ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రాయ్ బరేలీ పోటీ నిర్ణయంపై బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పశ్చిమ బెంగాల్‌లో ఇవాళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. వయనాడ్‌లో ఓడిపోతాడని తెలిసే రాహుల్ రాయ్‌బరేలీకి పారిపోయారన్నారు.
ఇవాళ ఆయనకు ఒక్కటే చెప్పదల్చుకున్నా. భయం వద్దు(డరో మత్).. పారిపోవద్దు(భాగో మత్).. అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. (బీజేపీ దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తుందని ఆరోపించే క్రమంలో తరచూ ‘భయం వద్దు డరో మత్’ అంటూ రాహుల్ గాంధీ చెబుతుంటారు).
‘‘వాళ్ల అగ్రనేత పోటీకి భయపడతాడని నేను ముందే చెప్పా. ఆయన మాత్రమే కాదు.. ఆమె (సోనియా గాంధీ) కూడా పోటీ చేయడానికి ధైర్యం చేయలేదు. అందుకే ఆమె రాజ్యసభ వంకతో రాజస్థాన్ పారిపోయారు. ఇదే జరిగింది. ఇంతలా భయపడే వీళ్లు దేశమంతా తిరుగుతూ ప్రజల్ని భయపడొద్దని చెబుతున్నారు.
వయనాడ్‌లో ఆయన ఓడిపోతారని నేను చెప్పా. ఆయన తన ఓటమిని గానే గుర్తించారు. అందుకే ఇప్పుడు మరో చోట పోటీ చేస్తున్నారు. నేను చెబుతున్నా.. భయపడకు, పారిపోకు’’ అంటూ ప్రధాని మోదీ ప్రసంగించారు.
రాహుల్ గాంధీ అమేథీ నుంచి కాకుండా రాయ్ బరేలీ నుంచి పోటీ చేయడంపై బీజేపీ నేతలంతా స్పందిస్తున్నారు . అమేథీలో ఏం చేయని వారు.. రాయ్ బరేలీలో ఏం చేస్తారు? అని బీజేపీ అమేథీ అభ్యర్థి స్మృతి ఇరానీ నిలదీశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమేథీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాయి. అది చూసే సోనియా కుటుంబం పోటీ చేయకుండా పారిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment