మోదీ సర్కారు కనిపిస్తోంది..
విధాన పక్షవాతం నుంచి దేశాన్ని బయటకుతెచ్చింది: అమిత్‌షా
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం.. గత ప్రభుత్వం తరహాలో కాకుండా అందరికీ కనిపిస్తోందని, క్రియాశీలంగా పనిచేస్తోందని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా పేర్కొన్నారు. దేశాన్ని విధాన పక్షవాతం నుంచి బయటకు తెచ్చిందన్నారు. మోదీ సర్కారు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బహిరంగ సభలు, సమావేశాలు, విలేకరుల సమావేశాల్లో మాట్లాడారు. అమిత్‌షా మంగళవారం ఢిల్లీలో, తర్వాత హరియాణాలోని కర్నాల్‌లో ప్రసంగించారు.
మోదీ ‘టీమ్ ఇండియా’ ద్వారా దేశాన్ని పురోగతి దిశగా తీసుకెళుతున్నారని కీర్తించారు. ప్రధానమంత్రి కార్యాలయం విశ్వసనీయతను మోదీ పునరుద్ధరించారని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ గుజరాత్‌లోని కర్నాలిలో జరిగిన సభలో పేర్కొన్నారు. బిహార్‌లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కారీ.. ఆ రాష్ట్రానికి భారీ నజరానా ప్రకటించారు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి రూ. 50 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు పట్నాలో ప్రకటించారు. యూపీలోని అమేథీ ఇప్పుడు అభివృద్ధిని చూస్తుందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాయ్‌బరేలీలో అన్నారు.