దాణా కుంభకోణంలో లాలూకు ఐదేళ్ల జైలు | Lalu Prasad yadav gets 5-year jail term in fodder scam case | Sakshi
Sakshi News home page

దాణా కుంభకోణంలో లాలూకు ఐదేళ్ల జైలు

Published Fri, Oct 4 2013 12:58 AM | Last Updated on Fri, Sep 1 2017 11:18 PM

దాణా కుంభకోణంలో లాలూకు ఐదేళ్ల జైలు

దాణా కుంభకోణంలో లాలూకు ఐదేళ్ల జైలు

 దాణా కుంభకోణంలో శిక్షలు ఖరారు చేసిన సీబీఐ కోర్టు
రాంచీ/పాట్నా: దాణా కుంభకోణంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 25 లక్షల జరిమానా విధించింది. ఇదే కేసులో దోషిగా తేలిన బీహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రాకు కూడా కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ. 2 లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ప్రవాస్ కుమార్ సింగ్ గురువారం తీర్పు వెలువరించారు. 17 ఏళ్లనాటి ఈ కేసులో లాలూప్రసాద్, జగన్నాథ్ మిశ్రా, జేడీ(యూ) ఎంపీ జగదీశ్ శర్మ, మరో ఐదుగురు రాజకీయ నాయకులు, నలుగురు ఐఏఎస్ అధికారులతోపాటు మొత్తం 45 మందిని సెప్టెంబర్ 30న న్యాయస్థానం దోషులుగా తేల్చిన సంగతి తెలిసిందే.
 
 ప్రస్తుతం వీరంతా బిర్సా ముండాలోని సెంట్రల్ జైల్లో ఉన్నారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణ చేపట్టింది. తాను అమాయకుడినని, తనకేమీ తెలియదని ఈ సందర్భంగా న్యాయమూర్తికి లాలూ విన్నవించారు. అయితే అవినీతికి పాల్పడ్డట్టు పక్కా ఆధారాలు ఉండడంతో శిక్ష ఖరారు చేస్తూ కోర్టు 475 పేజీలతో కూడిన తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో లాలూ.. ఎంపీ పదవికి అనర్హుడు కావడంతోపాటు 11 ఏళ్లపాటు ఎన్నికలకు దూరంగా ఉండాల్సి రావొచ్చు. ఇది లోక్‌సభ ఎన్నికల ముందు ఆర్జేడీకి శరాఘాతం కానుంది.  తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామని ఆ పార్టీ అధికార ప్రతినిధి మనోజ్ ఝా తెలిపారు.
 
 ఎవరెవరికీ ఏయే శిక్ష..
 ఈ కేసులోని మొత్తం 45 మంది నిందితుల్లో ఎనిమిది మందికి సెప్టెంబర్ 30నే కోర్టు శిక్షలు ఖరారు చేసింది. లాలూ సహా మిగతా 37 మంది దోషులకు తాజాగా శిక్షలు విధించింది. శిక్షలు పడ్డ రాజకీయ నేతల్లో లాలూ ప్రసాద్ యాదవ్(ఐదేళ్ల కఠిన జైలు శిక్ష, రూ.25 లక్షల జరిమానా), మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా(నాలుగేళ్ల జైలు, రూ.2లక్షల జరిమానా), జేడీయూ ఎంపీ జగదీష్ శర్మ(నాలుగేళ్ల జైలు, రూ.5 లక్షల జరిమానా), ఆర్జేడీ మాజీ ఎమ్మెల్యే ఆర్కే రాణా(ఐదేళ్ల జైలు, రూ.30 లక్షల జరిమానా) ఉన్నారు. ఇక అధికారుల విషయానికి వస్తే.. ముగ్గురు ఐఏఎస్ అధికారులు మహేశ్‌ప్రసాద్, పూల్‌చంద్ సింగ్; బెక్ జులెస్‌లకు నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.2 లక్షల జరిమానా విధించింది. దోషులందరికీ ఐపీసీ సెక్షన్లు 120 బి (నేరపూరిత కుట్ర), 420 (మోసం), 467 (ఫోర్జరీ), 468, 477ఎ లతో పాటు అవినీతి నిరోధక చట్టం (1988) కింద శిక్షలు విధించినట్లు కోర్టు తెలిపింది.
 
 దోచుకునేందుకు అంతా కుమ్మక్కయ్యారు..
 దాణా కుంభకోణం కేసులో ప్రభుత్వ ఖజానా కొల్లగొట్టేందుకు రాజకీయ నేతలు, ప్రభుత్వాధికారులు కుమ్మక్కయ్యారని సీబీఐ కోర్టు వ్యాఖ్యానించింది. మోసపూరితంగా నిధులను డ్రా చేసేందుకు అనేక డాక్యుమెంట్లను ఫోర్జరీ చేశారని,  నకిలీ బిల్లులు సృష్టించారని, రహస్య అజెండాతో కుట్రపూరితంగా వ్యవహరించారని పేర్కొంది. ‘‘దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడని మనం విన్నాం. అయితే ఇప్పుడు దేవుడు స్థానాన్ని అవినీతి ఆక్రమిస్తోంది. సమాజానికి సవాలుగా మారుతోంది’’ అని న్యాయమూర్తి అన్నారు. 2జీ, కామన్‌వెల్త్, కోల్‌గేట్, రైల్‌గేట్, ఐపీఎల్ ఫిక్సింగ్ తదితర స్కాంలతో పోల్చుకుంటే ఈ కేసు చిన్నదేనని దోషుల తరఫు న్యాయవాదులు వాదించారని, అయితే ఈ తరహా కుంభకోణాల్లో దాణా స్కాం మొట్టమొదటిద న్న సంగతిని విస్మరించరాదని ఆయన  పేర్కొన్నారు.
 
 ఇదంతా రాజకీయ కుట్ర: ఆర్జేడీ
 తమ అధినేత లాలూప్రసాద్ యాదవ్‌కు శిక్ష పడడం వెనుక బీజేపీ, జేడీ(యూ)ల రాజకీయ కుట్ర దాగుందని ఆర్జేడీ ఆరోపించింది. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, బీజేపీలు కుట్రపూరితంగా లాలూను ఇరికించాయని దుయ్యబట్టింది. త్వరలోనే బెయిల్‌పై విడుదలవుతారని, పార్టీ అధినేతగా ఆయనే కొనసాగుతారని పార్టీ నేత రామ్‌కృపాల్ చెప్పారు. పార్టీ నాయకత్వంలో ఎలాంటి మార్పు ఉండబోదని మరో నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్ స్పష్టంచేశారు.
 
 అయినా హీరోనే..: రబ్రీదేవీ
 లాలూప్రసాద్ ఇన్నాళ్లూ హీరోగా ఉన్నారని, ఇకముందు కూడా హీరోగానే ఉంటారని ఆయన భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవీ అన్నారు. భర్తకు శిక్ష ఖరారు నేపథ్యంలో ఆమె రోజంతా తన అధికార నివాసానికే పరిమితమై టీవీకి అతుక్కుపోయారు. ఐదేళ్ల శిక్ష ఖరారు తర్వాత ఆమె నివాసం నుంచి బయటకు వచ్చిన ఆర్జేడీ ప్రధాన కార్యదర్శి రామ్‌కృపాల్ యాదవ్ విలేకరులతో మాట్లాడారు. కోర్టు తీర్పుతో లాలూ కుటుంబం కుంగిపోలేదని, లాలూ ఇకముందు కూడా హీరోగానే ఉంటారని రబ్రీదేవీ అన్నట్లు చెప్పారు.
 
 ఇదీ లాలూ ప్రస్థానం..
     లాలూ ప్రసాద్ ఇప్పుడు దేశవ్యాప్తంగా తెలిసిన ఓ పెద్ద రాజకీయ నాయకుడు కావచ్చుగానీ.. ఆయన రాజకీయాల్లోకి రాకముందు ఒక సాధారణ గుమాస్తా. ఆయన తండ్రి పాలు విక్రయించేవారు. లాలూ 1948 జూన్ 11న బీహార్‌లోని యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓ సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు.
     పాట్నా యూనివర్సిటీలో విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో పాల్గొనడంతో ఆయనకు రాజకీయాలపై ఆసక్తి మొదలైంది. లాలూ తొలిసారి 29వ ఏట లోక్‌సభకు ఎన్నికయ్యారు. అక్కడితో ఆయన దశ తిరిగింది. నాడు ఆరో లోక్‌సభలో అడుగుపెట్టిన పిన్న వయస్కుల్లో ఆయన కూడా ఒకరు.
     పదేళ్లలో ప్రసాద్ చాలా వేగంగా రాజకీయాల్లో ఉన్నతస్థాయికి ఎదిగారు. బీహార్‌లో రాజకీయంగా పాతుకుపోయారు. తొలిసారి 1990లో ముఖ్యమంత్రి అయ్యారు.
     రెండోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాక ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. 1996లో దాణా కుంభకోణం ఆరోపణలు రావడంతో వేరే దారి లేక లాలూ.. 1997లో తన పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే అందరినీ ఆశ్చర్యపరుస్తూ తన భార్య, తొమ్మిది మంది పిల్లల తల్లి రబ్రీదేవిని సీఎం చేశారు.
     రబ్రీదేవీ నిరక్షరాస్యురాలు కావడం, దాంతోపాటు రాజకీయాలకు ఆమె కొత్త కావడంతో విమర్శకులు ఆమెను ‘రబ్బర్ దేవీ’ అంటూ విమర్శించేవారు. లాలూ తరఫున రబ్బర్ స్టాంప్‌గా ఆమె పనిచేస్తోందని అనేవారు.
     దాణా కుంభకోణానికి సంబంధించి లాలుపై ఒత్తిడి పెరగడంతో ఆయన 1997లో జనతా దళ్‌ను వీడి.. రాష్ట్రీయ జనతా దళ్ ఏర్పాటు చేశారు.
     15 ఏళ్లపాటు బీహార్‌ను ఏలిన లాలూ రాజకీయ జీవితం 2005 నుంచి పతనం దిశగా సాగింది. అయితే ఈ పదిహేనేళ్లలో లాలు హవా ఎంతలా సాగిందంటే.. ఆయన పేరుతో మార్కెట్లోకి బొమ్మలు కూడా వచ్చేశాయి.
     లాలూ హయాంలో రాష్ట్రంలో బీహార్ ప్రజల జీవితాల్లో పెద్దగా మార్పు కనిపించకపోవడంతో 2005 ఎన్నికల్లో లాలూ ఓడిపోయారు. అప్పటిదాకా ముస్లింలు, యాదవులు ఆయనకు నిరంతరం అండగా నిలిచేవారు.
     2004లో ఆయనకు రైల్వే మంత్రి పదవి దక్కింది. అప్పటిదాకా నష్టాల్లో ఉన్న రైల్వేను ఆయన లాభాల్లోకి తెచ్చి చూపించారు. దీంతో లాలూ పేరు మార్మోగిపోయింది. దీని గురించి ప్రముఖ బిజినెస్ స్కూళ్లలో కూడా బోధించే స్థాయికి ఆయన ఎదిగిపోయారు.
     జోక్‌లు, పంచ్‌లకు లాలూ పెట్టింది పేరు. బడ్జెట్ ప్రసంగాల్లోగాని, మీడియాతో మాట్లాడేటప్పుడుగాని లాలూ వేసే జోకులు, విసిరే పంచ్‌లకు అందరూ పడిపడి నవ్వేవారు.
     కేంద్ర స్థాయిలో యూపీఏలో లాలూ బాగా పేరు సంపాదించినా రాష్ట్రంలో ఆయన రాజకీయంగా బాగా దెబ్బతిన్నారు. దానికి తోడు దాణా కుంభకోణం 17 ఏళ్లపాటు వెంటాడి.. ఆయన్ను కటకటాల్లోకి నెట్టింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement