బిహార్ ఎన్నికల్లో డబ్బు హవా...
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలంటే పోలింగ్ కేంద్రాల ఆక్రమణ, పోలింగ్ యంత్రాల అపహరణలాంటి అంశాలు తరచుగా వినిపించేవి. ఇప్పుడవి గతించిన అంశాలు. కేంద్ర బలగాలతోని పోలింగ్ కేంద్రాలకు పటిష్ట భద్రతను కల్పించడం, అందుకు వీలుగా పోలింగ్ విడతలను పెంచడం లాంటి చర్యల వల్లన అవి గతకాలపు విద్యలుగా మారిపోయాయి. వాటి స్థానంలో ఇప్పుడు ధనలక్ష్మి తన ప్రభావాన్ని చూపిస్తోంది. నోటుతో ఓటు కొనడం సర్వ సాధారణమై పోయింది. ఈ సంస్కృతి రోజు రోజుకు పెరిగిపోతోంది.
2010లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒకటిన్నర కోటి రూపాయల డబ్బును ఎన్నికల కమిషన్ వర్గాలు పట్టుకోగా గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నాలుగు కోట్ల రూపాయల డబ్బును పట్టుకున్నాయి. ఇప్పడు జరుగుతున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రెండు విడతల పోలింగ్ సందర్భంగా ఇప్పటికే 20 కోట్ల రూపాయలను ఎన్నికల కమిషన్ వర్గాలు పట్టుకున్నాయి. ఇంకా మూడు విడతల పోలింగ్ మిగిలే ఉంది. ఓ టెలివిజన్ ఛానెల్ నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్ కారణంగా మరో 19 కోట్ల రూపాయలను ఆదాయం పన్నుశాఖ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన డబ్బు సంగతి పక్కన పెడితే పట్టుపడకుండా రాజకీయ పార్టీలు, నాయకుల ద్వారా నేరుగా ఓటర్ల జేబుల్లోకి వెళుతున్న డబ్బుకు లెక్కే లేదు.
గతంలో పోలింగ్ కేంద్రాలను ఆక్రమించుకోవడం రిగ్గింగ్ చేయడం, పోలింగ్ యంత్రాలను ఎత్తుకుపోవడంలో ప్రధాన పాత్ర వహించినవారిలో అగ్రవర్ణాల వారిదే పైచేయి కాగా, ఈసారి డబ్బు ప్రలోభపెడుతున్న వారిలో కూడా వారిదే పైచేయిగా కనిపిస్తోంది. డబ్బులు చేతులు మారకుండా ఆధునిక జీపీఎస్ వ్యవస్థ ఆధారంగా రాజకీయ నేతలు, కార్యకర్తల కదలికలపై ఎన్నికల కమిషన్ వర్గాలు గట్టి నిఘా పెడుతున్నప్పటికీ వారికి చిక్కకుండా రాజకీయ నాయకులు వినూత్న పద్ధతులను అనుసరిస్తున్నారు.
మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్‌వై ఖురేషి రాసిన ‘యాన్ అన్‌డాక్యుమెంటెడ్ వాండర్-ది మేకింగ్ ఆఫ్ ది గ్రేట్ ఇండియన్ ఎలక్షన్’ పుస్తకంలో వెల్లడించిన అంశాల ప్రకారం పండుగలు, పబ్బాల పేరిట ఓటర్లకు డబ్బు పంచుతున్నారు. దొంగ పుట్టిన రోజుల పేరుమీద ఓటర్లకు నగదు, చీరలు, దోవతులు తదితర బహుమతులను పంచుతున్నారు. ఓటర్ల గృహాల వద్ద నకిలీ హారతి కార్యక్రమాలను ఏర్పాటుచేసి వాటి ద్వారా డబ్బు పంచుతున్నారు.
తమిళనాడు ఎన్నికల్లో టన్నుల కొద్ది చీరలు, దోవతులతోపాటు వేలాది గ్యాస్ స్టవ్‌లు, వాషింగ్ మిషన్‌లను ఓటర్లకు పంచారని ఆ పుస్తకంలో ఖురేషి తెలిపారు. స్థానిక మనీలెండర్ల ద్వారా కూడా డబ్బుల పంపిణీ జరిగినట్టు ఆయన చెప్పారు. 2009లో మధురైలోని తిరుమంగలమ్ ఉప ఎన్నికల్లో డీఎంకే పార్టీ కార్యకర్తలు ఓటుకు ఐదు వేల రూపాయల చొప్పున పంచినట్టు ఆయన వెల్లడించారు. ఎన్నికల్లో ఈ డబ్బు ప్రభావాన్ని అరికట్టేందుకు లా కమిషన్ చేసిన సిఫార్సులపై కసరత్తు ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు.