
సాక్షి, రాంచీ : దాణా కుంభకోణం.. సీబీఐ కోర్టు తీర్పుపై బీహాన్ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జైలుకు పంపించి.. లాలూ ప్రసాద్ యాదవ్‌ను రాజకీయంగా సమాధి చేశామని అనుకుంటే.. అది వారి మూర్ఖత్వమేనని తేజస్వి యాదవ్ అన్నారు. తప్పుడు ఆలోచనలు చేస్తున్న బీజేపీ, ఇతర పార్టీలు తగిన మూల్యం చెల్లించుకుంటాయని ఆయన అన్నారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా సహా మరికొందరిని సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. సీబీఐ కోర్టు తీర్పు వెలువడిన రెండు రోజుల అనంతరం.. తేజస్వి యాదవ్ స్పందించడం గమనార్హం.
లాలూ ప్రసాద్ యాదవ్‌ను జైలుకు పంపిస్తే.. ఆయన పని అయిపోతుందని బీజేపీ, ఇతర పార్టీలు అనుకోవడం మూర్ఖత్వానికి నిదర్శనం అని ఆయన చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవేళ లాలూప్రసాద్ యాదవ్ బీజేపీతో కలిసుంటే.. వారికి మా నాన్న రాజా హరిశ్చంద్రుడిలా కనిపించేవారని అన్నారు. సీబీఐ కోర్టు తీర్పులో కుట్ర దాగుందని అయన అనుమానాం వ్యక్తం చేశారు. ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. హైకోర్టులో తగిన న్యాయం జరుగుతుందనే ఆశాభావాన్ని తేజస్వి యాదవ్ వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment