రాంచీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 21 ఏళ్లనాటి దాణా కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయనను దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే ఒక కేసులో ఆయన జైలు శిక్ష ఎదుర్కొంటూ ఉండగా.. శనివారం మరో కేసులో రాంచీ సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. కిక్కిరిసిన కోర్టు గదిలో ప్రత్యేక న్యాయమూర్తి శివ్‌పాల్ సింగ్ తీర్పును వెలువరిస్తూ.. బిహార్ మాజీ సీఎం లాలూ యాదవ్(69) సహా 16 మందిని దోషులుగా ప్రకటించారు.
అదే సమయంలో మరో మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా(80)తో పాటు ఆరుగురిని నిర్దోషులుగా పేర్కొన్నారు. జనవరి 3న దోషులకు కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. 1991–94 మధ్య కాలంలో దేవ్‌గఢ్ ఖజానా నుంచి రూ. 89.27 లక్షల్ని అక్రమంగా విత్‌డ్రా చేసిన దాణా కేసులో ఈ తీర్పు వెలువడింది. తీర్పు అనంతరం లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు ఇతర నిందితుల్ని సీబీఐ కస్టడీలోకి తీసుకుని రాంచీలోని బిర్సా ముండా జైలుకు తరలించింది. తీర్పుపై లాలూ స్పందిస్తూ తనను మండేలా, అంబేడ్కర్‌లతో పోల్చుకునే ప్రయత్నం చేశారు. చివరకు సత్యమే గెలుస్తుందని ట్వీట్ చేశారు.
ఉదయం నుంచి ఉత్కంఠ..
తీర్పు నేపథ్యంలో ఉదయం నుంచి సీబీఐ కోర్టు పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత కొనసాగింది. శనివారం తీర్పు వెలువరిస్తామని డిసెంబర్ 13నే కోర్టు చెప్పడంతో.. పెద్ద ఎత్తున లాలూ మద్దతుదారులు గుమిగూడడంతో భారీగా భద్రతా బలగాల్ని మోహరించారు. లాలూతో పాటు బిహార్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత, లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ కోర్టుకు హాజరయ్యారు. న్యాయమూర్తి తీర్పును ప్రకటిస్తూ.. లాలూతో పాటు రాజకీయ నాయకులైన జగదీశ్ శర్మ, ఆర్‌కే రానా, ఐఏఎస్ అధికారులు బెక్ జూలియస్, పూల్‌చంద్ సింగ్, మహేశ్ ప్రసాద్, ప్రభుత్వాధికారులు కృష్ణ కుమార్, సుబిర్ భట్టాచార్యల్ని దోషులుగా ప్రకటించారు. దాణా సరఫరా, రవాణాదారులు మోహన్ ప్రసాద్, సుశీల్ కుమార్ సిన్హ్, సునీల్ కుమార్ సిన్హ్, రాజా రాం జోషి, గోపీనాథ్ దాస్, సంజయ్ అగర్వాల్, జ్యోతీ కుమార్ ఝా, సునీల్ గాంధీల్ని కూడా దోషులుగా తేల్చారు.
జగన్నాథ్ మిశ్రా , ప్రజా పద్దుల కమిటీ మాజీ చైర్మన్ ద్రువ్ భగత్, మాజీ ఐఆర్‌ఎస్ అధికారి ఏసీ చౌదరీ, దాణా సరఫరాదారులు సరస్వతీ చంద్ర, సాధనా సింగ్, మాజీ మంత్రి విద్యాసాగర్ నిషాద్‌లను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ప్రత్యేక సీబీఐ కోర్టు తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామని ఆర్జేడీ సీనియర్ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్ చెప్పారు. న్యాయ పోరాటంతో పాటు.. రాజకీయంగానూ పోరాటం కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. ‘ఒకే కేసులో కొందరిని విముక్తుల్ని చేయడం, మరికొందరికి జైలు శిక్ష విధించడం ఏమిటని ప్రజలు చర్చించుకుంటున్నారు’ అని మరో సీనియర్ నేత అబ్దుల్ సిద్దిఖీ వ్యాఖ్యానించారు. శిక్షాకాలం ప్రకటించాక పార్టీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు.
ఓట్ల కోసం ప్రతిపక్షాలపై
బీజేపీ దుష్ప్రచారం: లాలూ
తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు, ఓట్ల కోసం.. ప్రతిపక్షాలపై ప్రజల అభిప్రాయాల్ని దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ట్వీటర్‌లో లాలూ ఆరోపించారు. తీర్పు వెలువడిన తర్వాత ఆయన వరుస ట్వీట్లు చేశారు. ‘బలవంతులైన వ్యక్తులు, వర్గాలు ఎప్పడూ సమాజాన్ని పాలిత, పీడిత వర్గాలుగా విభజిస్తూనే ఉన్నారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే కింది స్థాయి వ్యక్తులు శిక్షకు గురవుతున్నారు. నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్, బాబా సాహెబ్ అంబేడ్కర్ వంటి నేతలు.. వారి ప్రయత్నాల్లో విఫలమైతే చరిత్ర వారిని ప్రతినాయకులుగా పరిగణించి ఉండేది. పక్షపాతం, జాతివివక్ష, కులతత్వంతో నిండిన వ్యక్తులకు నేటికీ వారు ప్రతినాయకులే. వేరే విధంగా ఎవరూ ఆశించలేరు. పక్షపాతంతో కూడిన అసత్య ప్రచారంతో.. సత్యాన్ని అబద్ధంగా, అర్ధ సత్యంగా అనిపించేలా చేయవచ్చు. అయితే అంతిమంగా సత్యం గెలుస్తుంది. సత్యం చెప్పులు తొడుక్కునేలోపే అబద్ధం ప్రపంచాన్ని సగం చుట్టి రాగలదు.. చివరికి సత్యమే నిలుస్తుంది’ అని ట్వీట్లలో పేర్కొన్నారు.
1997లో 38 మందిపై చార్జిషీటు
దాణా కుంభకోణం కేసులు వెలుగులోకి వచ్చాక 1996లో పట్నా హైకోర్టు విచారణకు ఆదేశించింది. 1997, అక్టోబర్ 27న దేవ్‌గఢ్ ఖజానా కేసులో 38 మందిపై చార్జిషీటు దాఖలైంది. ఈ కేసులో ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద నిందితులపై కేసులు నమోదయ్యాయి. కేసు విచారణలో ఉండగా 11 మంది మరణించగా.. ఇద్దరు తప్పు ఒప్పుకోవడంతో 2006–07లో కోర్టు వారికి జైలు శిక్ష విధించింది.
పశువుల పేరిట నిధులు స్వాహా
దాణా కుంభకోణం...1980, 90 దశకాల్లో ఉమ్మడి బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. మొత్తం రూ.950 కోట్ల మేర అవినీతి జరిగినట్లు అంచనా. రెండు దశాబ్దాలకు పైగా రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు, దాణా సరఫరాదారులు కుమ్మక్కై.. ఉనికిలో లేని కంపెనీల నుంచి దాణా కొనుగోలు పేరిట వందల కోట్లు స్వాహా చేశారనేది ప్రధాన అభియోగం. దాణా కుంభకోణం, దానితో ముడిపడ్డ ఇతర ఆరోపణలపై మొత్తం 64 కేసులు నమోదు కాగా, ఐదు కేసుల్లో లాలూప్రసాద్ నిందితుడిగా ఉన్నారు. దేవ్‌గఢ్ ఖజానా నుంచి నిధుల స్వాహా కేసులో తాజా తీర్పు వెలువడింది.
కుంభకోణంలోని మిగతా కేసులు
ఉమ్మడి బిహార్ రాష్ట్రంలోని చాయిబాసా జిల్లా ఖజానా నుంచి రూ.37.70 కోట్ల మొత్తాన్ని కాజేశారని ఒక కేసులో సీబీఐ ఆరోపించింది. ఈ కేసులో సెప్టెంబర్ 30, 2013న కోర్టు లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.25 లక్షల జరిమానా విధించింది. ఈ శిక్షతో లాలూ లోక్‌సభ సభ్యత్వం రద్దవడంతో పాటు.. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో జార్ఖండ్ హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో.. లాలూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రెండు నెలలు జైలులో ఉన్న లాలూకు 2013, డిసెంబర్ 13న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాణా కుంభకోణంలో దుమ్కా ఖజానా నుంచి రూ. 3.97 కోట్లు, చాయ్‌బసా ఖజానా నుంచి రూ. 36 కోట్లు, దోరండ ఖజానా నుంచి రూ. 184 కోట్లు అక్రమంగా విత్ డ్రా చేసిన కేసుల్ని కూడా లాలూ యాదవ్ ఎదుర్కొంటున్నారు.
కుంభకోణం ఎలా బయటకొచ్చింది
పెద్ద సంఖ్యలో పశువులున్నట్లుగా తప్పుడు రికార్డులు చూపి వాటి కోసం దాణా, మందులు, ఇతర పరికరాలను కొనుగోలు చేసినట్లు చూపారు. ఈ కుంభకోణం 1996లో వెలుగు చూసినా, 1980 దశకం, ఆ తర్వాత కూడా అక్రమాలు కొనసాగినట్లు గుర్తించారు. 1996లో ఆర్థికశాఖ కార్యదర్శి వీఎస్ దూబే ఆదేశాలతో జిల్లా కేంద్రాల్లో తనిఖీల్లో అవకతవకలు వెలుగులోకివచ్చాయి. 1993–96 మధ్య 40,500 కోళ్లు, 5,664 పందులు, 1,577 మేకలు, 995 గొర్రెల కొనుగోలుకు పశుసంవర్ధకశాఖకు రూ.10.5 కోట్లు కేటాయించారు. ఆ శాఖ మాత్రం ఖజానా నుంచి రూ.255.33 కోట్లు తీసుకుంది. వీటికి ఇతర ఖర్చులు కలిపి రూ.409.62 కోట్లు విత్‌డ్రా చేసినట్లు గుర్తించారు. ఈ లెక్కల్ని బిహార్ ఆడిటర్ జనరల్ పరిశీలించి అవినీతి ఉన్నట్లు తేల్చారు. ఈ కుంభకోణంపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడంతో.. 1996లో పట్నా హైకోర్టు ఈ కేసును సీబీఐకు అప్పగించింది.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment