కేంద్ర మంత్రులపై చర్యలు తీసుకోకపోవడం పట్ల విపక్షాల ఆగ్రహం
న్యూఢిల్లీ: హెచ్‌సీయూ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మొసలి కన్నీరు కారుస్తున్నారని కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. రోహిత్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోకుండా ప్రధాని ఆవేదన వ్యక్తం చేయటం వల్ల ఏం ఉపయోగమని ప్రశ్నించాయి. కేంద్రమంత్రులు ఇరానీ, బండారు దత్తాత్రేయ రాజీనామా చేయాల్సిందే అని పట్టుపట్టాయి. మీరు ఏం చర్యలు తీసుకున్నారో.. రోహిత్ తల్లిదండ్రులకు.. దళితులకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి టామ్ వాడక్కన్ డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సహించేది లేదని మిగతా మంత్రులకు ప్రధాని చెప్పాలని సూచించారు.
రోహిత్ మరణంపై స్పందించేందుకు మోదీ ఇంతకాలం ఎందుకు తీసుకున్నారని, దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగితేగానీ ప్రధాని స్పందించకపోవడం బాధ్యతా రాహిత్యమని సీపీఎం నేత ఎండీ సలీమ్ మండిపడ్డారు. రోహిత్ మృతికి కారణమైన ఇరానీ, హెచ్‌సీయూ యంత్రాంగం పైన చర్యలు తీసుకోకపోవడాన్ని తృణమూల్ ఎంపీ సౌగతా రాయ్ తప్పుపట్టారు. అయితే, రోహిత్ ఆత్మహత్యను కొన్ని పార్టీలు రాజకీయం చేయడం దురదృష్టకరమని బీజేపీ పేర్కొంది. వారికి సమాధానం చెప్పేందుకే కేంద్రం జ్యుడిషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసిందని స్పష్టం చేసింది.
రాజస్థాన్ వర్సిటీ వీసీపై కేసు: రాజస్థాన్ సెంట్రల్ వర్సిటీ వీసీ అరుణ్‌కుమార్ పుజారితో పాటు మరో ఆరుగురు అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. దళిత స్కాలర్ ఉమేశ్‌కుమార్ జోన్వాల్‌పై వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో గురువారం కిషన్‌గఢ్ కోర్టు ఆదేశాల మేరకు అజ్మీర్ జిల్లా బందర్ సిందారీలో పోలీసులు ఈ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
రోహిత్‌పై ప్రధానిది మొసలి కన్నీరు
Published Sat, Jan 23 2016 2:39 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement