రాహుల్ క్షమాపణ చెప్పాలి
♦ ఏబీవీపీ డిమాండ్.. ట్యాంక్‌బండ్ వద్ద ఆందోళన
♦ ఉగ్రవాదులకు మద్దతుదారైన రోహిత్‌ను మహాత్ముడితో పోలుస్తారా?
♦ రాజకీయ మనుగడ కోసం రాహుల్ నీచమైన చర్యలు చేపడుతున్నారు
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాది యాకూబ్ మెమెన్‌కు మద్దతుగా ప్రదర్శనలు చేసిన వారిని జాతిపిత మహాత్మాగాంధీతో పోల్చడం తీవ్రమైన నేరమని.. దీనిపై రాహుల్‌గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. హెచ్‌సీయూలో రోహిత్ ఆత్మహత్య ఘటనపై రాహుల్ శవ రాజకీయాలు, కుల రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడింది. రాహుల్ రెండుసార్లు హెచ్‌సీయూను సందర్శించడాన్ని నిరసిస్తూ ఆదివారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద ఏబీవీపీ ఆందోళన చేపట్టింది.
కొన్ని పార్టీలు, నాయకులు రాజకీయంగా లబ్ధి పొందేందుకు రోహిత్‌ను దళితుడిగా చిత్రీకరించారని ఏబీవీపీ నేతలు మండిపడ్డారు. అంబేడ్కర్ స్టూడెంట్ అసోసియేషన్ (ఏఎస్‌ఏ) పేరుతో కొందరు తీవ్రవాద కార్యకలాపాలకు మద్దతు తెలుపుతున్నారని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి అయ్యప్ప ఆరోపించారు. ఉగ్రవాదులు మెమెన్, అఫ్జల్‌గురు, కసబ్‌లను చట్టబద్ధంగా ఉరి తీశారని.. దానిని నిరసిస్తూ కార్యక్రమాలు చేపట్టిన వారు ఆ ఉగ్రవాదులకు మద్దతుదారులేనని చెప్పారు. అలాంటివారిని మహాత్ముడితో పోల్చడం తీవ్ర నేరమన్నారు. జాతిపితను అవమానించిన రాహుల్‌గాంధీ వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇటీవల పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదులతో పోరాడి నేలకొరిగిన జవాన్ల కుటుంబాలను పరామర్శించడానికి సమయం కేటాయించని రాహుల్.. హెచ్‌సీయూను సందర్శించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. రాజకీయ మనుగడ కోసం నీచమైన చర్యలకు ఒడిగట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. రోహిత్ తన సూసైడ్‌నోట్‌లో పేర్కొన్న ఏఎస్‌ఏ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై హత్యాయత్నం కింద కేసులు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హెచ్‌సీయూ విద్యార్థుల్లో కొందరు ప్రొఫెసర్లు విషబీజాలు నాటుతున్నారని, అటువంటి వారిని గుర్తించి సమగ్ర విచారణ జరపాలన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నిరంజన్, మట్ట రాఘవేందర్, దిలీప్, హైదరాబాద్ నగర కార్యదర్శి వెంకట్‌రెడ్డి, ప్రవీణ్, జగన్, యాదగిరి, ఎల్లాస్వామి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.