హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన
♦ రోహిత్ ఎస్సీ కాదని చూపేందుకు యత్నిస్తున్న పోలీసులు
♦ గుంటూరు కార్పొరేషన్‌లో రోహిత్ అమ్మమ్మ సర్వీస్ రిజిస్టర్ మాయం
♦ పోలీసులకు పదవీ విరమణ
♦ ధ్రువీకరణ పత్రం మాత్రమే ఇచ్చిన అధికారులు
సాక్షి, గుంటూరు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం విదితమే. కేంద్ర మంత్రిపై కూడా కేసు నమోదు కావడంతో కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్ అసలు దళితుడు కాదని, వడ్డెర కులానికి చెందినవాడని చిత్రీకరించే కుట్ర జరుగుతోందని దళిత సంఘాల నాయకులు, ప్రతిపక్ష పార్టీలు ధ్వజమెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ అమ్మమ్మ, తాతయ్యల కులంపై పోలీసు అధికారులు విచారణ జరుపుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
గుంటూరులోని ప్రకాశంనగర్‌కు చెందిన బోణాల ముసలయ్య, చల్లా అంజనీదేవి అలియాస్ పాపాయమ్మ దంపతుల కుమార్తె రాధిక. అయితే వారిలో ఎవరైనా ఎస్సీకి చెందినవారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. వీరిరువురూ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు కావడంతో వీరు గతంలో పనిచేసిన కార్యాలయాలకు వెళ్లి ఆరా తీస్తున్నారు. రాధిక తండ్రి బోణాల ముసలయ్య ఇరిగేషన్ శాఖలో ఏఈఈగా పనిచేసి పదవీ విరమణ పొందారు. తల్లి చల్లా అంజనీదేవి గుంటూరు నగరపాలకసంస్థ పరిధిలోని జలగం రామారావు మున్సిపల్ హైస్కూల్‌లో ప్రధానోపాధ్యాయురాలిగా చేస్తూ 2001 జనవరి 31న పదవీ విరమణ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్ (ఎస్‌ఆర్)లో కులం పొందుపరిచి ఉంటుంది. వీటిని పరిశీలిస్తే అందులో వారి కులం వివరాలు తెలుసుకోవచ్చని భావించిన పోలీసు ఉన్నతాధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.
అంజనీదేవి సర్వీస్ రిజిస్టర్ మాయం
రాధిక తల్లి అంజనీదేవి కులం వివరాలు సేకరించేందుకు రెండ్రోజుల క్రితం పోలీసు అధికారులు నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చారు. రికార్డులు వెతికిన నగరపాలక సంస్థ అధికారులు అంజనీదేవి సర్వీస్ రిజిస్టర్ కనిపించడం లేదని చెప్పినట్లు తెలిసింది. అంజనీదేవి 2001 జనవరి 31న పదవీ విరమణ చేసినట్లు ధ్రువీకరణపత్రం మాత్రం పోలీసు అధికారులకు ఇచ్చి పంపారు. అందులో ఆమె కుల ప్రస్తావన లేదని అధికారులు చెబుతున్నారు. ఇదిలావుంటే అంజనీదేవి సర్వీస్ రిజిస్టర్ నిజంగా కనిపించడం లేదా... ఉన్నతస్థాయి ఒత్తిళ్ల నేపథ్యంలో మాయం చేశారా? అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు రాధిక తండ్రి బాణాల ముసలయ్య సర్వీస్ రిజిస్టర్‌ను సైతం అధికారులు బయటకు రానీయడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు రోహిత్ తల్లి రాధికది మాల కులమని మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ ఉద్ఘాటించారు. శుక్రవారం రాత్రి గుంటూరులో జరిగిన రోహిత్ సంతాప సభలో ఆయన మాట్లాడుతూ రోహిత్ తండ్రి వడ్డెర కులానికి చెందిన వాడైనా, తల్లి రాధిక దళితురాలు కావడంతో రోహిత్‌కు తల్లి కులం వచ్చిందని చెప్పారు.