అతడు ఫీనిక్స్!
బిహార్‌లో కింగ్‌మేకర్‌గా లాలు పునరుత్థానం
పట్నా: చితిలో దహనమైపోయి మళ్లీ బూడిద నుంచి బతికి వస్తుంది ఫీనిక్స్ పక్షి అని గ్రీకు పురాణంలో కథ. రాజకీయంగా ఇక పనైపోయిందనుకున్న ఆర్‌జేడీ అధినేత లాలుప్రసాద్.. సరిగ్గా ఫీనిక్స్ పక్షిలా మళ్లీ ప్రాణం పోసుకున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రులు, ప్రత్యర్థులకన్నా ఎక్కువ సీట్లు సాధించిన ఆయన పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. పదిహేనేళ్ల పాటు బిహార్‌ను ఎదురులేకుండా పరిపాలించిన ఆర్‌జేడీ 2005లో అధికారం కోల్పోయిన తర్వాత.. అవినీతి ఆరోపణలు, కేసులు, జైళ్లతో ప్రతిష్టను, ప్రజాదరణను కోల్పోయి రాజకీయంగా క్రమంగా క్షీణిస్తూ మొన్నటి లోక్‌సభ ఎన్నికలతో నామమాత్రంగా మిగిలిపోయిన లాలూప్రసాద్.. ఈ ఎన్నికల్లో జేడీయూ, కాంగ్రెస్‌లతో మహాకూటమి కట్టి పోటీ చేయటం ద్వారా పునరుజ్జీవనం పొందటమే కాదు.. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో మరోసారి కింగ్‌మేకర్‌గా అవతరించారు.
తిరుగులేని నేతగా రాజ్యమేలి...
బిహార్‌లో 1990లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా లాలుప్రసాద్ ఎన్నికయ్యారు. అనేక ప్రజాకర్షక పథకాలతో సామాన్య ప్రజానీకంలో విస్తృత ఆదరణ సంపాదించుకున్నారు. అప్పటికి లాలుతో కలిసి పార్టీలో ఉన్న నితీశ్‌కుమార్ క్రమంగా దూరమయ్యారు. జనతాదళ్ చీలటంతో 1995 నాటికి లాలు సీఎంగా, పార్టీ నేతగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. 1995 ఎన్నికల్లో 167 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చారు. అయితే.. అవినీతి ఆరోపణల నేపథ్యంలో 1997లో జనతా పార్టీ నుంచి వేరుపడి ఆర్‌జేడీని స్థాపించారు.
సీఎం పదవికి రాజీనామా చేసి.. ఆ స్థానంలో తన భార్య రబ్రీదేవిని సీఎం చేశారు. అనంతరం 2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో 103 స్థానాలతో పెద్ద పార్టీగా నిలిచి.. కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సీఎం పదవి మళ్లీ రబ్రీదేవి చేపట్టారు. అయితే.. 2005 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో ఆర్‌జేడీ కేవలం 75 స్థానాలకు పడిపోయింది. అప్పటికీ పెద్ద పార్టీగా నిలిచింది. మరోవైపు నితీశ్‌తో కూడిన ఎన్‌డీఏకూ మెజారిటీ రాలేదు. మళ్లీ అదే ఏడాది అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆర్‌జేడీ 54 స్థానాలకు పడిపోయింది. జేడీయూ, బీజేపీల ఎన్‌డీఏ భారీ మెజారిటీతో గెలిచింది.
2010 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ ఐదింట నాలుగువంతుల మెజారిటీతో గెలవగా.. ఆర్‌జేడీ కేవలం 22 సీట్లకు పతనమైపోయింది. ఒకప్పుడు భారీ బీసీ-ముస్లిం ఓటు బ్యాంకు మద్దతుతో అజేయంగా కనిపించిన ఆర్‌జేడీ ఆ ఎన్నికల్లో చవిచూసిన పరాజయం ఎంతటిదంటే.. ప్రతిపక్ష నేత హోదా (గుర్తింపు) కూడా దానికి దక్కలేదు. ఇక దాణా కుంభకోణంలో 2013లో కోర్టు లాలును దోషిగా నిర్ధారించి శిక్ష విధించటం ఆయనను వ్యక్తిగతంగా చాలా దెబ్బతీసింది. ఆ తీర్పు వెంటనే ఆయన ప్రజాప్రతినిధి పదవికి అనర్హుడై అప్పటికే ఉన్న లోక్‌సభ సభ్యత్వాన్నీ కోల్పోయారు. అంతేకాదు.. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయటం పైనా నిషేధానికి గురయ్యారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో లాలు తొలిసారిగా తాను ఎన్నికల్లో పోటీ చేయకుండానే పార్టీని పోటీచేయించి నడిపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ఎన్నికల్లో 40 లోక్‌సభ స్థానాల్లో లాలు పార్టీకి కేవలం 4 స్థానాలే దక్కాయి.
ఎన్నికల్లో లాలు మార్కు ప్రచారం..
ఇక ఎన్నికల్లో సైతం లాలు తన మార్కు ప్రచారాన్ని ఉధృతం చేశారు. దేశంలో కులాల ఆధారంగా ఉన్న రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించాలంటూ ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్‌భగవత్ వ్యాఖ్యానించినపుడు.. మండల్ అనంతర రాజకీయాలకు ఇంకా కొనసాగుతున్న రూపంగా పరిగణించే లాలుప్రసాద్ తక్షణమే విరుచుకుపడ్డారు. ఆర్‌ఎస్‌ఎస్ సూచనల మేరకు మోదీ సర్కారు రిజర్వేషన్లను రద్దు చేసే అవకాశముందని గళమెత్తారు. ఈ అంశంపై ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. వరుస బహిరంగ సభల్లో ధ్వజమెత్తారు.