జేఎన్‌యూలో గరంగరం | Heat in JNU | Sakshi
Sakshi News home page

జేఎన్‌యూలో గరంగరం

Published Thu, Feb 11 2016 7:45 AM | Last Updated on Sun, Sep 3 2017 5:22 PM

జేఎన్‌యూలో గరంగరం

జేఎన్‌యూలో గరంగరం

 ‘అఫ్జల్‌గురు ఉరితీత’కు వ్యతిరేకంగా విద్యార్థుల కార్యక్రమం
♦ ఏబీవీపీ ఆందోళనతో విచారణకు ఆదేశించిన వర్సిటీ పాలకవర్గం
♦ ముందుగా నిరసన ప్రదర్శనకు అనుమతి పొందిన నిర్వాహకులు
 
 న్యూఢిల్లీ: పార్లమెంటుపై దాడి కేసులో మరణశిక్షకు గురైన అఫ్జల్ గురు ఉరితీతకు వ్యతిరేకంగా, కశ్మీరీ ప్రజల పోరాటానికి మద్దతుగా.. ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ)లో మంగళవారం సాయంత్రం పలువురు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించటంపై వర్సిటీ పాలకవర్గం క్రమశిక్షణా విచారణకు ఆదేశించింది. ఆ కార్యక్రమం దేశ వ్యతిరేకమైన కార్యక్రమమని..అనుమతి రద్దు చేసినా కార్యక్రమాన్ని నిర్వహించారని, అందుకు బాధ్యులైన విద్యార్థులను బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ సభ్యులు బుధవారం వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టడంతో పాలకవర్గం విచారణకు ఆదేశించింది.

దేశ విభజనకు సంబంధించి ఎటువంటి మాటలైనా జాతీయత కాబోదని, విద్యార్థుల చర్య క్రమశిక్షణారాహిత్యం కిందకు వస్తుందని పేర్కొంటూ.. ఆ కార్యక్రమంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా జేఎన్‌యూ చీఫ్ ప్రోక్టార్ సారథ్యంలోని కమిటీకి నిర్దేశించింది. ఆ కార్యక్రమం వీడియో దృశ్యాలను చీఫ్ ప్రోక్టార్ పరిశీలిస్తారని, సాక్షులతో మాట్లాడతారని.. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా వర్సిటీ తగిన చర్యలు చేపడుతుందని  వీసీ జగదీశ్‌కుమార్  విద్యార్థులతో మాట్లాడాక పేర్కొన్నారు. కార్యక్రమం అఫ్జల్‌కు సంబంధించి ఉంటుందని.. అనుమతి దరఖాస్తులో ప్రస్తావించలేదని, ఒక సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించాలనుకుంటున్నామని మాత్రమే పేర్కొన్నారని వర్సిటీ రిజిస్ట్రార్ భూపీందర్‌జుత్షీ చెప్పారు.

అఫ్జల్, మక్బూల్‌భట్‌లను ‘చట్టబద్ధంగా హత్యచేయడాన్ని’ వ్యతిరేకిస్తూ నిరసన, కశ్మీరీల స్వీయ నిర్ణయాధికార పోరాటానికి సంఘీభావంగా ప్రదర్శనలో పాల్గొనాలని విద్యార్థి నిర్వాహకులు మంగళవారం వర్సిటీ క్యాంపస్ అంతటా పోస్టర్లు అతికించారు. ఈ కార్యక్రమానికి ఏబీవీపీ అభ్యంతరం వ్యక్తం చేసి వీసీకి లేఖరాయడంతో ఆ ప్రదర్శనను రద్దే చేయాలని పాలకవర్గం ఆదేశించింది. అనుమతిని రద్దు చేసినా కూడా.. నిర్వాహకులు నిరసన కార్యక్రమానికి బదులుగా సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా, జేఎన్‌యూ విద్యార్థి సంఘం కార్యదర్శి, ఆ సంఘంలో ఏకైక ఏబీవీపీ సభ్యుడు అయిన సౌరభ్‌కుమార్.. ‘‘ప్రజాస్వామ్య ఆలయంపై దాడి చేసిన అఫ్జల్‌గురుపై ఒక కార్యక్రమాన్ని వర్సిటీలో ఎలా నిర్వహించగలరు?  ప్రదర్శన నిర్వహించకుండా ఆపేందుకు మేం ప్రయత్నించినపుడు నాకు తుపాకీ చూపించారు’ అని ఆరోపించారు. వారిని బహిష్కరించాలని కేంద్రాన్ని కోరతామని ఏబీవీపి తెలిపింది.

 ‘హైదరాబాద్  చర్యల పునరావృతమే’
 తమ సొంత సిద్ధాంతానికి వ్యతిరేకమైన ప్రతిదాన్నీ ఏబీవీపీ ‘దేశ వ్యతిరేకం’గా అభివర్ణిస్తుందని ఆ కార్యక్రమ నిర్వాహకులు తప్పుపట్టారు. ‘‘మేం అనుమతి తీసుకుంటాం.. చివరి రోజున ఏబీవీపీ వస్తుంది. పాలకవర్గం అనుమతిని రద్దు చేస్తుంది.. ఇది పరిపాటి. హైదరాబాద్ వర్సిటీలో రోహిత్ ఆత్మహత్యకు కారణమైన ఏబీవీపీ చర్యల పునరావృతమే ఇది’’ అని నిర్వాహకుల్లో ఒకరైన అనీర్బన్‌భట్టాచార్య విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement