బుధవారం బిహార్లోని అన్ని ప్రధాన వార్తాపత్రికల్లో బీజేపీ ఇచ్చిన 'ఆవు' ప్రకటన.. ప్రధానంగా 9 జిల్లాల్లో కలకలం రేపింది. ఎందుకంటే..
పూర్నియా: 'ముఖ్యమంత్రిగారు.. మీ భాగస్వమి పవిత్ర గోమాతనూ, హిందువులనూ అవమానిస్తూ స్టేట్మెంట్లు గుప్పిస్తాడు. అతడిపై చర్యలు తీసుకోవాల్సిందిపోయి మీరు మౌనంగా ఉంటారు. అంటే దీని అంతరార్థమేమిటి?' అంటూ బీజేపీ జారీచేసిన భారీ ప్రకటనలు.. బుధవారం బిహార్లోని అన్ని ప్రధాన వార్తాపత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఈ ప్రకటనతో ప్రధానంగా 9 జిల్లాల్లో రాజకీయ కలకలం రేగింది. ఎందుకంటే..
ఈ జిల్లాల్లోని 57 నియోజకవర్గాల్లోనే రేపు(గురువారం) ఐదో(చివరి) విడత పోలింగ్ జరగనుంది. వీటిలో ఎక్కువ స్థానాల్లో ముస్లిం ఓటర్లదే ఆధిపత్యం. ఎంఐఎం పార్టీ కూడా ఈ ప్రాంతం నుంచి పోటీచేస్తుండటం గమనార్హం.
చివరి విడతలో బీజేపీ ఇలా హిందూత్వ కార్డును ప్రయోగించడంపై మిగిలిన పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొద్దిరోజుల కిందట దాద్రీ ఘటనపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ హిందువులు కూడా గోమాంసం తింటారని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. లాలూ వ్యాఖ్యలపై నితిశ్ కుమార్ మౌనం వహించడమూ విదితమే.
తాజా ఆవు ప్రకటనపై బిహార్ వెలుపలి నేతలు కూడా స్పందించారు. 'ప్రకటనలో కేవలం బీజేపీ అని మాత్రమే పేర్కొన్నారు. ఇంతకీ ఈ యాడ్ ఇచ్చింది ఆ పార్టీ అనుచరగణమా? లేక అధిష్ఠానమా?' అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశాడు. 'ఉద్రేకపూరిత ప్రకటనతో నిద్రలేచినట్లు బీహార్ కామ్రేడ్లు ఫోన్లు చేశారు' అని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరీ ట్వీట్ చేశాడు. ఇక జేడీయూ- ఆర్జేడీల మహాకూటమి నేతలు బీజేపీ ప్రకటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేసేందుకు సిద్ధమవుతున్నారు.
పూర్నియా, అరారియా, దర్భాంగ, కతిహార్, కిషన్ గంజ్, మాధేపురా, మధుబని, సహర్సా, సుపౌల్ జిల్లాల్లోని 57 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రేపు పోలింగ్ జరగనుంది. దీంతో సుదీర్ఘంగా సాగిన పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. నవంబర్ 8న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వెలువడనుంది.