రూ. 950 కోట్ల గడ్డి స్కాంలో సీబీఐ కోర్టు తీర్పు
జైలుకు తరలింపు.. 3న శిక్ష ఖరారు
తక్షణం లోక్‌సభ సభ్యత్వం రద్దు!
దోషుల్లో జేడీ(యూ) ఎంపీ జగదీశ్ శర్మ
ఆయన లోక్‌సభ సభ్యత్వంపైనా కత్తి
మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా సహా 45 మంది దోషులే
ఐఏఎస్ ఆర్ముగంతోపాటు ఎనిమిది మందికి శిక్షలు ఖరారు
దాణా కుంభకోణంగా పేరొందిన 1996 నాటి పశు సంవర్ధక శాఖ కుంభకోణం లాలూ రాజకీయ జీవితాన్ని అతలాకుతలం చేసింది. ఆ సమయంలో బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన దీని దెబ్బకు 1997లో పదవిని కోల్పోయారు. అయితే తన భార్య రబ్రీదేవిని సీఎం పీఠంపై కూర్చోబెట్టి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. దాణా కేసులో మొత్తం 56 మంది నిందితులుండగా వారిలో ఏడుగురు విచారణ సందర్భంగా మరణించారు. ఇద్దరు అప్రూవర్లుగా మారారు. మరొకరు నేరాన్ని అంగీకరించగా ఇంకొకరిని కోర్టు విడిచిపెట్టింది.
రాంచీ/కోయంబత్తూరు: బీహార్ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్(65)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లాలూ రాజకీయ జీవితంలో పెను మచ్చగా మిగిలిన 17 ఏళ్ల నాటి దాణా కుంభకోణంలో ఆయన దోషేనని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం ప్రకటించింది. దాంతో ఆయన లోక్‌సభ సభ్యత్వానికి కూడా ఎసరొచ్చింది. రూ.950 కోట్ల దాణా కుంభకోణంలో లాలూతో పాటు మరో 44 మంది నిందితులను కూడా ఐపీసీ సెక్షన్లు 120బి (నేరపూరిత కుట్ర), 420 (మోసం), 467 (ఫోర్జరీ), 468, 477ఎ లతో పాటు అవినీతి నిరోధక చట్టం (1988) కింద కూడా దోషులుగా కోర్టు నిర్ధారించింది.
జేడీ(యూ) ఎంపీ జగదీశ్ శర్మ, బీహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రాతో పాటు మరో ఐదుగురు రాజకీయ నాయకులు, నలుగురు ఐఏఎస్ అధికారులు మహేశ్‌ప్రసాద్, పూల్‌చంద్ సింగ్; బెక్ జులెస్, కె.ఆర్ముగం, ఆదాయ పన్ను అధికారి ఏసీ చౌదరి, పశుసంవర్ధక శాఖ అధికారులు తదితరులు వీరిలో ఉన్నారు. పశు సంవర్ధక శాఖకు సంబంధించిన రూ.37.7 కోట్లను చైబాసా జిల్లా బొక్కసం నుంచి అక్రమంగా డ్రా చేశారంటూ వీరిపై నమోదైన అభియోగాలను సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ప్రవాస్‌కుమార్ సింగ్ ధ్రువీకరించారు. దోషులుగా పేర్కొన్న వారిలో పశు సంవర్ధక శాఖ మాజీ కార్యదర్శి అయిన ఐఏఎస్ అధికారి అర్ముగం, బీహార్ మాజీ పశు సంవర్ధక, కార్మిక మంత్రి విద్యాసాగర్ నిషాద్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే ధ్రువ్ భగత్, ఐదుగురు దాణా సరఫరాదారులు మధు మెహతా, బిమలా శర్మ, ఎస్‌కే సిన్హా, శివ్‌కుమారి, రాజేశ్ వర్మలకు శిక్షను సోమవారమే ఆయన ఖరారు చేశారు. వారందరికీ మూడేళ్ల దాకా కఠిన కారాగార శిక్షతో పాటు రూ.50 వేల నుంచి రూ.5 లక్షల దాకా జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. అయితే తీర్పు అనంతరం వారందరికీ బెయిల్ కూడా మంజూరు చేశారు. లాలూ సహా మిగతా 37 మందికి అక్టోబర్ 3న శిక్షను ఖరారు చేయనున్నారు.
పదవికీ ఎసరు!
లోక్‌సభ సభ్యులైన లాలూ (సరన్), జగదీశ్ శర్మల పదవి తీర్పు నేపథ్యంలో ప్రమాదంలో పడింది. రెండేళ్లకు పైబడి శిక్ష పడితే వారి సభ్యత్వం తక్షణం రద్దవుతుంది. అంతేగాక కనీసం ఆరేళ్లపాటు ఎన్నికల బరిలో దిగడానికీ వీలుండదు. ఎందుకంటే రెండేళ్లు, లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడ్డ ఎంపీలు, ఎమ్మెల్యేలు తీర్పుపై స్టే తెచ్చుకుంటే వారి సభ్యత్వం రద్దు కాబోదన్న ప్రజాప్రాతినిధ్య చట్ట నిబంధనను గత ఆగస్టులో సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ చరిత్రాత్మక తీర్పును నిర్వీర్యం చేసేందుకు యూపీఏ సర్కారు ప్రతిపాదించిన ఆర్డినెన్‌స అర్థరహితమంటూ రాహుల్‌గాంధీ కూడా తాజాగా తూర్పారబట్టడంతో దాని కథ కంచికి చేరినట్టేనని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో లాలూ, శర్మల లోక్‌సభ సభ్యత్వం రద్దుపై కోర్టు తీర్పును పరిశీలించాక నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ మీరాకుమార్ కోయంబత్తూరులో చెప్పారు.
ముభావంగా లాలూ: కోర్టు తీర్పు వెలువడగానే లాలూను రాంచీ శివార్లలోని బిర్సా ముండా కేంద్ర కారాగారానికి తరలించారు. ఆ సందర్భంగా కోర్టు బయట తనను చుట్టుముట్టిన విలేకరులతో మాట్లాడేందుకు లాలూ నిరాకరించారు. అంతకుముందు కోర్టుకు వెళ్లే ముందు రాంచీలోని దుర్గా ఆలయంలో పూజలు జరిపారు. అనంతరం పెద్ద కొడుకు తేజస్వితో కలిసి కోర్టుకు హాజరయ్యారు. కోర్టు హాల్లో రెండో వరుసలో కూర్చున్న లాలూ, తీర్పు సందర్భంగా మౌనంగా కన్పించారు. పాట్నాలోని రబ్రీ నివాసంలో కూడా తీర్పు తర్వాత విషాద వాతావరణం నెలకొంది. మీడియాతో పాటు ఎవరినీ లోనికి అనుమతించలేదు. ఈ తీర్పును ఆర్జేడీకి అతి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. దీన్ని హైకోర్టులో సవాలు చేస్తామని ఆర్జేడీ ప్రకటించింది. లాలూ గైర్హాజరీలో పార్టీని ఆయన భార్య, బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవి, కుమారుడు తేజస్వి యాదవ్ నడిపిస్తారని పేర్కొంది.
దాణా కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ దోషే : సీబీఐ కోర్టు
Published Tue, Oct 1 2013 2:51 AM | Last Updated on Fri, Sep 1 2017 11:12 PM
Advertisement