
నిన్న వ్యూహకర్త.. నేడు సలహాదారు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ నేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విజయంలో కీలక పాత్ర పోషించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్కు కీలక పదవి దక్కింది.
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ నేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విజయంలో కీలక పాత్ర పోషించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్కు కీలక పదవి దక్కింది. సీఎం నితీష్ తన సలహాదారుగా ప్రశాంత్ను నియమిస్తూ కేబినెట్ హోదా కల్పించారు.
బిహార్ ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కూడిన మహా కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల సందర్భంగా నితీష్ ప్రచార బృందాన్ని ప్రశాంత్ పర్యవేక్షించారు. నితీష్ మరోసారి ముఖ్యమంత్రి కావడానికి కృషిచేశారు. మారుమూల ప్రాంత ప్రజలకు, యువతకు దగ్గరయ్యేలా ప్రచార వ్యూహాలు రూపొందించారు. సోషల్ మీడియాను ఉపయోగించుకుని యువతను ఆకర్షించేలా చేశారు. అంతకుముందు 2014 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే తరపున నరేంద్ర మోదీ విజయానికి కృషి చేశారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ప్రశాంత్ ఎన్డీయేకు దూరమైనట్టు సమాచారం.