fodder scandal
-
లాలూకు మరో 14 ఏళ్ల జైలు
రాంచీ: దాణా కుంభకోణం కేసులు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను వెంటాడుతూనే ఉన్నాయి. 1990ల్లో దుమ్కా ఖజానా నుంచి అక్రమంగా రూ.3.13 కోట్లు తీసుకున్న కేసులో శనివారం రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు లాలూకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతోపాటుగా రూ.60 లక్షల జరిమానా విధించింది. ఐపీసీతో పాటుగా అవినీతి నిరోధక చట్టం కింద 2 వేర్వేరు కేసుల్లో ఏడేళ్ల చొప్పున జైలు శిక్షను సీబీఐ జడ్జి శివ్‌పాల్ ప్రకటించారు. ఈ రెండు శిక్షలు ఒకదాని తర్వాత మరొకటి అమలు చేయాలని ఆదేశించారు. ఈ తీర్పును ఉన్నతన్యాయస్థానంలో అప్పీల్ చేయనున్నట్లు లాలూ తరపు న్యాయవాది తెలిపారు. దియోగఢ్ ఖజానానుంచి అక్రమంగా డబ్బులు తీసుకున్నారనే కేసులో డిసెంబర్ నుంచి రాంచీలోని బిర్సాముండా జైలులో లాలూ శిక్షననుభవిస్తున్నారు. 420 సహా పలు సెక్షన్ల కింద.. ‘భారతీయ శిక్షాస్మృతిలోని 420 (మోసం), 409 (ప్రజాప్రతినిధిగా విశ్వాసద్రోహం), 467 (విలువైన పత్రాల ఫోర్జరీ), 471 (ఫోర్జరీ పత్రాలను వినియోగించటం), 477 (విలువైన పత్రాలను అక్రమంగా రద్దుచేయటం), 120బీ (నేరపూరిత కుట్రలకు శిక్ష) సెక్షన్ల కింద 7ఏళ్ల శిక్షతోపాటు రూ.30లక్షల జరిమానా విధించారు. అవినీతి నిరోధక చట్టం ప్రకారం మరో ఏడేళ్ల జైలు, రూ.30 లక్షల జరిమానా విధించారు’ అని సీబీఐ తరపు న్యాయవాది విష్ణుశర్మ పేర్కొన్నారు. జరిమానా చెల్లించని పక్షంలో మరికొన్నేళ్లు జైల్లో ఉండాల్సి వస్తుందన్నారు. ఈ కేసులో మరో 18 మంది దోషులకూ న్యాయమూర్తి శిక్షలను ఖరారు చేశారు. పశుసంవర్ధక శాఖ మాజీ ప్రాంతీయ సంచాలకుడు ఓపీ దివాకర్‌కు కూడా లాలూతో సమానమైన శిక్షనే విధించారు. మాజీ ఐఏఎస్ అధికారి ఫూల్‌చంద్ సింగ్ సహా తొమ్మిది మంది అధికారులకు ఏడేళ్ల జైలు, రూ. 30 లక్షల జరిమానా చెల్లించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఏడుగురు దాణా సరఫరాదారులకు మూడున్నరేళ్ల జైలు, రూ.15లక్షల జరిమానాను ఖరారు చేశారు. దాణా కుంభకోణానికి సంబంధించిన ఐదు కేసుల్లో లాలూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత వారం ఛాతీనొప్పి కారణంగా ప్రస్తుతం లాలూ రాంచీలోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆర్జేడీ, బీజేపీ మాటల యుద్ధం తాజా కోర్టు తీర్పు నేపథ్యంలో బీజేపీపై ఆర్జేడీ తీవ్రంగా మండిపడింది. బీజేపీ రాజకీయ కుట్ర కారణంగానే ఈ కేసులన్నీ నమోదయ్యాయని ఆరోపించింది. అటు బిహార్ అసెంబ్లీలో లాలూ చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్ ‘బీజేపీ నుంచి లాలూ ప్రసాద్ ప్రాణాలకు ముప్పు ఉంది. ఆయన అమాయకుడు. ఉన్నత న్యాయస్థానంలో మాకు అనుకూలంగా తీర్పు వస్తుంది’ అని పేర్కొన్నారు. కాగా ఆర్జేడీ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ‘చట్టం తనపని తాను చేసుకుపోతోంది. దాణా కుంభకోణంలో ఇదేమీ మొదటి కేసు కాదు. లాలూ ప్రాణాలకు ముప్పుందనటం అవాస్తవం. ఆయనకు జైల్లో సంపూర్ణమైన భద్రతను ఏర్పాటుచేశాం’ అని బిహార్ డిప్యూటీ సీఎం, దాణా స్కాం పిటిషనర్లలో ఒకరైన సుశీల్ మోదీ పేర్కొన్నారు. -
వాళ్లతో ఉంటే.. మా నాన్న సత్య హరిశ్చంద్రుడే!
సాక్షి, రాంచీ : దాణా కుంభకోణం.. సీబీఐ కోర్టు తీర్పుపై బీహాన్ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జైలుకు పంపించి.. లాలూ ప్రసాద్ యాదవ్‌ను రాజకీయంగా సమాధి చేశామని అనుకుంటే.. అది వారి మూర్ఖత్వమేనని తేజస్వి యాదవ్ అన్నారు. తప్పుడు ఆలోచనలు చేస్తున్న బీజేపీ, ఇతర పార్టీలు తగిన మూల్యం చెల్లించుకుంటాయని ఆయన అన్నారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా సహా మరికొందరిని సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. సీబీఐ కోర్టు తీర్పు వెలువడిన రెండు రోజుల అనంతరం.. తేజస్వి యాదవ్ స్పందించడం గమనార్హం. లాలూ ప్రసాద్ యాదవ్‌ను జైలుకు పంపిస్తే.. ఆయన పని అయిపోతుందని బీజేపీ, ఇతర పార్టీలు అనుకోవడం మూర్ఖత్వానికి నిదర్శనం అని ఆయన చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవేళ లాలూప్రసాద్ యాదవ్ బీజేపీతో కలిసుంటే.. వారికి మా నాన్న రాజా హరిశ్చంద్రుడిలా కనిపించేవారని అన్నారు. సీబీఐ కోర్టు తీర్పులో కుట్ర దాగుందని అయన అనుమానాం వ్యక్తం చేశారు. ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. హైకోర్టులో తగిన న్యాయం జరుగుతుందనే ఆశాభావాన్ని తేజస్వి యాదవ్ వ్యక్తం చేశారు. -
దాణా కుంభకోణంలో లాలూకు ఐదేళ్ల జైలు
దాణా కుంభకోణంలో శిక్షలు ఖరారు చేసిన సీబీఐ కోర్టు రాంచీ/పాట్నా: దాణా కుంభకోణంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 25 లక్షల జరిమానా విధించింది. ఇదే కేసులో దోషిగా తేలిన బీహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రాకు కూడా కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ. 2 లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ప్రవాస్ కుమార్ సింగ్ గురువారం తీర్పు వెలువరించారు. 17 ఏళ్లనాటి ఈ కేసులో లాలూప్రసాద్, జగన్నాథ్ మిశ్రా, జేడీ(యూ) ఎంపీ జగదీశ్ శర్మ, మరో ఐదుగురు రాజకీయ నాయకులు, నలుగురు ఐఏఎస్ అధికారులతోపాటు మొత్తం 45 మందిని సెప్టెంబర్ 30న న్యాయస్థానం దోషులుగా తేల్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరంతా బిర్సా ముండాలోని సెంట్రల్ జైల్లో ఉన్నారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణ చేపట్టింది. తాను అమాయకుడినని, తనకేమీ తెలియదని ఈ సందర్భంగా న్యాయమూర్తికి లాలూ విన్నవించారు. అయితే అవినీతికి పాల్పడ్డట్టు పక్కా ఆధారాలు ఉండడంతో శిక్ష ఖరారు చేస్తూ కోర్టు 475 పేజీలతో కూడిన తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో లాలూ.. ఎంపీ పదవికి అనర్హుడు కావడంతోపాటు 11 ఏళ్లపాటు ఎన్నికలకు దూరంగా ఉండాల్సి రావొచ్చు. ఇది లోక్‌సభ ఎన్నికల ముందు ఆర్జేడీకి శరాఘాతం కానుంది. తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామని ఆ పార్టీ అధికార ప్రతినిధి మనోజ్ ఝా తెలిపారు. ఎవరెవరికీ ఏయే శిక్ష.. ఈ కేసులోని మొత్తం 45 మంది నిందితుల్లో ఎనిమిది మందికి సెప్టెంబర్ 30నే కోర్టు శిక్షలు ఖరారు చేసింది. లాలూ సహా మిగతా 37 మంది దోషులకు తాజాగా శిక్షలు విధించింది. శిక్షలు పడ్డ రాజకీయ నేతల్లో లాలూ ప్రసాద్ యాదవ్(ఐదేళ్ల కఠిన జైలు శిక్ష, రూ.25 లక్షల జరిమానా), మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా(నాలుగేళ్ల జైలు, రూ.2లక్షల జరిమానా), జేడీయూ ఎంపీ జగదీష్ శర్మ(నాలుగేళ్ల జైలు, రూ.5 లక్షల జరిమానా), ఆర్జేడీ మాజీ ఎమ్మెల్యే ఆర్కే రాణా(ఐదేళ్ల జైలు, రూ.30 లక్షల జరిమానా) ఉన్నారు. ఇక అధికారుల విషయానికి వస్తే.. ముగ్గురు ఐఏఎస్ అధికారులు మహేశ్‌ప్రసాద్, పూల్‌చంద్ సింగ్; బెక్ జులెస్లకు నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.2 లక్షల జరిమానా విధించింది. దోషులందరికీ ఐపీసీ సెక్షన్లు 120 బి (నేరపూరిత కుట్ర), 420 (మోసం), 467 (ఫోర్జరీ), 468, 477ఎ లతో పాటు అవినీతి నిరోధక చట్టం (1988) కింద శిక్షలు విధించినట్లు కోర్టు తెలిపింది. దోచుకునేందుకు అంతా కుమ్మక్కయ్యారు.. దాణా కుంభకోణం కేసులో ప్రభుత్వ ఖజానా కొల్లగొట్టేందుకు రాజకీయ నేతలు, ప్రభుత్వాధికారులు కుమ్మక్కయ్యారని సీబీఐ కోర్టు వ్యాఖ్యానించింది. మోసపూరితంగా నిధులను డ్రా చేసేందుకు అనేక డాక్యుమెంట్లను ఫోర్జరీ చేశారని, నకిలీ బిల్లులు సృష్టించారని, రహస్య అజెండాతో కుట్రపూరితంగా వ్యవహరించారని పేర్కొంది. ‘‘దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడని మనం విన్నాం. అయితే ఇప్పుడు దేవుడు స్థానాన్ని అవినీతి ఆక్రమిస్తోంది. సమాజానికి సవాలుగా మారుతోంది’’ అని న్యాయమూర్తి అన్నారు. 2జీ, కామన్వెల్త్, కోల్గేట్, రైల్‌గేట్, ఐపీఎల్ ఫిక్సింగ్ తదితర స్కాంలతో పోల్చుకుంటే ఈ కేసు చిన్నదేనని దోషుల తరఫు న్యాయవాదులు వాదించారని, అయితే ఈ తరహా కుంభకోణాల్లో దాణా స్కాం మొట్టమొదటిద న్న సంగతిని విస్మరించరాదని ఆయన పేర్కొన్నారు. ఇదంతా రాజకీయ కుట్ర: ఆర్జేడీ తమ అధినేత లాలూప్రసాద్ యాదవ్‌కు శిక్ష పడడం వెనుక బీజేపీ, జేడీ(యూ)ల రాజకీయ కుట్ర దాగుందని ఆర్జేడీ ఆరోపించింది. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, బీజేపీలు కుట్రపూరితంగా లాలూను ఇరికించాయని దుయ్యబట్టింది. త్వరలోనే బెయిల్‌పై విడుదలవుతారని, పార్టీ అధినేతగా ఆయనే కొనసాగుతారని పార్టీ నేత రామ్‌కృపాల్ చెప్పారు. పార్టీ నాయకత్వంలో ఎలాంటి మార్పు ఉండబోదని మరో నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్ స్పష్టంచేశారు. అయినా హీరోనే..: రబ్రీదేవీ లాలూప్రసాద్ ఇన్నాళ్లూ హీరోగా ఉన్నారని, ఇకముందు కూడా హీరోగానే ఉంటారని ఆయన భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవీ అన్నారు. భర్తకు శిక్ష ఖరారు నేపథ్యంలో ఆమె రోజంతా తన అధికార నివాసానికే పరిమితమై టీవీకి అతుక్కుపోయారు. ఐదేళ్ల శిక్ష ఖరారు తర్వాత ఆమె నివాసం నుంచి బయటకు వచ్చిన ఆర్జేడీ ప్రధాన కార్యదర్శి రామ్‌కృపాల్ యాదవ్ విలేకరులతో మాట్లాడారు. కోర్టు తీర్పుతో లాలూ కుటుంబం కుంగిపోలేదని, లాలూ ఇకముందు కూడా హీరోగానే ఉంటారని రబ్రీదేవీ అన్నట్లు చెప్పారు. ఇదీ లాలూ ప్రస్థానం.. లాలూ ప్రసాద్ ఇప్పుడు దేశవ్యాప్తంగా తెలిసిన ఓ పెద్ద రాజకీయ నాయకుడు కావచ్చుగానీ.. ఆయన రాజకీయాల్లోకి రాకముందు ఒక సాధారణ గుమాస్తా. ఆయన తండ్రి పాలు విక్రయించేవారు. లాలూ 1948 జూన్ 11న బీహార్‌లోని యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓ సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. పాట్నా యూనివర్సిటీలో విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో పాల్గొనడంతో ఆయనకు రాజకీయాలపై ఆసక్తి మొదలైంది. లాలూ తొలిసారి 29వ ఏట లోక్‌సభకు ఎన్నికయ్యారు. అక్కడితో ఆయన దశ తిరిగింది. నాడు ఆరో లోక్‌సభలో అడుగుపెట్టిన పిన్న వయస్కుల్లో ఆయన కూడా ఒకరు. పదేళ్లలో ప్రసాద్ చాలా వేగంగా రాజకీయాల్లో ఉన్నతస్థాయికి ఎదిగారు. బీహార్‌లో రాజకీయంగా పాతుకుపోయారు. తొలిసారి 1990లో ముఖ్యమంత్రి అయ్యారు. రెండోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాక ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. 1996లో దాణా కుంభకోణం ఆరోపణలు రావడంతో వేరే దారి లేక లాలూ.. 1997లో తన పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే అందరినీ ఆశ్చర్యపరుస్తూ తన భార్య, తొమ్మిది మంది పిల్లల తల్లి రబ్రీదేవిని సీఎం చేశారు. రబ్రీదేవీ నిరక్షరాస్యురాలు కావడం, దాంతోపాటు రాజకీయాలకు ఆమె కొత్త కావడంతో విమర్శకులు ఆమెను ‘రబ్బర్ దేవీ’ అంటూ విమర్శించేవారు. లాలూ తరఫున రబ్బర్ స్టాంప్‌గా ఆమె పనిచేస్తోందని అనేవారు. దాణా కుంభకోణానికి సంబంధించి లాలుపై ఒత్తిడి పెరగడంతో ఆయన 1997లో జనతా దళ్‌ను వీడి.. రాష్ట్రీయ జనతా దళ్ ఏర్పాటు చేశారు. 15 ఏళ్లపాటు బీహార్‌ను ఏలిన లాలూ రాజకీయ జీవితం 2005 నుంచి పతనం దిశగా సాగింది. అయితే ఈ పదిహేనేళ్లలో లాలు హవా ఎంతలా సాగిందంటే.. ఆయన పేరుతో మార్కెట్లోకి బొమ్మలు కూడా వచ్చేశాయి. లాలూ హయాంలో రాష్ట్రంలో బీహార్ ప్రజల జీవితాల్లో పెద్దగా మార్పు కనిపించకపోవడంతో 2005 ఎన్నికల్లో లాలూ ఓడిపోయారు. అప్పటిదాకా ముస్లింలు, యాదవులు ఆయనకు నిరంతరం అండగా నిలిచేవారు. 2004లో ఆయనకు రైల్వే మంత్రి పదవి దక్కింది. అప్పటిదాకా నష్టాల్లో ఉన్న రైల్వేను ఆయన లాభాల్లోకి తెచ్చి చూపించారు. దీంతో లాలూ పేరు మార్మోగిపోయింది. దీని గురించి ప్రముఖ బిజినెస్ స్కూళ్లలో కూడా బోధించే స్థాయికి ఆయన ఎదిగిపోయారు. జోక్‌లు, పంచ్‌లకు లాలూ పెట్టింది పేరు. బడ్జెట్ ప్రసంగాల్లోగాని, మీడియాతో మాట్లాడేటప్పుడుగాని లాలూ వేసే జోకులు, విసిరే పంచ్‌లకు అందరూ పడిపడి నవ్వేవారు. కేంద్ర స్థాయిలో యూపీఏలో లాలూ బాగా పేరు సంపాదించినా రాష్ట్రంలో ఆయన రాజకీయంగా బాగా దెబ్బతిన్నారు. దానికి తోడు దాణా కుంభకోణం 17 ఏళ్లపాటు వెంటాడి.. ఆయన్ను కటకటాల్లోకి నెట్టింది. -
దాణా కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ దోషే : సీబీఐ కోర్టు
రూ. 950 కోట్ల గడ్డి స్కాంలో సీబీఐ కోర్టు తీర్పు జైలుకు తరలింపు.. 3న శిక్ష ఖరారు తక్షణం లోక్‌సభ సభ్యత్వం రద్దు! దోషుల్లో జేడీ(యూ) ఎంపీ జగదీశ్ శర్మ ఆయన లోక్‌సభ సభ్యత్వంపైనా కత్తి మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా సహా 45 మంది దోషులే ఐఏఎస్ ఆర్ముగంతోపాటు ఎనిమిది మందికి శిక్షలు ఖరారు దాణా కుంభకోణంగా పేరొందిన 1996 నాటి పశు సంవర్ధక శాఖ కుంభకోణం లాలూ రాజకీయ జీవితాన్ని అతలాకుతలం చేసింది. ఆ సమయంలో బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన దీని దెబ్బకు 1997లో పదవిని కోల్పోయారు. అయితే తన భార్య రబ్రీదేవిని సీఎం పీఠంపై కూర్చోబెట్టి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. దాణా కేసులో మొత్తం 56 మంది నిందితులుండగా వారిలో ఏడుగురు విచారణ సందర్భంగా మరణించారు. ఇద్దరు అప్రూవర్లుగా మారారు. మరొకరు నేరాన్ని అంగీకరించగా ఇంకొకరిని కోర్టు విడిచిపెట్టింది. రాంచీ/కోయంబత్తూరు: బీహార్ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్(65)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లాలూ రాజకీయ జీవితంలో పెను మచ్చగా మిగిలిన 17 ఏళ్ల నాటి దాణా కుంభకోణంలో ఆయన దోషేనని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం ప్రకటించింది. దాంతో ఆయన లోక్‌సభ సభ్యత్వానికి కూడా ఎసరొచ్చింది. రూ.950 కోట్ల దాణా కుంభకోణంలో లాలూతో పాటు మరో 44 మంది నిందితులను కూడా ఐపీసీ సెక్షన్లు 120బి (నేరపూరిత కుట్ర), 420 (మోసం), 467 (ఫోర్జరీ), 468, 477ఎ లతో పాటు అవినీతి నిరోధక చట్టం (1988) కింద కూడా దోషులుగా కోర్టు నిర్ధారించింది. జేడీ(యూ) ఎంపీ జగదీశ్ శర్మ, బీహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రాతో పాటు మరో ఐదుగురు రాజకీయ నాయకులు, నలుగురు ఐఏఎస్ అధికారులు మహేశ్‌ప్రసాద్, పూల్‌చంద్ సింగ్; బెక్ జులెస్, కె.ఆర్ముగం, ఆదాయ పన్ను అధికారి ఏసీ చౌదరి, పశుసంవర్ధక శాఖ అధికారులు తదితరులు వీరిలో ఉన్నారు. పశు సంవర్ధక శాఖకు సంబంధించిన రూ.37.7 కోట్లను చైబాసా జిల్లా బొక్కసం నుంచి అక్రమంగా డ్రా చేశారంటూ వీరిపై నమోదైన అభియోగాలను సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ప్రవాస్‌కుమార్ సింగ్ ధ్రువీకరించారు. దోషులుగా పేర్కొన్న వారిలో పశు సంవర్ధక శాఖ మాజీ కార్యదర్శి అయిన ఐఏఎస్ అధికారి అర్ముగం, బీహార్ మాజీ పశు సంవర్ధక, కార్మిక మంత్రి విద్యాసాగర్ నిషాద్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే ధ్రువ్ భగత్, ఐదుగురు దాణా సరఫరాదారులు మధు మెహతా, బిమలా శర్మ, ఎస్కే సిన్హా, శివ్కుమారి, రాజేశ్ వర్మలకు శిక్షను సోమవారమే ఆయన ఖరారు చేశారు. వారందరికీ మూడేళ్ల దాకా కఠిన కారాగార శిక్షతో పాటు రూ.50 వేల నుంచి రూ.5 లక్షల దాకా జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. అయితే తీర్పు అనంతరం వారందరికీ బెయిల్ కూడా మంజూరు చేశారు. లాలూ సహా మిగతా 37 మందికి అక్టోబర్ 3న శిక్షను ఖరారు చేయనున్నారు. పదవికీ ఎసరు! లోక్‌సభ సభ్యులైన లాలూ (సరన్), జగదీశ్ శర్మల పదవి తీర్పు నేపథ్యంలో ప్రమాదంలో పడింది. రెండేళ్లకు పైబడి శిక్ష పడితే వారి సభ్యత్వం తక్షణం రద్దవుతుంది. అంతేగాక కనీసం ఆరేళ్లపాటు ఎన్నికల బరిలో దిగడానికీ వీలుండదు. ఎందుకంటే రెండేళ్లు, లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడ్డ ఎంపీలు, ఎమ్మెల్యేలు తీర్పుపై స్టే తెచ్చుకుంటే వారి సభ్యత్వం రద్దు కాబోదన్న ప్రజాప్రాతినిధ్య చట్ట నిబంధనను గత ఆగస్టులో సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ చరిత్రాత్మక తీర్పును నిర్వీర్యం చేసేందుకు యూపీఏ సర్కారు ప్రతిపాదించిన ఆర్డినెన్స అర్థరహితమంటూ రాహుల్‌గాంధీ కూడా తాజాగా తూర్పారబట్టడంతో దాని కథ కంచికి చేరినట్టేనని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో లాలూ, శర్మల లోక్‌సభ సభ్యత్వం రద్దుపై కోర్టు తీర్పును పరిశీలించాక నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ మీరాకుమార్ కోయంబత్తూరులో చెప్పారు. ముభావంగా లాలూ: కోర్టు తీర్పు వెలువడగానే లాలూను రాంచీ శివార్లలోని బిర్సా ముండా కేంద్ర కారాగారానికి తరలించారు. ఆ సందర్భంగా కోర్టు బయట తనను చుట్టుముట్టిన విలేకరులతో మాట్లాడేందుకు లాలూ నిరాకరించారు. అంతకుముందు కోర్టుకు వెళ్లే ముందు రాంచీలోని దుర్గా ఆలయంలో పూజలు జరిపారు. అనంతరం పెద్ద కొడుకు తేజస్వితో కలిసి కోర్టుకు హాజరయ్యారు. కోర్టు హాల్లో రెండో వరుసలో కూర్చున్న లాలూ, తీర్పు సందర్భంగా మౌనంగా కన్పించారు. పాట్నాలోని రబ్రీ నివాసంలో కూడా తీర్పు తర్వాత విషాద వాతావరణం నెలకొంది. మీడియాతో పాటు ఎవరినీ లోనికి అనుమతించలేదు. ఈ తీర్పును ఆర్జేడీకి అతి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. దీన్ని హైకోర్టులో సవాలు చేస్తామని ఆర్జేడీ ప్రకటించింది. లాలూ గైర్హాజరీలో పార్టీని ఆయన భార్య, బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవి, కుమారుడు తేజస్వి యాదవ్ నడిపిస్తారని పేర్కొంది.