పట్నా: మద్య నిషేధం అమల్లో ఉన్న బిహార్‌లో కల్తీ సారా మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి. శరన్ జిల్లాలో బుధవారం కల్తీ సారా కాటుకు 21 మంది బలవగా.. మరో 9 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు కోల్పోయారు. వారంతా మంగళవారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. ఈ అంశం రాష్ట్ర అసెంబ్లీని కుదిపేసింది. సారాను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విపక్ష బీజేపీ సభ్యులు ఆరోపించారు. వారిపై సీఎం నితీశ్ కుమార్ మండిపడ్డారు.
తాగిన వారు చస్తారు.. జాగ్రత్త
కల్తీసారా అంశంపై అసెంబ్లీ వేదికగా విపక్షాలపై మడ్డిపడ్డ సీఎం నితీశ్ కుమార్ తాజాగా మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే మద్యం తాగుతారో వారు చనిపోతారు అంటూ పేర్కొన్నారు. ఛాప్రా కల్తీ సారా ఘటనపై మీడియాతో మాట్లాడారు నితీశ్.
‘లిక్కర్ తాగే వారు చనిపోతారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మేము పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. బాపు(మహాత్మా గాంధీ) ఏం చెప్పారో మీకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు ఏం చెబుతున్నాయి? మద్యం ప్రమాదకరమని ఇంటింటికి తెలియజేస్తున్నాం. చాలా కాలంగా కల్తీ మద్యం తాగి ప్రజలు చనిపోతున్నారు. ఇది దేశవ్యాప్తంగా జరుగుతోంది. ప్రజలే ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి. నిషేధం ఉన్న చోట లిక్కర్ అమ్ముతున్నారంటే.. అందులో ఏదో ఉన్నట్లు అర్థం. కొందరు తెలిసి తప్పులు చేస్తున్నారు.’ అని పేర్కొన్నారు నితీశ్ కుమార్.
ఇదీ చదవండి: మీరు తాగొచ్చారు.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై ఆగ్రహంతో ఊగిపోయిన సీఎం
Comments
Please login to add a commentAdd a comment