మూడోరోజూ అట్టుడికిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
♦ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు
♦ తరలివచ్చిన వివిధ వర్సిటీలు, కాలేజీల విద్యార్థులు
♦ కేంద్రమంత్రి దత్తాత్రేయ, వీసీ రాజీనామా చేయాలంటూ నినాదాలు
♦ విచారణకు వచ్చిన ద్విసభ్య కమిటీని అడ్డుకున్న విద్యార్థులు
♦ పోలీసుల సాయంతో లోనికి వెళ్లిన కమిటీ సభ్యులు
♦ రోహిత్ తల్లిని పరామర్శించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ
♦ దత్తాత్రేయ ఇంటి ఎదుట తెలంగాణ జాగృతి కార్యకర్తల ఆందోళన
♦ వర్సిటీకి వచ్చిన బీజేపీ నేత ప్రకాశ్‌రెడ్డి.. కారు అద్దాలు ధ్వంసం చేసిన విద్యార్థులు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మూడోరోజూ దద్దరిల్లింది. రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్యపై విద్యార్థుల నిరసన జ్వాలలు మిన్నంటాయి. వైస్ చాన్స్‌లర్ అప్పారావు, కేంద్రమంత్రి దత్తాత్రేయ రాజీనామా చేయాలంటూ విద్యార్థులు నినదించారు. వివిధ విద్యార్థి సంఘాలతో ఏర్పడిన సామాజిక న్యాయ సాధన ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. విద్యార్థులు స్వచ్ఛందంగా తరగతులు బహిష్కరించారు. రోహిత్ తల్లి రాధికతోపాటు బోధన, బోధనేతర సిబ్బంది, వివిధ వర్సిటీలు, కాలేజీలకు చెందిన విద్యార్థులు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు.
ప్రజా సంఘాల కార్యకర్తలతో వివిధ పార్టీలకు చెందిన నేతలు విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. రోహిత్ ఆత్మహత్యకు దారి తీసిన ఘటనలపై విచారించేందుకు వచ్చిన ద్విసభ్య కమిటీని విద్యార్థులు క్యాంపస్ లోనికి అనుమతించలేదు. వైస్ చాన్స్‌లర్ రాజీనామా చేసిన తరువాతే రావాలంటూ ద్విసభ్య కమిటీని హెచ్చరించారు. కమిటీ సభ్యులు పోలీసుల సాయంతో క్యాంపస్ ఆవరణలోకి ప్రవేశించాల్సి వచ్చింది. ఇక సాయంత్రం యూనివర్సిటీకి వచ్చిన బీజేపీ నేత ప్రకాశ్‌రెడ్డి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అయినా లోనికి వచ్చేందుకు యత్నించడంతో ప్రకాశ్‌రెడ్డి కారు అద్దాలను పగులగొట్టారు.
ప్రముఖుల పరామర్శ..
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ యూనివర్సిటీకి వచ్చి రోహిత్ తల్లి రాధిక, ఇతర కుటుంబ సభ్యులు, ఆందోళన చేస్తున్న విద్యార్థులను పరామర్శించారు. ఆయన విశ్వవిద్యాలయంలో ఉన్నంతసేపు విద్యార్థులు బీజేపీకి వ్యతిరేకంగా నినదించారు. టీఆర్‌ఎస్ లోక్‌సభ సభ్యుడు విశ్వేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, విద్యావేత్త చుక్కా రామయ్య, సీనియర్ పాత్రికేయులు మల్లెపల్లి లక్ష్మయ్య, సీపీఐ ఫ్లోర్ లీడర్ రవీంద్రనాయక్, గుండా మల్లేశ్, పీవోడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి సంధ్య తదితరులు ఆందోళన చేస్తున్న విద్యార్థులను కలసి పరామర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉప్పల్ వెళ్లి రోహిత్ తల్లి రాధిక, సోదరుడిని పరామర్శించారు.
బుధవారం ఆయన హెచ్‌సీయూకు వెళ్లి విద్యార్థులకు సంఘీభావం తెలపనున్నారు. మరోవైపు తాజా పరిణామాలతో బీజేపీ ఇబ్బందిలో పడింది. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఈ ఘటన తమకు ఇబ్బంది తెచ్చిపెడుతుందేమోనని ఆ పార్టీ నేతలు ఆందోళనలో పడ్డారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి.. ఈ ఘటనతో కేంద్రమంత్రి దత్తాత్రేయకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. రోహిత్ ఆత్మహత్యకు దత్తాత్రేయ కారణమన్న ఆరోపణలను ఆయన ఖండించారు. విద్యార్థి సంఘం నేతలు ఇచ్చిన ఓ వినతిపత్రాన్ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీ దృష్టికి తీసుకువెళ్లారని, ఇది అత్యంత సహజంగా జరిగిన వ్యవహారమని చెప్పారు. గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొన్ని రాజకీయ పార్టీలు కావాలని బీజేపీపై దుష్ర్పచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
హెచ్‌ఆర్‌డీ లేఖలను లీక్ చేసిన వర్సిటీ అధికారులు
కేంద్రానికి ఐబీ నివేదిక
దళిత విద్యార్థులను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకునేందుకు వర్సిటీ ఉన్నతాధికారులు దత్తాత్రేయతోపాటు మానవ వనరుల శాఖ రాసిన లేఖలను విద్యార్థి సంఘాలకు లీక్ చేసినట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. రోహిత్ ఆత్మహత్య ఘటన నుంచి బయటపడేందుకు వర్సిటీ ఉన్నతాధికారులు ఇలా చేసి ఉంటారని నివేదికలో పేర్కొంది. మూడు రోజులుగా వర్సిటీలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయని ఐబీ తన నివేదికలో వివరించింది. గత ఆరు మాసాలుగా కల్లోల పరిస్థితులు ఉన్నా విశ్వవిద్యాలయ పాలకవర్గం తగిన రీతిలో వాటిని పరిష్కరించలేకపోయిందని ఐబీ కేంద్రం దృష్టికి తెచ్చింది. రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు తెలుసుకునేందుకు వచ్చిన హెచ్‌ఆర్‌డీ ఓఎస్డీ షకీలా శంషూ, ఆ శాఖ ఉప కార్యదర్శి సూరత్ సింగ్‌లతోనూ ఐబీ అధికారులు మంగళవారం సమావేశమయ్యారు. బుధవారం మరికొంత సమాచారం సేకరించి ద్విసభ్య కమిటీ హెచ్‌ఆర్‌డీ మంత్రి స్మృతి ఇరానీకి నివేదిక సమర్పించనుంది.
విద్యార్థుల ప్రధాన డిమాండ్‌లు
► రోహిత్ ఆత్మహత్యకు కారకులైన కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, వీసీ అప్పారావు, ఏబీవీపీ నేత సుశీల్‌కుమార్, బీజేవైఎం నేత విష్ణు, ఎమ్మెల్సీ రామచంద్రరావులపై చ ట్టపరమైన చర్యలు తీసుకోవాలి
► వీసీని వెంటనే విధుల నుంచి తొలగించాలి
► రోహిత్ కుటుంబానికి రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలి
► విద్యార్థులపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించాలి
► విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయాలి
వర్సిటీలో ఆగ్రహజ్వాలలు
Published Wed, Jan 20 2016 12:46 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement
Advertisement