నా బిడ్డ మరణానికి కారకులెవ్వరు? | Rohith mother Radhika direct question | Sakshi
Sakshi News home page

నా బిడ్డ మరణానికి కారకులెవ్వరు?

Published Sun, Jan 24 2016 10:44 AM | Last Updated on Mon, Oct 22 2018 2:09 PM

శనివారం హెచ్‌సీయూలో దీక్షా స్థలి వద్ద మాట్లాడుతున్న రోహిత్ తల్లి రాధిక. చిత్రంలో రోహిత్ సోదరుడు రాజు చక్రవర్తి, సోదరి నీలిమ - Sakshi

శనివారం హెచ్‌సీయూలో దీక్షా స్థలి వద్ద మాట్లాడుతున్న రోహిత్ తల్లి రాధిక. చిత్రంలో రోహిత్ సోదరుడు రాజు చక్రవర్తి, సోదరి నీలిమ

నా బిడ్డ మరణానికి కారకులెవ్వరు?: రోహిత్ తల్లి రాధిక
నా తమ్ముడిని ఆత్మహత్యకు పురిగొల్పి హత్య చేశారు: రోహిత్ సోదరి
 
 సాక్షి, హైదరాబాద్: ‘‘నా కొడుకు మరణానికి కారకులెవరో తేల్చాలి. నా ప్రశ్నలు వేటికీ కూడా వైస్ చాన్స్‌లర్ అప్పారావు సమాధానం చెప్పలేదు. నా కొడుకు మరణం గురించి ప్రశ్నిస్తే కులం ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు..?’’ అని రోహిత్ తల్లి రాధిక సూటిగా ప్రశ్నించారు. శనివారం ఆమె సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల దీక్షాస్థలి వద్ద మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. రోహిత్ కులంపై చెలరేగిన వివాదానికి తెరదించుతూ... ‘‘అవును.. నా భర్త వడ్డెర కులస్తుడే. కానీ నేను, నా బిడ్డలు మాత్రం మాల కులానికి చెందినవారం’’ అని స్పష్టంచేశారు. రోహిత్‌తో పాటు తన మరో ఇద్దరు పిల్లలు మాలల మధ్యే పెరిగారని, మాలల ఆచార వ్యవహారాలే పాటించారని చెప్పారు.

తనను ఐదేళ్ల వయసులో వడ్డెర కులస్తుల వద్ద తన తల్లిదండ్రులు వదిలి వెళ్లారని, అప్పట్నుంచీ ఆలనా పాలనా వాళ్లే చూశారని రాధిక వివరించారు. తాను మాల కులస్తులకు జన్మించినా.. వడ్డెర కులస్తుల దగ్గర పెరిగానని తెలిపారు. అందువల్ల వడ్డెర కులస్తుడికి ఇచ్చి 1985లో తన వివాహం జరిపార ని పేర్కొన్నారు. రోహిత్, నీలిమ, రాజు చక్రవర్తి పుట్టిన తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల భర్తతో విడిపోయినట్లు చెప్పారు. తాను స్వతహాగా ఎస్సీ మాల కులానికి చెందిన వ్యక్తిని కనుక.. మాలలు నివసించే ప్రాంతంలోనే తన బిడ్డలతో బతికానని రాధిక వెల్లడించారు. ఢిల్లీలో నిర్భయ దుర్ఘటన జరిగిన తర్వాత ఆమె కులం ప్రస్తావన రాలేదు.. కానీ తన బిడ్డ మరణించాక తమ కులం గురించి ఎందుకు ఆరా తీస్తున్నారని ప్రశ్నించారు. ‘‘యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ అప్పారావు మాకు రూ.8 లక్షల నష్ట పరిహారం ప్రకటించారు. రూ.8 కోట్లు ఇచ్చినా కూడా మాకు అక్కర్లేదు. మొదట నా బిడ్డ మరణానికి కారణమేంటో చెప్పండి. సస్పెన్షన్ తర్వాత కూడా మాకు ఎందుకు సమాచారం అందించలేదో వీసీ సమాధానం చెప్పాలి. అసలు నా బిడ్డను మీరు చంపారా? తానే చనిపోయాడా ఇప్పుడు తేల్చాలి’’ అని రాధిక అన్నారు. తన కొడుకు మృతికి కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

 

 నా తమ్ముడు పిరికివాడు కాదు: రోహిత్ సోదరి నీలిమ

 రోహిత్ సోదరి నీలిమ మాట్లాడుతూ... వీసీ మీడియా ముందుకొచ్చి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ‘‘నా తమ్ముడి మరణానంతరం నలుగురు దళిత విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నామని వీసీ చెప్పారు. దీనిద్వారా సస్పెన్షన్ ఎత్తివేత ఎవరి చేతిలో ఉందో స్పష్టమవుతోంది. సంతాపం తెలియజేయడానికి కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి ఐదు రోజులు పట్టాయి. ఆమె కూడా తల్లే కదా? మహిళే కదా? ఆమెకు ఓ తల్లి బాధ అర్థం కాలేదా’’ అని ప్రశ్నించారు. తన తమ్ముడు పిరికివాడు కాదని, ఆత్మహత్యకు పాల్పడే తత్వం కాదని చెప్పారు. అతడిని ఆత్మహత్యకు పురికొల్పి, హత్య చేశారని ఆరోపించారు. మొదట ఏబీవీపీ నాయకుడు సుశీల్ కుమార్‌కి, ఆ తర్వాత వీసీకి శిక్షపడాలని అన్నారు. ఫేస్‌బుక్‌లో ఎదుర్కోలేక తన అధికారం, కేంద్ర మంత్రుల జోక్యంతో కేసులో ఇరికించారని చెప్పారు. అందుకు కేంద్రమంత్రులు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీ, వీసీలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

 మోదీ ఐదు రోజులుగా ఎందుకు మాట్లాడలేదు: రోహిత్ సోదరుడు

 ‘‘ప్రధాని మోదీని అనేంతటి వాడిని కాదు కానీ గత ఐదు రోజులుగా.. ఆయన నా అన్న చావు గురించి ఎందుకు మాట్లాడలే దు? రోహిత్ మరణంపై విద్యార్థులు ప్రశ్నించిన తర్వాత భరత మాత ముద్దుబిడ్డని కోల్పోయిందనడంలో అర్థమేముంది?’’ అని రోహిత్ సోదరుడు రాజు చక్రవర్తి అన్నారు. తన అన్న రోహిత్.. ఏనాడూ ఎస్సీ రిజర్వేషన్ ద్వారా విద్యాసంస్థల్లో ప్రవేశం పొందలేదని, అతను మెరిట్ స్టూడెంట్ అని, జనరల్ కేటగిరీలోనే ఈ క్యాంపస్‌లో ప్రవేశం పొందాడని వివరించారు. ఎమ్మెస్సీలో ఆల్ ఇండియా లెవల్‌లో ఆరో ర్యాంకు సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. ‘‘మా నాన్న నాకు తండ్రే కానీ తన దగ్గర మేమెప్పుడూ పెరగలేదు. మాలలుగానే పెరిగాం. మాలలుగానే తిన్నాం. మాలలుగానే వివక్ష ఎదుర్కొన్నాం. చివరకు నా అన్న అదే కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి మరణించాడు’’ అని రాజు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రశ్నలకు వీసీ తక్షణమే సమాధానం చెప్పాలని, రోహిత్ మరణానికి కారణమైన ప్రతి ఒక్కరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement