వీసీ, కేంద్ర మంత్రుల తీరుతోనే..
రోహిత్ ఆత్మహత్యపై రాహుల్‌గాంధీ ఫైర్
♦ వర్సిటీల్లో పక్షపాత ధోరణితో విద్యార్థుల జీవితాలు నాశనమవుతున్నాయి
♦ విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు వేదికలుగా మారుస్తున్నారు
♦ రోహిత్ కుటుంబానికి పరిహారం ఇవ్వాలి
♦ హెచ్‌సీయూలో రోహిత్ తల్లికి పరామర్శ.. విద్యార్థులతో సమావేశం
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ వైస్ చాన్స్‌లర్, కేంద్రమంత్రుల తీరుతోనే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. యూనివర్సిటీల్లో వివక్ష, పక్షపాత ధోరణి కారణంగా విద్యార్థుల జీవితాలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వ విద్యాలయాలను రాజకీయాలకు వేదికలుగా మారుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఏ అభిప్రాయం అయినా వ్యక్తపరిచే స్వేచ్ఛ విద్యార్థులకు ఉండాలన్నారు. వర్సిటీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడితే అతడి కుటుంబాన్ని పరామర్శించే నైతిక బాధ్యత వైస్ చాన్స్‌లర్‌కు లేదా ప్రశ్నించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి రోహిత్ తల్లి రాధికను మంగళవారం ఆయన వర్సిటీ ఆవరణలో పరామర్శించారు. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. రోహిత్ ఆత్మహత్యకు సంబంధించిన పరిణామాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
కాంగ్రెస్ నాయకుడిగా రాలేదు
ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్.. నేరుగా గచ్చిబౌలిలోని వర్సిటీకి వెళ్లారు. తొలుత రోహిత్ స్మారకస్తూపం వద్ద నివాళులర్పించారు. రోహిత్ తల్లి రాధిక, ఇతర కుటుంబ సభ్యులతోపాటు యూనివర్సిటీ నుంచి సస్పెన్షన్‌కు గురైన నలుగురు విద్యార్థులను పరామర్శించారు. దాదాపు 2 గంటల పాటు రాహుల్ వర్సిటీలోనే ఉన్నారు. చివర్లో ఆందోళన చేస్తున్న విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ... ఉన్నత విద్యాభ్యాసానికి నిలయాలైన విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు వేదికలుగా మార్చుకోవద్దని కోరారు.
దళిత విద్యార్థులపై కొనసాగుతున్న వివక్ష, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించి ఓ యువకుడిగానే ఇక్కడకు వచ్చినట్టు చెప్పారు. యూనివర్సిటీలో జరిగిన సంఘటనలపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుందని ప్రశ్నించారు. స్వయం ప్రతిపత్తి సంస్థలైన యూనివర్సిటీల్లో కేంద్ర మంత్రులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఈ ఘటనల్లో వర్సిటీ వైస్ చాన్స్‌లర్, కేంద్రమంత్రుల వ్యవహారం సరిగా లేదని, వారి తీరుతోనే రోహిత్ ఆత్మహత్య జరిగిందని దుయ్యబట్టారు. ఈ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రోహిత్ కుటుంబానికి పరిహారం ఇవ్వాలని, ఆయన కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని హామీనిచ్చారు.
ఏబీవీపీ నేతల అరెస్ట్
రాహుల్ పర్యటనను అడ్డుకునేందుకు బేగంపేటలో ఏబీవీపీ విద్యార్థులు ప్రయత్నించారు. రాహుల్, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బేగంపేట ఫ్లై ఓవర్ వద్ద రాహుల్ కాన్వాయ్‌కి అడ్డుపడేందుకు విద్యార్థి సంఘం నేతలు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకుని, అరెస్టు చేశారు.
సిట్టింగ్ జడ్జితోవిచారణ: పొంగులేటి
హెచ్‌సీయూలో సంఘటనలపై సమగ్ర విచారణ కోసం సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు జరిపించాలని శాసనమండలిలో కాంగ్రెస్ ఉప నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సంఘటనలో దోషులెవరైనా కఠినంగా శిక్షించాలని కోరారు.
పార్లమెంటులో ప్రస్తావిస్తా..
రోహిత్ ఆత్మహత్యకు కారణాలు, యూనివర్సిటీల్లోని సమస్యలను పార్లమెంటులో ప్రస్తావిస్తానని ఏఐసీసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ హామీనిచ్చారు. రోహిత్ తల్లి, సస్పెన్షన్‌కు గురైన విద్యార్థులతో సమావేశం అనంతరం రాహుల్ విద్యార్థులతో సుమారు అరగంటపాటు చర్చించారు. యాకూబ్ మెమన్ ఉరితీత సందర్భంగా యూనివర్సిటీలో చోటుచేసుకున్న సంఘటనలు, బీజేపీ నేతల జోక్యం, దళిత విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల నిలిపివేత, సస్పెన్షన్ వంటి చర్యలకు పాల్పడ్డారని విద్యార్థులు రాహుల్‌కు ఫిర్యాదు చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, పార్లమెంటులో వీటిని ప్రస్తావిస్తానని హామీనిచ్చారు.
మధ్యాహ్నం 12.30కు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ కు టీపీసీసీ నేతలు ఘనస్వాగతం పలికారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీనియర్ నేతలు కె.జానా రెడ్డి, షబ్బీర్ అలీ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, జె.గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, నేరెళ్ల శారద, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
కేంద్రానికి టీ సర్కారు నివేదిక
న్యూఢిల్లీ:హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పంపిన నివేదికను కేంద్రం అందుకుంది. రోహిత్ ఆత్మహత్యకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు చేపట్టిన విచారణ, తీసుకున్న చర్యలను వివరిస్తూ తెలంగాణ ప్రభుత్వం నివేదిక పంపిందని కేంద్ర హోం శాఖ అధికారి ఒకరు తెలిపారు.