మూడేళ్లు 'మోదీ ఫెస్ట్'
► ఈ నెల 26 నుంచి జూన్ 15 వరకు
► 900 నగరాల్లో బీజేపీ సంబరాలు
► ఎన్డీఏ పాలనకు మూడేళ్లు పూర్తి..
► సంక్షేమ పథకాల్ని విస్తృతంగా ప్రచారం చేసేలా ప్రణాళికలు
న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ మూడేళ్ల పాలన సంబరాల్ని అట్టహాసంగా నిర్వహించేం దుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి చొచ్చుకెళ్లేలా భారీ ప్రణా ళికలు రూపొందించింది. ఈ నెల 26 నుంచి జూన్ 15 వరకు దేశంలోని 900 నగరాల్లో ఎన్డీఏ సర్కారు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల్ని విస్తృతంగా ప్రచారం చేసేలా ‘మోదీ ఉత్సవం’(మోదీ ఫెస్ట్) నిర్వహించనుంది.
మే 26న అసోంలోని గువాహటిలో నిర్వహించే ‘మోదీ ఫెస్ట్’లో ప్రధాని మోదీ పాల్గొని ఉత్సవాల్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. అలాగే ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ‘సబ్‌కా సాత్.. సబ్‌కా వికాస్’ కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. మరోవైపు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు, సీనియర్ నేతలు ప్రజలతో నేరుగా సంభాషించేలా ప్రణాళికలూ రూపొందించారు.
కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతిఇరానీ ఆ వివరాల్ని వెల్లడిస్తూ.. ‘‘2014లో అధికారం చేపట్టిన నాటి నుంచి ఈ మూడేళ్లలో ప్రధాని మోదీ నేతృత్వంలో సాధించిన విజయాల్ని అందరికీ గుర్తుచేసేలా ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తాం. చర్చావేదికలు కూడా ఏర్పాటుచేస్తున్నాం. దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు, ముఖ్యమంత్రులు, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పాల్గొంటారు. అలాగే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘జన్‌కీ బాత్’ కార్యక్రమం ద్వారా ప్రజలు మోదీకి నేరుగా సందేశాలు పంపవచ్చ’ని చెప్పారు. వివిధ నగరాల్లో నిర్వహించే మేధో సదస్సుల్లో కేంద్ర మంత్రులు పాల్గొని ప్రజలతో నేరుగా మాట్లాడతారని పార్టీ సీనియర్ నేత అరుణ్‌సింగ్ తెలిపారు. ఉత్సవం జరిగే ప్రతి వేదిక వద్ద స్వచ్ఛభారత్ అభియాన్ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
కీలక నేతలు ఎక్కడెక్కడ...
అమిత్‌షా (బీజేపీ అధ్యక్షుడు): జూన్ 2, 3, 4 తేదీల్లో కేరళలో, జూన్ 6న అండమాన్‌లో, జూన్ 8– 10 వరకు ఛత్తీస్‌గఢ్‌లో, జూన్ 12, 13 తేదీల్లో అరుణాచల్‌ప్రదేశ్‌లో. రాజ్‌నాథ్‌సింగ్ (కేంద్ర హోంమంత్రి): జైపూర్, ముంబైల్లో మోదీ ఫెస్ట్‌కు హాజరవుతారు. సుష్మాస్వరాజ్(విదేశాంగ మంత్రి): ఢిల్లీ, లక్నో అరుణ్‌జైట్లీ(ఆర్థిక మంత్రి): బెంగళూరు, అహ్మదాబాద్ వెంకయ్యనాయుడు (పట్టణాభివృద్ధి మంత్రి): భువనేశ్వర్, ఛత్తీస్‌గఢ్ సురేశ్ ప్రభు (రైల్వే మంత్రి): పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్