర్చే దాకా పోరు ఆగబోదని విద్యార్థుల ఐక్య కార్యాచరణ కమిటీ(జేఏసీ) శుక్రవారం తేల్చిచెప్పింది. రోహిత్ మరణానికి కారకులైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, వైస్ చాన్స్‌లర్‌ను తొలగించాలని స్పష్టం చేసింది. కేంద్రమంత్రులు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీని తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. మరోవైపు తమ డిమాండ్ల సాధన కోసం ఏడుగురు విద్యార్థులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మూడోరోజుకు చేరుకుంది.
శుక్రవారం వారికి ైవె ద్యులు పరీక్షలు నిర్వహించారు. వారిలో ముగ్గురి షుగర్ లెవల్స్, బీపీ తగ్గినట్లు తెలిపారు. దీక్ష కొనసాగితే ఆరోగ్యం ఆందోళనకరంగా మారుతుందన్నారు. దీంతో వర్సిటీ అధికారులు దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేసినా అందుకు విద్యార్థులు ససేమిరా అన్నారు. మరోవైపు విద్యార్థులు తరగతులు బహిష్కరించి సౌత్ క్యాంపస్ నుంచి మెయిన్ క్యాంపస్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు.
25న యథాతథంగా చలో హెచ్‌సీయూ
తమ డిమాండ్ల సాధన కోసం ఈనెల 25న దేశంలోని అన్ని వర్సిటీల విద్యార్థులతో తలపెట్టిన ‘చలో హెచ్‌సీయూ’ కార్యక్రమం యథాతథంగా జరుగుతుందని విద్యార్థులు తెలిపారు. దేశంలోని పలు వర్సిటీల నుం చి విద్యార్థులు ఇక్కడికి వచ్చేందుకు సిద్ధమయ్యారని జేఏసీ నాయకుడు వెంకటేష్ చౌహాన్ పేర్కొన్నారు.
ప్రముఖుల సంఘీభావం
హెచ్‌సీయూలో పోరుబాట పట్టిన విద్యార్థులకు మద్దతు వెల్లువెత్తుతోంది. శుక్రవారం త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ , జేడీయూ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు కేసీ త్యాగి, కేరళకు చెందిన ఎంపీ సీమ, కాంగ్రెస్ నేత మధుయాష్కీ, మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీ తదితరులు ఆమరణ దీక్ష చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సీమ మాట్లాడుతూ.. తాను వర్సిటీ కోర్ట్‌సభ్యులుగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నానన్నారు. జస్టిస్ చంద్ర కుమార్, కాకి మాధవరావు, ప్రొఫెసర్ కంచ ఐలయ్య నేతృత్వంలో ఏర్పడిన కమిటీ ఫర్ నేషనల్ రెస్పాన్సిబిలిటీ సభ్యులు కూడా విద్యార్థులను పరామర్శించారు. ఈ కమిటీ శనివారం మధ్యాహ్నం ఇందిరాపార్క్ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చింది.
ఫ్యాకల్టీకి విద్యార్థుల విన్నపం
రోహిత్ మరణానికి కారణాలను, అనంతరం జరిగిన పరిణామాలను విద్యార్థులు శుక్రవారం వర్సిటీ అధికారుల బృందం ముందుంచారు. అత్యంత పేదరికం నుంచి ఉన్నత విశ్వవిద్యాలయాలకు వస్తున్న దళిత విద్యార్థులకు ఎదురవుతున్న చేదు అనుభవాలను వివరించారు. తమపట్ల వివక్షాపూరితంగా, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సమానత్వాన్ని శ్వాసించిన అంబేడ్కర్ భావజాలాన్ని, సిద్ధాంతాన్ని అనుసరిస్తున్న తమను తీవ్రవాదులని ముద్రవేస్తున్నారని దుయ్యబట్టారు. రోహిత్ మరణానికి ముందే విద్యార్థులపై సస్పెన్షన్‌ను ఎత్తి వేస్తే అతడు ప్రాణాలు కోల్పోయి ఉండేవాడు కాదని అన్నారు.
రోహిత్ చనిపోయాక సస్పెన్షన్ ఎత్తివేసి రక్తపు చేతులు కడుక్కోవడం విడ్డూరంగా ఉందని అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ నాయకులు ప్రశాంత్, విజయ్‌కుమార్, సుంకన్న, శేషయ్య మండిపడ్డారు. రోహిత్ వంటి దళిత మేధావులను అడ్డుకునేందుకు వీసీ అప్పారావులాంటి వారు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధ్యాపక బృందం నిజానిజాలు తేల్చుకోవాలనుకుంటే తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లను పరిశీలించవచ్చని అన్నారు.