బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టి నాలుగు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన విషయాలపై స్పందించారు. అవకాశవాద రాజకీయాలలో భాగంగా ఎన్డీయే నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు బయటికి రావడాన్ని ప్రస్తావిస్తూ.. చంద్రబాబు తప్ప ఎన్డీయే నుంచి ఎవ్వరు బయటికి పోలేదని, ఆయన పోతే, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వచ్చారని అన్నారు. చంద్రబాబు ఎన్డీయే కూటమి విడడం వల్ల తమకు వచ్చిన నష్టం ఏం లేదన్నట్టు అమిత్ షా మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, చంద్రబాబు ఒకే వేదికపైకి వచ్చిన ఒరిగేదేమీ లేదన్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు, మమతలు హాజరైన విషయం తెలిసిందే. అలాగే గత నాలుగేళ్లుగా ఎన్డీయే ప్రభుత్వ పనితీరును ప్రస్తావిస్తూ.. జీడీపీ 7.4 శాతానికి పెరిగిందని, ధరల పెరుగుదలను అరికట్టామన్నారు. డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) ద్వారా రూ. 13 లక్షల కోట్లను అవినీతి పరుల జేబుల్లోకి వెళ్లకుండా నిరోధించామని తెలపారు. త్వరలో రూపే క్రెడిట్ కార్డును తెస్తున్నట్టు ప్రకటించారు. రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల విషయంలో పారదర్శకత కోసం బాండ్లు తీసుకోచ్చినట్టు తెలిపారు. మోదీని ప్రధాని పదవి నుంచి దింపడమే విపక్షాల లక్ష్యమైతే, పేదరికాన్ని నిర్మూలించడం తమ లక్ష్యం అనిస్పష్టం చేశారు. మీడియాను అణిచివేసిన వారే నేడు స్వేచ్ఛ గురించి మాట్లాడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికే చాలా హామిలను నెరవేర్చామని, ఈ ఏడాదిలో మరిన్ని నెరవేర్చి, మళ్లీ అధికారంలోకి వస్తామని అన్నారు.
దక్షిణాదిన విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. కర్ణాటకలో అధిక సీట్లు గెలవడం మాములు విషయం కాదన్నారు. కర్ణాటకలో బీజేపీకి 104 సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌తో యుద్ధం చివరి అవకాశం మాత్రమే అన్నారు. పెట్రోల్ ధరల పెరుగుదలపై స్పందిస్తూ.. కాంగ్రెస్ పాలనలో మూడేళ్లు పెరిగాయని, ఇప్పుడు మూడు రోజులకే ఎందుకు పరేషాన్ అవుతున్నారని ప్రశ్నించారు. త్వరలోనే వాటిని తగ్గించే ఫార్ములా తెస్తామని పేర్కొన్నారు.
గతంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ గెలిస్తే తానే ప్రధాని అవుతానన్న ప్రకటనను ప్రస్తవిస్తూ.. రాహుల్ ప్రధాని అవుతానన్న ప్రకటనను కాంగ్రెస్ నేతలు స్వాగతించలేదని, పవార్, మమత దానిపై స్పందించలేదని అన్నారు. ప్రధానిమంత్రి గౌరవాన్ని కాంగ్రెస్ పాతాళంలోకి తీసుకెళ్లిందని విమర్శించారు. క్యాబినెట్ నిర్ణయాలను చించేసిన ఘటన కాంగ్రెస్ హాయంలోనే జరిగిందన్నారు. రిజర్వేషన్లు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. మోదీయే మళ్లీ ప్రధాని అవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాయకుడ్ని దేశానికి అందించిన ఘనత భారతీయ జనతా పార్టీదే అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ‘మోదీ ప్రభుత్వం రాకతో దేశంలో పరివర్తన వచ్చింది. అవినీతి రహిత, నిర్ణయాత్మక ప్రభుత్వాన్ని అందించాం. ఇది కిసాన్, గ్రామీణ ప్రభుత్వం పటిష్ఠమైన విదేశాంగ విధానాన్ని అవలంభిస్తున్నాం. గతంలో కుంభకోణాల వార్తలుంటే, ఇప్పుడు అభివృద్ధి వార్తలే కనిపిస్తున్నాయి. దేశంలో 70శాతం భూభాగంలో బీజేపీ, ఎన్డీయే రాష్ట్ర ప్రభుత్వాలున్నాయి.’ అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రోజులో 15 నుంచి 18 గంటలు పని చేస్తారని అమిత్ షా తెలిపారు. అలాంటి నాయకుడ్ని దేశానికి అందించినందుకు బీజేపీ చాలా గర్వపడుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మోదీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్న రోజును ‘నమ్మక ద్రోహ దినం’గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment