బీహార్ తాజా రాజకీయా పరిణామాల ప్రభావం దేశంపైన, తెలుగు రాష్ట్రాలపైన ఏ మేరకు పడుతుంది? బీహార్‌లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని జేడీయూ పక్షం బీజేపీకి గుడ్ బై చెప్పి మళ్లీ ఆర్జేడి, కాంగ్రెస్‌లతో కూడిన మహా కూటమిలో భాగం అయింది. ఎన్‌డిఎలో ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ ఇప్పుడు ప్రత్యర్ధి కూటమిలో కూడా సీఎం అయి మరోసారి తన ప్రత్యేకత నిరూపించుకున్నారు. పలు ఆటుపోట్లను చవిచూసిన నితీష్ రాజకీయ చాతుర్యం ఒక విధంగా అసాధారణమైనదే అని చెప్పాలి.
చదవండి: గోరంట్ల మాధవ్ వీడియో అంశం: చెత్త వ్యూహంతో టీడీపీ దెబ్బ తిందా?
2024లో నరేంద్ర మోదీ తిరిగి ప్రధాన మంత్రిగా ఎన్నిక కాలేరని చెబుతున్న ఆయన 2014లో కూడా తప్పుడు అంచనాతో బీజేపీకి దూరం అయ్యారు. అయినా బీహారు ప్రజలు ఆయన ఏ కూటమిలో ఉంటే దానికి జై కొట్టారు. మహాకూటమిలో భాగంగా ఉండి 2015లో అధికారంలోకి వచ్చిన నితీష్ , ఆ తర్వాత ఆ కూటమిని వీడి తిరిగి బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్.డి.ఎ.కూటమిలో భాగస్వామి అయ్యారు. ఒకప్పుడు మోదీని తీవ్రంగా వ్యతిరేకించినా, తదుపరి ఆయన దగ్గరయ్యారు. 2020 లో బీజేపీతో కలిసి అధికారం సాధించిన నితీష్ ఈసారి ఎన్.డి.ఎ.ని వదలిపెట్టి మహాకూటమిలో భాగస్వామి అయ్యారు. 2025లో సాధారణ ఎన్నికలు వచ్చేవరకు ఇదే కూటమిలో ఉంటారా? మరోసారి కూటమి మారతారా అన్నది అప్పుడే చెప్పలేం.
మామూలుగా అయితే ఇన్నిసార్లు కూటములు మార్చే నేతలపై ప్రజలలో, ఇతర రాజకీయ పార్టీలలో వ్యతిరేకత వస్తుంటుంది. కాని నితీష్ రెండు కూటములవారిని ఆకర్షించడం ఆయన ప్రత్యేకత. దానికి కారణం ప్రధానంగా ఆయన వ్యక్తిత్వమే అని చెప్పాలి. అవినీతి ముద్ర లేకుండా పోవడం, బీహార్‌లో సంక్షేమ కార్యక్రమాలకు తగు ప్రాధాన్యం ఇవ్వడం, వీలైనంత అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని నడిపించడం వంటి కారణాల వల్ల ఆయనపై ప్రజలలో మరీ ఏవగింపు లేదు. నితీష్ కుమార్ దేశంలో మరే నేత సాధించలేని విధంగా ఎనిమిది సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి రికార్డు సృష్టించారు.
ఒకప్పుడు బలం లేకపోయినా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కేవలం అతి కొద్ది రోజులు మాత్రమే అధికారంలో ఉండి, మెజార్టీ కొరవడి పదవి నుంచి వైదొలగవలసి వచ్చింది. కాని ఆ తదుపరి కేంద్ర మంత్రిగా ఉంటూ పేరు తెచ్చుకున్నారు. బీజేపీతో కలిసి బీహారులో 2005 లో అధికారంలోకి వచ్చింది మొదలు, మధ్యలో కొద్ది నెలలు మినహా ఇప్పటివరకు ఆయనే సీఎంగా ఉన్నారు. ఆయన ఏ కూటమిలో ఉన్నా, తన సొంత పార్టీ అయిన జేడీయూ ఇతర పార్టీలకన్నా తక్కువ సీట్లే సాధించినా, నితీష్ కుమార్ నే ఆయా కూటములు సీఎంగా ఎన్నుకోవడం విశిష్ట పరిణామం.
అదే సమయంలో నితీష్ కుమార్ పై అవకాశవాద రాజకీయాలు చేస్తారన్న విమర్శ కూడా ఉంది. గతంలో మహాకూటమిని వదలి ఎన్డీఏ కూటమిలోకి వచ్చినప్పుడు ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఈయనను పాముతో పోల్చారు. సరిగ్గా ఇప్పుడు అదే పద ప్రయోగాన్ని బిజెపి నేతలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, దేశ వ్యాప్తంగా ప్రతిపక్షానికి నితీష్ లో కొద్ది ఆశారేఖలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్దిగా ఫోకస్ చేయడానికి కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్న తరుణంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం, ముఖ్యమంత్రిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న తీరుతో నితీష్ ప్రధాని అభ్యర్ధి కావచ్చనే ప్రచారం ఆరంభం అయింది.
నితీష్ మనసులో ఇదే ఉద్దేశం గత కొన్నేళ్లుగా ఉన్పప్పటికీ, మోదీ హవా ముందు తలవంచుకుని కామ్ తన పని తాను చేసుకుపోయారు. మరో రెండేళ్లలో సాధారణ ఎన్నికలు జరగనున్నందున ఇప్పుడు మళ్లీ తన వ్యూహాలకు పదును పెడుతున్నట్లుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మోదీని నితీష్ ఎదుర్కోగలుగుతారా ?లేదా అన్న ప్రశ్న ఉన్నప్పటికీ, స్తూలంగా నితీష్ అభ్యర్ధిత్వాన్ని బీజేపీని వ్యతిరేకించే వివిధ రాజకీయ పక్షాలు ఆమోదించే అవకాశం ఉంది.
ఇప్పటికిప్పుడు ఈ విషయంలో ఏమి జరుగుతుందో జోస్యం చెప్పలేకపోయినా, దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర రాజకీయ పక్షాలలో నితీష్‌కే ఎక్కువగా గుడ్ విల్ ఉన్నట్లు భావించవచ్చు. కాగా నితీష్ రాజకీయ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎలా ఉండవచ్చు అన్న చర్చ కూడా ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలి కాలంలో బీజేపీపై ఫైట్ చేస్తున్న మొనగాడుగా గుర్తింపు తెచ్చుకునే యత్నం చేస్తున్నారు.
ఒక దశలో జాతీయ పార్టీని పెట్టుకుని ప్రధాని రేసులో ఉండాలని కూడా ఆయన ఆశించారు. కాని ప్రాక్టికల్ రాజకీయాలలో అది చాలా కష్టమైనదిగా కనిపిస్తుంది. నితీష్ ఉత్తరాది రాజకీయ నేత అవడం ఒక అడ్వాంటేజ్ కాగా, కేసీఆర్ దక్షిణాది నేత కావడం, తెలంగాణలో కేవలం 17 లోక్ సభ స్థానాలే ఉండడం డిజడ్వాంటేజ్ గా భావించవచ్చు. బీహార్‌లో 40 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. అయితే కేసీఆర్ బీజేపీపై చేస్తున్న పోరాటానికి నితీష్ కుమార్ తాజా నిర్ణయం నైతికంగా బలం చేకూర్చుతుంది. మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలలో బీజేపీ అనుసరించిన వ్యూహానికి ప్రతిగా బీహార్‌లో నితీష్ ఆ పార్టీకి ఝలక్ ఇచ్చారు.
తద్వారా ప్రస్తుతానికి తన పార్టీని చీల్చే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడగలిగారు. బీహార్‌లో ఎదురుదెబ్బ తినడంతో తెలంగాణలో బీజేపీ తన గేమ్‌ను చాలా జాగ్రత్తగా ఆడవలసి ఉంటుంది. ప్రధానంగా సీబిఐ, ఈడీ వంటి సంస్థలను ప్రయోగించడంలో ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. అది టీఆర్ఎస్‌కు ధైర్యం ఇచ్చే అంశం అవుతుంది. మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక జరగనున్నందున, టీఆర్ఎస్ బీహార్ రాజకీయాలను ప్రచారంలో వాడుకోవచ్చు. బీజేపీని ప్రజా వ్యతిరేకిగా చూపించడానికి ఈ పరిణామాన్ని వాడుకోవచ్చు. కొద్ది రోజుల క్రితం నితీ ఆయోగ్ సమావేశానికి వెళ్లకుండా కేసీఆర్ బహిష్కరించారు. కేసీఆర్‌తో పాటు నితీష్ కూడా ఆ సమావేశానికి వెళ్లలేదు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌తో ఇప్పటికే కేసీఆర్ సంబంధాలు పెట్టుకున్నారు. ఇప్పుడు వారితో కలిసి కేసీఆర్ రాజకీయం చేసే అవకాశం ఉంటుంది.
కాగా ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక రాజకీయంపై పెద్దగా ప్రభావం చూపదుకాని, ఢిల్లీ స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు, ముఖ్యమంత్రి జగన్‌కు మరింత ప్రాధాన్యత ఏర్పడవచ్చు. జేడీయూ నిష్క్రమణతో రాజ్యసభలో బీజేపీకి అవసరమైన మెజార్టీకి కొంత తక్కువ సీట్లు ఉన్నాయి. కీలకమైన బిల్లులపై ఓటింగ్ వస్తే వైసీపీపైన, ఒడిషాలోని బీజేడీపైన బీజేపీ ఆధారపడవలసి వస్తుందని ఇప్పటికే విశ్లేషణలు వచ్చాయి. బీహార్‌లో ఈ సారి మెజార్టీ లోక్ సభ సీట్లు బీజేపీకి ఎంతవరకు వస్తాయన్నది చెప్పలేం. ఒకవేళ బీజేపీ కూటమికి గత మాదిరి 39 సీట్లు రాకపోతే, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటులో కొంత ఇబ్బంది రావచ్చు. యూపి. ఎంపీ, కర్ణాటక వంటి రాష్ట్రాలలో కూడా లోక్ సభ ఎన్నికలలో గతంలో వచ్చినట్లుగా ఓవర్ హెల్మింగ్ గా సీట్లు రాకపోవచ్చు. ఆయా రాష్ట్రాలలో సీట్ల సాధనలో వెనుకబడితే, అప్పుడు వైసీపీ వంటి పార్టీలు సాధించే సీట్లకు గిరాకి ఏర్పడుతుంది. అలాగే ఎలాగైనా బీజేపీతో అంటకాగాలని ఆరాటపడుతున్న తెలుగుదేశం పార్టీకి కూడా ఈ పరిణామం కాస్త ఆశ కలిగించవచ్చు.
కానీ బీజేపీ ఏపీకి సంబంధించి వైసీపీపైన ఆధారపడాలా? టీడీపీతో జత కలవాలా అన్నదానిపై ఎన్నికల తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా బీజేపీపై వ్యతిరేకత ప్రబలితే ,అప్పుడు విపక్షాల కూటమికి కాస్త మెరుగైన ఫలితాలు రావచ్చు. అప్పుడు మోదీ అభ్యర్ధిత్వంపై చర్చ జరగవచ్చు. మోదీ ప్రధాని కాకుండా ఉంటే మద్దతు ఇస్తామని కొన్ని పార్టీలు ప్రతిపాదించవచ్చు. ఇలా రకరకాల పరిణామాలు వచ్చే లోక్ సభ ఎన్నికల తర్వాత జరిగే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ఆయా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలపై దూకుడుగా వెళుతున్న బీజేపీ కొంత తగ్గవచ్చు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆయా ప్రాంతీయ పార్టీలను ఆకర్షించే పనిలో పడవచ్చు. ఏది ఏమైనా ఇంతవరకు మోదీకి ప్రత్యామ్నాయం లేరనుకుంటున్న తరుణంలో నితీష్ కుమార్ రూపంలో విపక్షాలకు ఒక ప్రత్యామ్నాయం దొరికిందని భావించవచ్చేమో!
-కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment