లాలూ ప్రసాద్ యాదవ్
రాంచీ: దాణా కుంభకోణం కేసులు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను వెంటాడుతూనే ఉన్నాయి. 1990ల్లో దుమ్‌కా ఖజానా నుంచి అక్రమంగా రూ.3.13 కోట్లు తీసుకున్న కేసులో శనివారం రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు లాలూకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతోపాటుగా రూ.60 లక్షల జరిమానా విధించింది.
ఐపీసీతో పాటుగా అవినీతి నిరోధక చట్టం కింద 2 వేర్వేరు కేసుల్లో ఏడేళ్ల చొప్పున జైలు శిక్షను సీబీఐ జడ్జి శివ్‌పాల్ ప్రకటించారు. ఈ రెండు శిక్షలు ఒకదాని తర్వాత మరొకటి అమలు చేయాలని ఆదేశించారు. ఈ తీర్పును ఉన్నతన్యాయస్థానంలో అప్పీల్ చేయనున్నట్లు లాలూ తరపు న్యాయవాది తెలిపారు. దియోగఢ్ ఖజానానుంచి అక్రమంగా డబ్బులు తీసుకున్నారనే కేసులో డిసెంబర్ నుంచి రాంచీలోని బిర్సాముండా జైలులో లాలూ శిక్షననుభవిస్తున్నారు.
420 సహా పలు సెక్షన్ల కింద..
‘భారతీయ శిక్షాస్మృతిలోని 420 (మోసం), 409 (ప్రజాప్రతినిధిగా విశ్వాసద్రోహం), 467 (విలువైన పత్రాల ఫోర్జరీ), 471 (ఫోర్జరీ పత్రాలను వినియోగించటం), 477 (విలువైన పత్రాలను అక్రమంగా రద్దుచేయటం), 120బీ (నేరపూరిత కుట్రలకు శిక్ష) సెక్షన్ల కింద 7ఏళ్ల శిక్షతోపాటు రూ.30లక్షల జరిమానా విధించారు. అవినీతి నిరోధక చట్టం ప్రకారం మరో ఏడేళ్ల జైలు, రూ.30 లక్షల జరిమానా విధించారు’ అని సీబీఐ తరపు న్యాయవాది విష్ణుశర్మ పేర్కొన్నారు. జరిమానా చెల్లించని పక్షంలో మరికొన్నేళ్లు జైల్లో ఉండాల్సి వస్తుందన్నారు. ఈ కేసులో మరో 18 మంది దోషులకూ న్యాయమూర్తి శిక్షలను ఖరారు చేశారు.
పశుసంవర్ధక శాఖ మాజీ ప్రాంతీయ సంచాలకుడు ఓపీ దివాకర్‌కు కూడా లాలూతో సమానమైన శిక్షనే విధించారు. మాజీ ఐఏఎస్ అధికారి ఫూల్‌చంద్ సింగ్ సహా తొమ్మిది మంది అధికారులకు ఏడేళ్ల జైలు, రూ. 30 లక్షల జరిమానా చెల్లించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఏడుగురు దాణా సరఫరాదారులకు మూడున్నరేళ్ల జైలు, రూ.15లక్షల జరిమానాను ఖరారు చేశారు. దాణా కుంభకోణానికి సంబంధించిన ఐదు కేసుల్లో లాలూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత వారం ఛాతీనొప్పి కారణంగా ప్రస్తుతం లాలూ రాంచీలోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.
ఆర్జేడీ, బీజేపీ మాటల యుద్ధం
తాజా కోర్టు తీర్పు నేపథ్యంలో బీజేపీపై ఆర్జేడీ తీవ్రంగా మండిపడింది. బీజేపీ రాజకీయ కుట్ర కారణంగానే ఈ కేసులన్నీ నమోదయ్యాయని ఆరోపించింది. అటు బిహార్ అసెంబ్లీలో లాలూ చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్ ‘బీజేపీ నుంచి లాలూ ప్రసాద్ ప్రాణాలకు ముప్పు ఉంది. ఆయన అమాయకుడు. ఉన్నత న్యాయస్థానంలో మాకు అనుకూలంగా తీర్పు వస్తుంది’ అని పేర్కొన్నారు. కాగా ఆర్జేడీ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ‘చట్టం తనపని తాను చేసుకుపోతోంది. దాణా కుంభకోణంలో ఇదేమీ మొదటి కేసు కాదు. లాలూ ప్రాణాలకు ముప్పుందనటం అవాస్తవం. ఆయనకు జైల్లో సంపూర్ణమైన భద్రతను ఏర్పాటుచేశాం’ అని బిహార్ డిప్యూటీ సీఎం, దాణా స్కాం పిటిషనర్లలో ఒకరైన సుశీల్ మోదీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment