
చిన్నారుల మృతిపై స్పందించిన ముజఫర్‌పూర్ ఎంపీ
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో వందకు పైగా చిన్నారులు ఎక్యూట్ ఎన్‌ఫలైటిస్ సిండ్రోమ్ (ఏఈఎస్)తో బాధపడుతూ మరణించిన ఘటనపై స్ధానిక ఎంపీ అజయ్ నిషాద్ స్పందించారు. చిన్నారుల మృతులను తగ్గించేందుకు తక్షణ చర్యలు చేపట్టాల్సి ఉందని అన్నారు. వడగాడ్పులతో పాటు అపరిశుభ్ర వాతావరణం, పేదరికం, మారుమూల ప్రాంతాల్లో నివసించడం చిన్నారులు ఈ వ్యాధితో మృత్యువాత పడటానికి ప్రధాన కారణాలని ఎంపీ విశ్లేషించారు.
రోగులంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వారని, వారు ఉంటున్న ప్రాంతాల్లో అపరిశుభ్రత రాజ్యమేలుతోందని ఈ పరిస్ధితులను చక్కదిద్దాల్సిన అవసరం ఉందని ఎంపీ పేర్కొన్నారు. మరోవైపు చిన్నారులు చికిత్స పొందుతున్న ముజఫర్‌పూర్‌లోని కృష్ణ మెడికల్ కాలేజి ఆస్పత్రిని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సందర్శించి చిన్నారుల ఆరోగ్య పరిస్ధితిని సమీక్షించారు. ముజఫర్‌పూర్‌లో ఏఈఎస్ వ్యాప్తి ప్రబలిన రెండు వారాల తర్వాత సీఎం ఆస్పత్రిని సందర్శించడం పట్ల రోగుల బంధువులు బిహార్ సీఎం నితీష్ కుమార్ రాకను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు.