బిహార్ పోలింగ్ ప్రశాంతం
♦ నాలుగో దశలో 55 స్థానాల్లో 57.59% పోలింగ్
♦ తొలి మూడు దశలకన్నా అధికం.. 2010 ఎన్నికల కన్నా ఎక్కువ
పట్నా/న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం నాలుగో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఏడు జిల్లాల్లోని 55 అసెంబ్లీ స్థానాలకు నిర్వహించిన ఈ ఎన్నికల్లో గత మూడు దశలకన్నా అధికంగా 57.59 శాతం పోలింగ్ నమోదవటం విశేషం. ఇది ఈ నియోజకవర్గాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ కన్నా మూడు శాతం ఎక్కువ. ముజఫర్‌పూర్, తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, సీతామర్హి, షోహార్, గోపాల్‌గంజ్, సివాన్ జిల్లాల్లోని ఈ నియోజకవర్గాల్లో మొత్తం 1.46 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. మహిళా ఓటర్లలో 60.40 శాతం మంది, పురుష ఓటర్లలో 54.20 శాతం మంది ఓటు వేశారు. మొదటి దశ పోలింగ్‌లో 54.85, రెండో దశలో 54.99, మూడో దశలో 54.24 చొప్పున పోలింగ్ శాతాలు నమోదవగా.. నాలుగో దశలో రికార్డు స్థాయిలో 57.59 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి అజయ్‌నాయక్ తెలిపారు. మొత్తం నాలుగు దశలూ కలిపితే పోలింగ్ శాతం 55.41 గా ఉంది.
రఘునాథ్‌పూర్ పరిధిలో ఉద్రిక్తత...
సివాన్ జిల్లాలోని రఘునాథ్‌పూర్ నియోజకవర్గంలోని రాతౌరా గ్రామంలో ఇరు వర్గాలకు చెందిన వారు రాళ్లు రువ్వుకుని ఉద్రిక్తత తలెత్తటంతో.. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు జరిపి, లాఠీచార్చి చేశారని ఉప ఎన్నికల కమిషనర్, బిహార్ ఇన్‌చార్జ్ ఉమేశ్‌సిన్హా ఢిల్లీలో మీడియాకు తెలిపారు. మత ఉద్రిక్తత తలెత్తే పరిస్థితి నెలకొందని.. అయితే పరిస్థితిని పూర్తి నియంత్రణలోకి తెచ్చామని, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించామని అజయ్‌నాయక్ వివరించారు. ఘర్షణలో గాయపడిన ఇద్దరు వ్యక్తులను ఆస్పత్రికి తరలించామన్నారు. కాగా, నాలుగో దశ బరిలో 55 నియోజకవర్గాల్లో మొత్తం 776 మంది అభ్యర్థులు ఉన్నారు. వారిలో 55 మంది మహిళలు.
ఈ 55 అసెంబ్లీ స్థానాల్లో గెలుపుపై జేడీయూ, ఆర్‌జేడీ, కాంగ్రెస్‌ల లౌకిక కూటమి, బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏలు ధీమాగా ఉన్నాయి. 2010 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూతో కలిసి పోటీచేసిన బీజేపీ ఈ 55 సీట్లలో 26 సీట్లు గెలుచుకుంది. నాడు బీజేపీతో కలిసి పోటీచేసిన జేడీయూ మరో 24 సీట్లు గెలుపొందింది. ఆర్‌జేడీ 2 సీట్లు గెలుచుకోగా.. మిగతా 3 సీట్లలో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. కానీ.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. నాడు మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ - జేడీయూలు ఇప్పుడు ప్రత్యర్థులుగా బరిలోకి దిగాయి. మహాకూటమి నుంచి ఆర్‌జేడీ 26 స్థానాల్లో, జేడీయూ 21, కాంగ్రెస్ 8 చోట్ల పోటీ చేస్తున్నాయి. ఇక ఎన్‌డీఏ నుంచి బీజేపీ 42 స్థానాల్లో తన అభ్యర్థులను నిలిపింది.
గెలుపులో ముస్లింలు, ఈబీసీలే కీలకం...
ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ స్వగ్రామం ఫుల్వారియా(గోపాల్‌గంజ్ జిల్లా) హథ్వా నియోజకవర్గంలో భాగం. తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, సీతామర్హి జిల్లాలు నేపాల్ సరిహద్దులో ఉన్నాయి. ఈ జిల్లాల్లో ముస్లింల జనాభా ఎక్కువ. గత ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. అలాగే షోహార్, సీతామహి, ముజఫర్‌పూర్ జిల్లాల్లో బాగా వెనుకబడిన తరగతుల (ఈబీసీలు) వారి పట్టు ఎక్కువ. ఈ ప్రాంతాల్లో గత ఎన్నికల్లో జేడీయూ ఆధిక్యత సాధించింది. ముజఫర్‌పూర్, సీతామహి జిల్లాల్లో యాదవులు, ఈబీసీల ఓటింగ్ సరళి ఎలా ఉంటుందన్న దానిపై నాలుగో దశ ఫలితాలు ఆధారపడి ఉంటుందని పరిశీలకులు చెప్తున్నారు. ఇప్పటివరకూ జరిగిన మూడు దశల ఎన్నికల్లో రెండు కూటములూ పోటాపోటీగా ఉన్నాయన్న అంచనాల నేపథ్యంలో.. ఈ నాలుగో దశ ఎన్నికలు విజేతని నిర్ణయిస్తాయని భావిస్తున్నారు. ఈ దశలో రికార్డు స్థాయిలో 57.59 శాతం పోలింగ్ నమోదు కావటం తమకు అనుకూలమని బీజేపీ భావిస్తోంది.