బుచ్చయ్యా.. ఇదేం పద్ధతయ్యా! | Dalit leaders angry on TDP MLA Gorantla Butchaiah Chowdary | Sakshi
Sakshi News home page

బుచ్చయ్యా.. ఇదేం పద్ధతయ్యా!

Published Wed, May 16 2018 3:56 AM | Last Updated on Fri, Jul 12 2019 5:45 PM

Dalit leaders angry on TDP MLA Gorantla Butchaiah Chowdary  - Sakshi

రాజవోలులో అంబేడ్కర్‌ విగ్రహంపై చేయి ఆనించి మాట్లాడుతున్న ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి

రాజమహేంద్రవరం రూరల్‌: మనల్ని విడిచి వెళ్లిపోయిన మహనీయుల సేవలు ప్రతి నిత్యం మనకు గుర్తుండాలని వారి విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటాం. పేరుకు అది విగ్రహమే అయినా ఆ మహానుభావుల ప్రతిరూపాన్ని అందులో చూసుకుంటాం. వారి విగ్రహాల వద్దకు వెళ్లినప్పుడు నమస్కరించి పూలమాలలు వేసి, గౌరవాభిమానాలను చాటుకుంటాం. కానీ, తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం రూరల్‌ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి భిన్నంగా వ్యవహరించారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహంపై తన మోచేతిని ఆనించి ఫొటోలకు పోజులిచ్చారు.

రాజమహేంద్రవరం రూరల్‌ మండలం రాజవోలు గ్రామంలో సోమవారం జరిగిన టీడీపీ కార్యక్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఫొటో మంగళవారం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. విషయం తెలుసుకున్న పలువురు దళిత సంఘాల నాయకులు గోరంట్ల తీరును తప్పుపడుతున్నారు. వెనుకబడిన వర్గాలకు బీఆర్‌ అంబేడ్కర్‌ దైవంతో సమానమని పేర్కొంటూ.. అటువంటి మహనీయునిపట్ల టీడీపీ సీనియర్‌ నేత గోరంట్ల వ్యవహరించిన తీరుపై వారు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య తదితర నేతలు దళితులపై తమ మాటల్లో చులకన భావం చూపిస్తే.. గోరంట్ల అంబేడ్కర్‌ విగ్రహంపట్ల అవమానకరంగా వ్యవహరించి, తన నైజాన్ని బయట పెట్టుకున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నక్కా రాజబాబు అన్నారు. అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు ఏ స్థాయి నాయకుడు వచ్చినా వినయంతోనే వస్తారన్నారు. కానీ, గోరంట్ల మాత్రం తన దర్పాన్ని ప్రదర్శించే విధంగా వ్యవహరించారన్నారు. ఇందుకు ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలని రాజబాబు డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement