దావణగెరె : ఎన్‌డీఏ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసిన సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం దావణగెరెలో నగరంలోని ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన వికాస పర్వ బీజేపీకి ఊపు ఇచ్చింది. నాయకులు, కార్యకర్తలకు ఈ కార్యక్రమం కొత్త ఉత్సాహాన్ని నింపింది. కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరై తాను గతంలో ఇచ్చిన వాగ్దానాలను ఎలా నెరవేర్చింది చెప్పిన సమయంలో అటు సభికులతోపాటు ఇటు శ్రేణుల్లో ఆనందం నింపింది. రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించడంతో నాయకులు కూడా సహకరించి విజయవంతం చేశారు. ప్రధాని మాట్లాడుతూ 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో తాను ఇదే దావణగెరెకు వచ్చానని, తన చేతికి కమలం ఇస్తే మీ చేతికి లక్ష్మిని ఇస్తానని వాగ్దానం చేశానని, ఆ ప్రకారం దావణగెరె నగరాన్ని స్మార్ట్ సిటీ పథకం కింద ఎంపిక చేసి నగరాభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులందించానన్నారు.
అదే విధంగా రైల్వే పథకాల అభివృద్ధికితోపాటు జనధన్, ముద్రా బ్యాంక్ తదితర పథకాలను జారీ చేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నానన్నారు. చెరుకు రైతులకు మధ్యవర్తుల ద్వారా కలుగుతున్న ఇబ్బందులను తప్పించేందుకు జన్‌ధన్ పథకం ఖాతాల ద్వారా రైతులకు చెరుకు పంట ప్రోత్సాహధనం జమ చేశామన్నారు. చెరుకు రైతులను ఇంకా ప్రోత్సహించే ఉద్దేశంతో చక్కెర, బెల్లంతో పాటు ఇథనాల్ ఉత్పత్తి చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. దేశంలో పండించే చెరుకు ద్వారా ఇథనాల్ ఉత్పత్తి చేస్తే దేశంలో 30 శాతం మేరకు వాహనాలకు ఇంధనం సమకూర్చవచ్చన్నారు. బిందు సేద్యం ద్వారా చెరుకు, వరి పండించేవారికి ప్రోత్సాహధనం అందించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. తన అధికారావధిలో చేపట్టిన స్వచ్ఛ భారత్ అభియాన్ అత్యంత ప్రజాదరణ పొందిందన్నారు. దేశం మారాలంటే అందరి భాగస్వామ్యం అత్యవసరం అన్నారు. ఈరోజుల్లో ఒక రూపాయికి టీ కూడా దొరకదని, అయితే ఇప్పుడు నెలకు ఒక రూపాయికి జీవన్ సురక్ష పథకం కింద బీమా కల్పిస్తున్నామన్నారు. దేశంలోని పేద ప్రజలకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఈ బీమా పథకం ప్రారంభించామన్నారు.
దేశంలో ఐదు కోట్ల మంది గృహిణులకు గ్యాస్ సబ్సిడీ కల్పించేందుకు పథకం రూపొందించామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప, కేంద్ర మంత్రులు అనంతకుమార్, సదానందగౌడ, జీఎం సిద్దేశ్వర్, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మురళీధర్‌రావ్, విధానసభ విపక్ష నేత జగదీష్ శెట్టర్, విధాన పరిషత్ విపక్ష నేత కేఎస్ ఈశ్వరప్ప, బీజేపీ సమన్వయ కార్యదర్శి అరుణ్ కుమార్, మాజీ మంత్రి ఎంపీ రేణుకాచార్య, మాజీ ఎమ్మెల్యేలు మాడాళ్ విరుపాక్షప్ప, బీపీ హరీష్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఏ.జీవనమూర్తి, యశవంతరావ్ జాధవ్ పాల్గొన్నారు.