హెచ్ సీయూలో తరగతులు ప్రారంభం | classes starts from today onwords | Sakshi
Sakshi News home page

హెచ్ సీయూలో తరగతులు ప్రారంభం

Published Tue, Feb 2 2016 2:42 AM | Last Updated on Sun, Sep 3 2017 4:46 PM

హెచ్ సీయూలో తరగతులు ప్రారంభం

హెచ్ సీయూలో తరగతులు ప్రారంభం

శాంతించిన విద్యార్థులు.. 8 ప్రధాన డిమాండ్లతో వినతిపత్రం
పది రోజుల్లో పరిష్కరించకుంటే మళ్లీ ఉద్యమిస్తామని హెచ్చరిక

డిమాండ్లపై సానుకూలంగా వ్యవహరిస్తాం: ఇన్‌చార్జి వీసీ పెరియస్వామి

సాక్షి, హైదరాబాద్: రోహిత్ ఆత్మహత్యతో ఉద్రిక్తంగా మారిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పరిస్థితులు చక్కబడుతున్నాయి. దాదాపు రెండు వారాల అనంతరం సోమవారం తరగతులు ప్రారంభం అయ్యాయి. వర్సిటీ ఇన్‌చార్జి వైస్ చాన్సలర్ పెరియస్వామి విజ్ఞప్తి మేరకు విద్యార్థులతో పాటు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది యధావిధిగా విధులకు హాజరయ్యారు.

ఇక విద్యార్థులు ఎనిమిది డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఇన్‌చార్జి వీసీ పెరియస్వామికి అందజేశారు. పది రోజుల్లోగా తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేకపోతే ఉద్యమాన్ని తిరిగి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని కేంద్ర మానవ వనరుల శాఖ తమకు సూచించిందని ఇన్‌చార్జి వీసీ పెరియస్వామి తెలిపారు.

ఇక విద్యార్థుల డిమాండ్లపై సానుకూలంగా వ్యవహరిస్తున్న ఇన్‌చార్జి వీసీ పెరియస్వామికి కొంత సమయం ఇవ్వాలని భావిస్తున్నట్లు హెచ్‌సీయూ ఎస్సీ, ఎస్టీ అధ్యాపకులు, రోహిత్ ఉద్యమానికి అనుకూలంగా ఉన్న ఇతర అధ్యాపకులు పేర్కొన్నారు. అధ్యాపకులకు, అధ్యాపకేతర సిబ్బందికి వేతనాలు, విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్‌షిప్‌లు సోమవారం విడుదలైనట్లు తెలిపారు. మరోవైపు సోమవారం కూడా ముంబై, ఢిల్లీల్లో విద్యార్థుల నిరసన ప్రదర్శనలు కొనసాగాయి.

డిమాండ్లను పరిష్కరిస్తాం: ఇన్‌చార్జి వీసీ
విద్యార్థుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ఈ విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాల్సిందిగా మానవ వనరుల అభివృద్ధి శాఖ తనకు సూచించిందని ఇన్‌చార్జి వీసీ పెరియస్వామి తెలిపారు. ఆ డిమాండ్లలో తన పరిధిలో ఉన్న వాటిని వెంటనే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. వర్సిటీ వీసీ అప్పారావును తొలగించే అంశం తన పరిధిలోది కాదని, విచారణ కమిటీ నివేదిక అనంతరం కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. రోహిత్ తమ్ముడు రాజుకు ఆయన విద్యార్హతలను బట్టి ఎక్కడ అవకాశం కల్పించగలమనే దానిని వర్సిటీ పాలకమండలి పరిశీలిస్తోందన్నారు. అలాగే 50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించే అంశాన్ని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పరిశీలిస్తున్నట్లు తెలిసిందని...

వర్సిటీ అధ్యాపకులు సైతం కొంత సాయం చేయాలని యోచిస్తున్నారని తెలిపారు. ఇక గతంలో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల కుటుంబ సభ్యులకు ఉద్యోగావకాశాలు, నష్టపరిహారం చెల్లింపు అంశాలపై పాలక మండలి ఒక నివేదికను తయారు చేస్తుందన్నారు.

సుశీల్ అరెస్ట్ వద్దు: హైకోర్టు
రోహిత్ ఆత్మహత్య వ్యవహారంలో హెచ్‌సీయూ ఏబీవీపీ అధ్యక్షుడు సుశీల్‌కుమార్, కార్యదర్శి కృష్ణ చైతన్య, సుశీల్ బాబాయి దివాకర్‌లను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు సోమవారం పోలీసులను ఆదేశించింది. అయితే ఈ కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. రోహిత్ ఆత్మహత్యకు కారకులయ్యారంటూ పీహెచ్‌డీ విద్యార్థి ప్రశాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు...

వర్సిటీ వీసీ అప్పారావు, కేంద్ర మంత్రి దత్తాత్రేయలతో పాటు సుశీల్‌కుమార్, కృష్ణచైతన్య, దివాకర్‌లపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ సుశీల్‌కుమార్ తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. రోహిత్, ప్రశాంత్ తదితరులపై సుశీల్‌కుమార్ తొలుత పోలీసులకు ఫిర్యాదు చేశారని, దానికి కౌంటర్‌గానే సుశీల్ తదితరులపై ప్రశాంత్ ఫిర్యాదు చేశారని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి... పిటిషనర్లను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

విద్యార్థుల డిమాండ్లు..
హెచ్‌సీయూ వీసీ అప్పారావును పదవి నుంచి తొలగించాలి.

{పొఫెసర్ శ్రీవాస్తవను కూడా బాధ్యతల నుంచి తప్పించాలి.

రోహిత్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి హెచ్‌సీయూలో ఉద్యాగావకాశం ఇవ్వాలి.

పెండింగ్‌లో ఉన్న రోహిత్ స్కాలర్‌షిప్‌ను తక్షణమే విడుదల చేయాలి.

రోహిత్ స్మారకోపన్యాసాన్ని విశ్వవిద్యాలయమే అధికారికంగా నిర్వహించాలి.

రోహిత్‌తో పాటు సస్పెండ్ చేసిన నలుగురికి విశ్వవిద్యాలయం యాజమాన్యం బహిరంగ క్షమాపణ చెప్పాలి.ఉన్నత విశ్వవిద్యాలయాల్లో వివక్షను నిర్మూలించడం కోసం థోరట్ కమిటీ చేసిన సిఫార్సులను అన్ని విశ్వవిద్యాలయాల్లో అమలు చేయాలి.

ఉన్నత విద్యాలయాల్లో వివక్షను నివారించేందుకు రోహిత్ చట్టం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్‌సీయూ పాలక మండలి విజ్ఞప్తి చేయాలి.
అలోక్‌పాండేను తొలగించాలి. ప్రాక్టోరియల్‌బోర్డును పునర్‌వ్యవస్థీకరించాలి. వివక్షకు వ్యతిరేకంగా, విద్యార్థులకు సంఘీభావంగా అధికారిక పదవులకు ఎస్సీ, ఎస్టీ అధ్యాపకులు చేసిన రాజీనామాలను పాలక మండలి అంగీకరించవద్దు. వారిని యధావిధిగా కొనసాగించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement