పథకాలను వేగంగా అమలు చేయాలి
మంత్రిమండలి సమీక్షలో మోదీ పిలుపు
♦ వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, తదితర శాఖల పథకాలపై సమీక్ష
♦ పప్పుల ధరల పెరుగుదలపై ఆందోళన.. ఉత్పత్తి పెంపుపై మంతనాలు
న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వ అభివృద్ధి అజెండాను వేగంగా అమలు చేయాలని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. ఆయన బుధవారం మంత్రి మండలితో సమావేశమై.. ప్రస్తుత పథకాల పరిస్థితిపై సమగ్రంగా సమీక్షించారు. 3 గంటలకు పైగా కొనసాగిన భేటీలో.. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం - ప్రజాపంపిణీ, రసాయనాలు - ఎరువులు, జలవనరుల మంత్రిత్వశాఖల పరిధిలోని పథకాల అమలు ఎంతవరకూ వచ్చిందనే దానిపై సమీక్షించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని మోదీ ఉద్ఘాటించారని.. అన్ని అంశాల్లోనూ మంత్రులు మంచి పరిజ్ఞానం సంపాదించాలని.. తద్వారా వారు ప్రజలతో మాట్లాడేటపుడు ప్రభుత్వ విజయాలను ప్రముఖంగా చెప్పవచ్చని సూచించారని సమాచారం.
గంగా నదిని శుభ్రం చేసేందుకు ఇప్పటివరకూ ప్రారంభించిన పథకాలు సమర్థవంతమైన ఫలితాలనివ్వటంలో విఫలమయ్యాయంటూ.. పథకం విజయవంతం కావటంలో ప్రజలను మరింత ఎక్కువగా భాగస్వామ్యం చేసేలా వినూత్న ఆలోచనలు చేయాలనీ మోదీ సూచించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పప్పు ధాన్యాల ధరల పెరుగుదలపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారని.. దేశంలో పప్పుల ఉత్పత్తిని పెంచటం ఎలా అన్న అంశంపై దృష్టి కేంద్రీకరించారని వివరించాయి. పప్పుల ఉత్పత్తిని పెంచటానికి, తగినన్ని నిల్వలను ఉంచుకోవటానికి దీర్ఘకాలిక చర్యల గురించి మోదీ మాట్లాడినట్లు సమాచారం. అలాగే.. అక్రమ నిల్వలకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాల్సిన అవసరంపైనా ఉద్ఘాటించినట్లు చెప్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పైనా.. మరింత మెరుగుగా అమలు చేయటానికి వేతనాలను నేరుగా కూలీలకు విడుదల చేసే అంశంపైనా భేటీలో చర్చించారు. ప్రతి నెలా నాలుగో బుధవారం మంత్రిమండలి సమావేశమై..ఇతర శాఖల పథకాల అమలుపై సమీక్షించాలని నిర్ణయించారు.
‘ఎస్సీ అభివృద్ధి’ పెట్టుబడి పెంపు
జాతీయ షెడ్యూల్డు కులాల ఆర్థిక, అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ) అధీకృత పెట్టుబడి వాటాను మరో రూ. 200 కోట్ల మేర పెంచే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ పరిధిలో ఉంటుంది. మంత్రి మండలి భేటీకి ముందుకు మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో.. ప్రస్తుతం రూ. 1,000 కోట్లుగా ఉన్న ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ పెట్టుబడి వాటాను రూ. 1,200 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పేద ఎస్సీ లబ్ధిదారుల్లో రెట్టింపు మందికి ప్రయోజనం కలుగుతుందని కేంద్రం పేర్కొంది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి 63 వేలమందికి.. స్వయం ఉపాధి, ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలకు రాయితీ వడ్డీ రేట్లతో రుణాలు అందించటం ద్వారా లబ్ధిచేకూర్చటం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇప్పటికే 998.13 కోట్లు వ్యయం చేయటంతో నిధులను పెంచారు. కాగా, హైవే ప్రాజెక్టులను వేగవంతం చేయటానికి, ప్రభుత్వ - ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) పద్ధతిని పునరుద్ధరించేందుకు, ఈ రంగంలోకి మరిన్ని పెట్టుబడుల కోసం.. రోడ్ల నిర్మాణానికి మిశ్రమ వార్షిక చెల్లింపుల(హైబ్రీడ్ ఆన్యుటీ) విధానానికి కేంద్రం మోదం తెలిపింది. మోదీ అధ్యక్షతన భేటీ అయిన ఆర్థిక వ్యవహారాలపై మంత్రివర్గ సంఘం(సీసీఈఏ) ఈ కొత్త విధానానికి ఆమోదం తెలిపింది. ఈ పద్ధతి కింద.. ప్రాజెక్టు వ్యయంలో 40 శాతాన్ని పని ప్రారంభించటం కోసం డెవలపర్‌కు ప్రభుత్వం అందిస్తుంది.
17 కొత్త ఐఆర్‌బీ బెటాలియన్లు
జమ్మూకశ్మీర్‌తో పాటు నక్సల్ ప్రభావిత ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, మహారాష్ట్రల్లో కొత్తగా 17 ప్రత్యేక పోలీసు బెటాలియన్లన ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2015-16)లో కరువును ఎదుర్కోవడానికి 8 రాష్ట్రాలకు ఇంతవరకు రూ. 12 వేల కోట్ల నిధులను ఇచ్చామని వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ ఢిల్లీలో తెలిపారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితరాలు రూ. 38,667 కోట్ల సాయం కోరాయన్నారు.
మోదీపై ప్రజల విశ్వాసం ఇప్పుడు బలపడింది: బీజేపీ
న్యూఢిల్లీ: ప్రధానిమోదీ ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచీ.. ఆయనపై ప్రజల్లో విశ్వాసం మరింత బలపడిందని కేంద్రంలో అధికార బీజేపీ పేర్కొంది. ఎన్‌డీఏ ప్రభుత్వం సాధారణంకన్నా కొంత మెరుగుగా ఉందని, ప్రభుత్వం కన్నా మోదీకి అధిక ప్రజాదరణ ఉందని చెప్తున్న ఏబీపీ న్యూస్-నీల్సన్ సర్వేపై బీజేపీ బుధవారం పై విధంగా స్పందించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 46 శాతం మంది.. ఎన్‌డీఏ ప్రభుత్వం చాలా బాగుందనో బాగుందనో చెప్పారని.. అయితే ప్రధాని మోదీ పనితీరు చాలా బాగుందనో లేక బాగుందనో చెప్పిన వారు 54 శాతమేనని సర్వే చెప్తోంది. ‘విదేశీ వ్యవహారాలైనా, ఆర్థికవ్యవస్థైనా అన్ని రంగాల్లోనూ మోదీ ప్రభుత్వం విజయవంతం కావటంతో.. నరేంద్రమోదీపై 2014లో ప్రజలు చూపిన విశ్వాసం మరింత బలపడింది’ అని బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్‌శర్మ మీడియాతో పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు నిర్వహిస్తే.. ఎన్‌డీకు 38 శాతం ఓట్లు వస్తాయని.. అంటే 2014 మే ఎన్నికల్లో వచ్చిన 339 సీట్లు 301 సీట్లకు తగ్గుతాయని కూడా ఏబీపీ న్యూస్ - నీల్సన్ అభిప్రాయ సర్వే చెప్తోంది.